(వడ్డేపల్లి మల్లేశము)
న్యాయమూర్తుల, న్యాయస్థానాలు అనుకుంటే న్యాయపాలనలో చాలా మార్పులు వస్తాయని జస్టిస్ రమణ 48వ ప్రధాన న్యాయమూర్తి అయినప్పటి నుంచి వస్తున్న తీర్పులను, ఆదేశాలను ఉదహరిస్తూ చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొందరయితే మన నోబెల్ శాస్త్రవేత్త సివి రామన్ ఎఫెక్ట్ లాగా ఇది రమణ ఎఫెక్ట్ (Ramana Effect) అని వర్ణించారు. సాధారణ ప్రజల హక్కులకు భరోసా వస్తుందని ఒక విశ్లేషకుడు రాశారు.
జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉండే కాలంలో అనేక జటిల సమస్యలు పరిష్కారమవుతాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య, ప్రఖ్యాత న్యాయపండితుడు ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షి వంటి వారు ధీమా వ్యక్తం చేశారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అనేక సందర్భాల్లో క్రింది స్థాయి నుండి సర్వోన్నత న్యాయస్థానం వరకు పాలనా పరమైన అంశాలపై ,రాజ్యాంగ రక్షణ లపై, ప్రభుత్వాల విధానాలపైనా న్యాయవ్యవస్థ అనేకసార్లు స్పందించి నిర్మోహమాటంగా వ్యవహరించినందునే ఇప్పటికీ న్యాయవ్యవస్థ బలంగా ఉంటూవస్తునమనది. దీని వల్లనే సామాన్యుడికి కొంతయినా మేలు జరుగుతూ వచ్చింది.
ఇపుడు మరింత దూరదృష్టితో ధైర్యంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది అనే విషయాన్ని ఇటీవల కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
భారత ప్రధాన న్యాయమూర్తి గారి వ్యాఖ్యలు- వాస్తవాలు
రెండు రోజుల క్రితం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జాతీయ న్యాయ సేవ ప్రాధికార సంస్థ రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరిస్తూ గౌరవ సీజేఐ రమణ అన్న వ్యాఖ్యలను ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో పాలకులు ,పోలీసులు పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది అని రుజువు అవుతున్నది. వారి మాటల్లోనే చెప్పాలంటే” మానవ హక్కులు, మర్యాద అన్నవి సర్వోన్నతమైన వి. అయితే వాటికి పోలీస్ స్టేషన్లలో అత్యధిక ముప్పు ఏర్పడుతుంది,” అని అన్నారు.
“Custodial torture and other police atrocities are problems which still prevail in our society. The threat to human rights and bodily integrity are the highest in our police stations.”
కస్టడీలో ఇప్పటికే పోలీసులు ఆకృత్యాలు చిత్రహింసలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగ పరమైన హామీలు, రక్షణలు ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్ల లోపల న్యాయపరమైన ప్రాతినిధ్యం లేని కారణంగా అరెస్ట్ అయిన వారికి ఈ లోటు గొడ్డలిపెట్టుగా మారిందని” వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసు చర్యలను అదుపులో వుంచాలంటే రాజ్యాంగ రక్షణ తో పాటు న్యాయ సాయం, అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని అందుకోసం ప్రచారం అవసరమని అన్నారు. అదే సమయంలో ఈ అంశాల పైన పోలీసులకు కూడా అవగాహన కల్పించాలని వారు సూచన చేశారు.
మానవ హక్కుల హరించి వేసి ప్రభుత్వ విధానాన్ని అరికట్ట లేమా?
స్వతంత్ర భారతదేశంలో పోలీసులు సంఘసంస్కర్తలుగా ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలని గాంధీజీ కలలు కంటే, ప్రజల గౌరవ మర్యాదలను కాపాడుతూ వారి ప్రేమాభిమానాలకు పాత్రులు కావాలని రక్షక భటులను కేంద్ర తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారికి దిశానిర్దేశం చేసిన ఈ సన్నివేశాన్ని మనం ఒకసారి మననం చేసుకోవాలి. ఇటీవల భారత ప్రధాని మోదీ కర్తవ్య నిర్వహణలో పోలీసులు ప్రజల నుండి ఆదరాభిమానాలు చూరగొనాలని యువ ఐపీఎస్ అధికారుల సమావేశంలో సూచించడాన్ని కూడా గమనించాలి. టెర్రరిస్టుల అణచివేతలో, శాంతిభద్రత విషయంలో త్యాగాలుచేస్తున్నా, ప్రజల్లో పోలీసులంటే విశ్వాసం సన్నగిల్లుతోంది, ఎందుకు అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.
“Why is not the public trust increasing (in police) despite its officers… laying down their lives to terrorists and to maintain law and order?”
గతంలో నిర్వహించిన దేశవ్యాప్త పలు అధ్యయనాల్లో కూడా పోలీసులంటే ప్రజలకు రక్షణ కల్పించే వారని అభిప్రాయం నాలుగోవంతు ప్రజా జీవితంలో కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం.
ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అంటించిన చురకల లాగానే, పోలీసులు అనుసరిస్తున్న సమాజాన్ని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధానాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు దారి తప్పుతున్న నేటి పాలనా విధానాలకు, పోలీసుల చర్యలకు గుణపాఠంగా భావించాల్సిన అవసరం ఉన్నది.
హింస- కొన్ని దృష్టాంతాలు
కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు సమర్పించిన వివరాల ప్రకారం దేశంలో జ్యుడిషియల్ కస్టడీలో రోజుకు ఐదుగురు ప్రాణాలు విడుస్తున్నారు.
గత మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా పరిశీలిస్తే పోలీసు మరియు జుడిషియల్ కస్టడీ లోపల5,221 మరణించారని చేదు నిజం ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు నివేదించిన నివేదిక ద్వారా తెలుస్తున్నది. ఇందులో పోలీస్ కస్టడీలో చనిపోయిన వారు 348 మంది. ఇదే సమయంలో పోలీస్ స్టేషన్ లోపల 1189 చిత్రహింసల సంఘటనలు జరిగినట్లు కేంద్రం తెలియచేసింది.
ఈ గణాంకాలను చూసిన తర్వాత బయటి లోకానికి తెలియని అకృత్యాలు, అరాచకాలు ఎన్నో ఉన్నాయని పౌర ,మానవ హక్కుల సంఘాల బాద్యులు వ్యక్తం చేయడాన్ని బట్టి మానవ హక్కులు ఎంత ప్రమాదంలో పడ్డాయో అర్థమవుతున్నది.
1996 నుండి 2016 మధ్యన 31,845 వేలకు పైగా లాకప్ మరణాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) గుర్తించడమే కాకుండా గత సంవత్సరం హెచ్ .ఆర్. సి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ ప్రతి మరణం పైన విచారణ సాగాలని, దీనికి బాధ్యులు పోలీసులే అని తేలితే వారికి కఠిన శిక్షలు విధించి అమలు పరచాలని హెచ్చరించింది.
ప్రభుత్వాల స్థాయిలో జరిగిన కృషి:-
చట్టాలు ఎన్ని ఉన్నా అమలు చేయనట్లు, అంతర్జాతీయ తీర్మానాలను కూడా తుంగలో తొక్కి నటువంటి ఘనత మన భారతదేశానికి దక్కినది. సుమారు మూడు దశాబ్దాల క్రితం పోలీసుల చిత్రహింసల నిరోధం పైన ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానం చేస్తే ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఆ తీర్మానంపై భారతదేశం సంతకం చేసినప్పటికీ ఇప్పటివరకు అలాంటి చట్టం ఏది చేయకపోవడం బట్టి పాలకులు ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారో తెలిసిపోతుంది.
ప్రతి అంశాన్ని శాంతిభద్రతల సమస్య గాని చూసే పోలీసు, ప్రభుత్వ విధానం కారణంగా ప్రజల హక్కులను మరిచిపోతూ అకృత్యాలకు పాల్పడడాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు, పోలీసులు నియంత్రించుకోవలసిన అవసరం ఉన్నది.
2010లో చిత్ర హింస నిరోధక బిల్లు లోక్ సభ ఆమోదం పొందినప్పటికీ ఇప్పటికీ చట్టంగా రాని కారణంగా ఇటీవల ప్రభుత్వం చట్టాన్ని చేయడానికి కృషి చేస్తున్నట్లు గా లోక్సభలో తెలిపిన విషయాన్ని ప్రజా సంఘాలు, పౌర, మానవ హక్కుల సంఘాలు కేంద్రం దృష్టికి తరచుగా తీసుకుపోయి ఒత్తిడి చేయవలసిన అవసరం ఉన్నది.
తీర్పులను, కమిటీల నివేదికలను పట్టించుకోని ప్రభుత్వాలు
15 ఏళ్ల క్రితం పోలీసు వ్యవస్థలో రావాల్సిన మార్పులతోపాటు ప్రజల హక్కులను రక్షించాలని ఆదేశాలను సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అన్నీ అరాచకాలే.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో జరిగిన మరియమ్మ లాకప్ డెత్ ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి తాజా ఉదాహరణ. పోలీసుల పట్ల ప్రజలు సంతృప్తి చెందినప్పుడు అదే పోలీసుల పనితనానికి గీటురాయి అవుతుందని వర్మ కమిటీ తోపాటు అనేక సంఘాలు సూచనలు చేసినప్పటికీ దేశంలో అమలు కాకపోవడం పట్ల నేడు న్యాయవ్యవస్థలో ప్రకంపనలు భారీగా కలుగుతున్నవి.
పోలీసు, ప్రభుత్వ విధానాలను ప్రక్షాళన
అనేక దశాబ్దాలుగా పోలీసుల పనితీరు పట్ల కమిటీల తీర్పులు, అంతర్జాతీయ ఒప్పందాలు , న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నప్పటికీ పరిపాలనలో అమలు కాలేదంటే ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ విధానాలలో భారీ ప్రక్షాళన జరగాల్సి ఉన్నది. హక్కులకు భంగం కలిగినప్పుడు జోక్యం చేసుకొని రక్షించే న్యాయశాఖ ఉత్తర్వులను కార్యనిర్వాహకవర్గం అమలు చేయనప్పుడు దానికి ప్రజా ఉద్యమాలు, రాజ్యాంగ రక్షణ గురించిన ప్రచారమే ఎంతో దోహదపడుతుందని విద్యార్థులు, మేధావులు, అభిప్రాయపడుతున్నారు.
న్యూజిలాండ్ ,నెదర్లాండ్స్ ,నార్వే, జార్జియా వంటి చిన్న దేశాలు తమ పోలీసు వ్యవస్థను ఎప్పుడో ప్రక్షాళన చేసుకున్నవి
పరిష్కారాలు,.. తీసుకోవలసిన చర్యలు
గత పదేళ్ల క్రితం నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పోలీసులు ప్రజలు మిత్రులు గా ఉండే టువంటి నూతన వ్యవస్థ కోసం పోలీసులకు శిక్షణ తప్పనిసరి అని చేసిన సూచనను ఖచ్చితంగా ప్రభుత్వాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. లేకుంటే చాలా చిన్న దేశాల ముందు మనదేశం అప్రతిష్టపాలు కాక తప్పదు. పోలీసు వ్యవస్థ లోకి ప్రవేశించే ముందు మానవ విలువలు, రాజ్యాంగ రక్షణలు, చట్టాలు అమలు వంటి విషయాల పట్ల పోలీసులకు అవగాహన కల్పించాలి.
– ప్రజలకు సేవకులు గా ఉండాల్సిన టువంటి పోలీసులు పాలకుల రక్షణలోనే సమయాన్ని గడిపే దుష్ట సంప్రదాయాన్ని తగ్గించాలి.
– కారణాలేవైనా కింది స్థాయి పోలీసు అధికారులపై గల పని ఒత్తిడిని తగ్గించడం ద్వారా వారిలో మానవత్వాన్ని మేల్కొల్ప వచ్చు.
– పోలీసు వ్యవస్థ పై గల రాజకీయ నాయకత్వం, ఒత్తిడి, పెత్తనాన్ని తగ్గించి స్వతంత్ర నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహించాలి.
– శాంతిభద్రతల రక్షణతో పాటు ప్రజల హక్కులను రక్షించడమే తమ పవిత్ర ధర్మమని వాస్తవాన్ని గుర్తింప చేసి పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ప్రజలతో సంబంధాలను మెరుగు పరిచే చర్యలను ప్రభుత్వం చేపట్టాలి.
ప్రజలు, పౌర సమాజం కూడా తమ బాధ్యతను రాజ్యాంగ రక్షణ కోసం సక్రమంగా నిర్వహిస్తూ పోలీసు న్యాయ వ్యవస్థ కు తరచుగా సహకరించాలి. తద్వారా కూడా ప్రజల పట్ల సానుకూల దృక్పథం పోలీసుల్లో పెరిగే అవకాశం ఉంటుంది.
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వి రమణ గారు ఇటీవల రాజ్యాంగ పరమైన న్యాయ వ్యవస్థకు సంబంధించి అనేక అంశాలలో స్పష్టమైన టువంటి విధానాలను ప్రకటించడం సంతోషించదగిన ది. వారి విధానాలను, వ్యాఖ్యలను ప్రభుత్వాలు స్వీకరించి ప్రజా జీవితంలో పోలీసుల ద్వారా ప్రతిబంధకం అవుతున్న సందర్భాలు పునరావృతం కాకుండా మెరుగైన చర్యలను చేపట్టి ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు, న్యాయవ్యవస్థ లోపల విశ్వాసాన్ని పెంపొందించ వలసిన అవసరం ఉంది. అప్పుడే రాజ్యాంగ రక్షణ లకు మద్దతు లభించి అకృత్యాలు అంతమై పోతాయి.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ)