(యనమల రామకృష్ణుడు)
రాష్ట్ర ప్రభుత్వ నిధులకు మంత్రివర్గం ట్రస్టీయే గాని యజమానులు కాదు. ప్రభుత్వ నిధులు ప్రజాధనం. ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి నిబంధనలు ఉన్నాయి. ప్రజల కోసమే ఖర్చు చేస్తే ప్రభుత్వం రాజ్యంగ ఉల్లంఘనలకు ఎందుకు పాల్పడినట్లు?
నిధుల ఖర్చులో ఎందుకు పారదర్శకత పాటించలేదు. అసెంబ్లీకి, కాగ్, కేంద్ర ఆర్థిక సంస్థలకు తెలియకుండా ఎందుకు దాచారు? మంత్రివర్గం అవినీతి, దుబారా చేస్తున్నందునే సమాచారాన్ని రాజ్యాంగ సంస్థలకు తెలియకుండా తొక్కిపెట్టారు. మంత్రివర్గం చేసిన తప్పిదాలకు అధికారులను బాధ్యులనుచేసి శిక్ష వేయడాన్ని అన్ని వర్గాలు ఖండిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తోంది.
తెలుగుదేశం ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి ఎక్కువేమి ఖర్చు చేయలేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ తెలుగు దేశం ప్రభుత్వం 16 లక్షల మందికి ఇవ్వగా.. దాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం 11 లక్షల మందికి కుదించింది.
చంద్రన్న బీమా 2.47 కోట్ల మందికి వర్తింపజేయగా, వైసీపీ ప్రభుత్వం 67 లక్షలకే కుదించింది. తెలుగుదేశం ప్రభుత్వం సున్నా వడ్డీ రైతు రుణాలను రూ.3 లక్షల వరకు వర్తింపజేయగా జగన్ రెడ్డి రూ.లక్షకు కుదించారు.
డ్వాక్రా రుణాలకు సున్నా వడ్డీని టీడీపీ రూ.3 లక్షల వరకు వర్తింపజేయగా జగన్ రెడ్డి రూ.లక్షకే కుదించారు. సంక్షేమం కూడా తెలుగుదేశం కన్నా వైసీపీ ప్రభుత్వం ఎక్కువేమి ఇవ్వలేదు. సంక్షేమ పథకాల వల్ల, కరోనా వల్ల అప్పు చేయాల్సి వచ్చిందనే వైసీపీ వాదనలో పసలేదు.
కరోనాకు కూడ కేంద్రం ఇచ్చిన నిధులే ఖర్చు చేశారు తప్ప రాష్ట్రం నిధులు ఖర్చు చేసింది తక్కువే. అప్పుల సంక్షోభానికి మంత్రివర్గ అవినీతి, దుబారాలే ప్రధాన కారణం. అలాగే వైసీపీ అరాచకం వల్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోవడం, కొత్త పెట్టుబడులు రాకపోవడం ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి.
తెలుగుదేశం ఎక్కువ అప్పులు చేయడంవల్ల నేడు ఆర్థిక సంక్షోభం వచ్చిందనే ఆర్థిక మంత్రి వాదన పచ్చి అబద్దం.
జగన్ రెడ్డి ప్రభుత్వం 25 నెలల్లో చేసిన అప్పులు
1. 2019-20 రూ.39,686.56 కోట్లు
2. 2020-21 రూ.55,161.51 కోట్లు
3. 2021 ఏప్రిల్ రూ.19,714.04 కోట్లు
4. కార్పొరేషన్ల ద్వారా రూ.34,650.00 కోట్లు
మొత్తం: రూ.1,49,212.11 కోట్లు (ఆధారం : కాగ్ రిపోర్టు & ఎస్.టి.సి డాక్యుమెంట్స్)
చంద్రబాబు ప్రభుత్వం 60 నెలల్లో చేసిన అప్పులు
1. 2014-15 రూ.18,089.11 కోట్లు
2. 2015-16 రూ. 5,110.15 కోట్లు
3. 2016-17 రూ.23,559.96 కోట్లు
4. 2017-18 రూ.25,064.93 కోట్లు
5. 2018-19 రూ.38,282.83 కోట్లు
మొత్తం : రూ.1,30,146.98 కోట్లు
(ఆధారం : ఆర్.టీ. లెటర్ నెం.f 01-బడ్జెట్ /7/2020 C&M)
తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదికి సరాసరిన రూ.26 వేల కోట్లు అప్పు చేయగా, వైసీపీ ప్రభుత్వం ఏడాదికి బడ్జెట్ అప్పులే సరాసరిన రూ.50 వేల కోట్లు చేసింది. బడ్జెట్ యేతర అప్పు రెండేళ్లలో మరో రూ.34 వేల కోట్లు చేసింది. అయినా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు.
సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ రూ.64 వేల కోట్లు ఖర్చు చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 32లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. జగన్ రెడ్డి రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసింది కేవలం రూ.9,450 కోట్లు మాత్రమే.
తెలుగుదేశం రూ.36 వేల కోట్లు ఖర్చు చేసి 10 వేల మెగావాట్లు విద్యుత్ ను అధనంగా ఉత్పత్తి చేసి కరెంటు కోతలు నివారించింది. విద్యుత్ చార్జీలు పెంచిందే లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం సుమారు 1000 మెగావాట్లు మాత్రమే పెంచింది. టీడీపీ 27 వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించగా.. వైసీపీ నిర్మించింది 300 కి.మీ మాత్రమే. ఇలా అభివృద్ధికి తెలుగుదేశం చేసిన ఖర్చుతో పోలిస్తే వైసీపీ చేసింది దిగదుడుపే.
జగన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు. సంక్షేమం కుదించారు. అయినా మితిమీరి అప్పులు చేశారు? అవినీతి కోసమే అప్పులు చేశారు. ప్రతి స్కీంలోనూ స్కాం చేశారు. సెంటు పట్టా పేరుతో అధిక ధరలకు భూములు కొని, మెరక పేరుతో రూ.6,500 కోట్లు తినేశారు. ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి ఇసుక ధరలు పెంచి వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. గనుల్లోనూ వేల కోట్లు దోపిడీ చేస్తున్నారు.
అలాగే దుబారా కూడా తారాస్థాయిలో చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు, ఆస్తులకు వైసీపీ జెండా రంగులు వేయడానికి వేల కోట్లు దుబారా చేశారు. సలహాదారుల పేరుతో, కోర్టు ఖర్చుల పేరుతో, బియ్యం వాహనాల పేరుతో, 104, 108 అంబులెన్సుల పేరుతో, వాలంటీర్ల పేరుతో, పత్రికా ప్రకటనల పేరుతో వేల కోట్లు దుబారా చేస్తున్నారు.
వైసీపీ నేతల అరాచకాలతో దాడుల వలన పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. వైసీపీ ఎంపీ బెదిరింపులతో 17 కియా అనుబంధ సంస్థలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. రూ.24 వేల కోట్లతో రామాయపట్నంకు వచ్చిన అసియా పేపరు మిల్లు వెళ్లిపోయింది. లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. కొత్త పెట్టుబడులు రాలేదు. అయినా వారి అవినీతి, దాడులు విరమించుకోలేదు.
అమరరాజా ఫ్యాక్టరీ ఒక్క దాని వల్లే రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా రూ.1,200 కోట్లు ఆదాయం వస్తోందని వార్త. రాజకీయ కక్షతో దాన్ని తమిళనాడుకు తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు.
భారతి సిమెంటు ఫ్యాక్టరీలోను, అరబిందో ఫార్మాలోను ఎక్కువగా పొల్యూషన్ ఉంది. అమరరాజా ఫ్యాక్టరీ వలన పొల్యూషన్ వస్తోందని స్థానికుల నుండి ఇంత వరకు ఒక్క ఫిర్యాదు కూడా రాని మాట వాస్తవం కాదా.?
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి వైసీపీ నేతల అవినీతి, దుబారా, అరాచకం, పెట్టుబడులు తరిమేయడమే ప్రధాన కారణాలే కానీ.. సంక్షేమం, కరోనా కాదు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులతో, అధికారులు, ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ వారి దోపిడీ నుండి దృష్టి మళ్లిస్తున్నారు. సెక్రటేరియేట్ ఉద్యోగులపై చర్యలు కూడా ఈ కోవలోనివే. తప్పులు మంత్రివర్గానివి. శిక్షలు అధికారులకు, ఉద్యోగులకా?
ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారం ప్రజలకు తెలియాల్సిందేనన్న ఉద్దేశ్యంతో టీడీపీ ప్రభుత్వం అన్నింటినీ డిజిటలైజ్ చేసి పబ్లిక్ డొమైన్ లో ఉంచింది. కాగ్ నివేదిక, అసెంబ్లీలో పెట్టే ఎఫ్ఆర్బీఎం రిపోర్టులు, బడ్జెట్ ఎక్స్ పెండిచర్, సీఎఫ్ఎంఎస్ ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండేవి. అలాంటి సమాచారాన్ని పనిగట్టుకుని లీక్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం గుర్తించాలి.
ముఖ్యమంత్రి అండ్ కో తమ అవినీతి, దుబారాతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దివాళా తీశారు.
ఉద్యోగులకు 6 డీఏలు పెండింగ్ ఉన్నాయి. పీఆర్సీ ఇవ్వలేదు. సకాలంలో వేతనాలివ్వడం లేదు. ఎప్పుడిస్తారో తెలియదు. వేతనాల చెల్లింపునకు సరైన విధానమంటూ లేదు.
ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నారు. అడ్డగోలుగా దుబారా చేస్తున్నారు. 2019-20లో 57 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లారు. స్పెషల్ విత్ డ్రాల కోసం 37 రోజులు, వేతనాల కోసం 128 రోజులు.. మొత్తంగా ఏడాదిలో 221 రోజులు అప్పులకు వెళ్లారు.
ఏడాదిలో రూ.60,371 కోట్ల అప్పులు చేశారు. రెండేళ్లలో సగటు ఆర్ధిక లోటు 4.8%, ద్రవ్యలోటు 4.8%, రెవెన్యూ లోటు 3.1%, అప్పులు 33.7% చొప్పున ఉన్నాయి. ఇవన్నీ ఎఫ్ఆర్బీఎం పరిమితులకు విరుద్ధంగా ఉన్నాయి.
రెండేళ్లలో సాధించిందేమీ లేదు. అప్పులు తప్ప ఆదాయం సృష్టి లేదు. ఇలాంటి సమాచారం మొత్తం పబ్లిక్ లో ఉండగా.. ఎవరో పనిగట్టుకుని లీక్ చేయాల్సిన అవసరమేంటి.? ప్రభుత్వం తన అవినీతిని మోసకారి తనాన్ని సమర్ధించుకోవడం కోసం ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేయడం దుర్మార్గం.
సెక్యురిటీలను ఓపెన్ మార్కెట్ లో వేలం వేయడం ద్వారా తీసుకునే అప్పులకు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చాలా రాష్ట్రాలు వెనక్కుపోతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏ మాత్రం లెక్కచేయకుండా అందినకాడికి అప్పులు చేస్తోంది. ఇలా తీసుకునే అప్పులకు దాదాపు 7 శాతం వడ్డీగా చెల్లించాల్సి వస్తుందని 14 రాష్ట్రాలు అప్పులు తీసుకోవడం మానేస్తే ఏపీ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. అప్పులపై అప్పులు చేస్తోంది.
గత ఏడాది రూ.12000 కోట్లు రుణం సేకరించిన కర్నాటక ఈ ఏడాది ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన అప్పుల జోలికి అసలు వెళ్లలేదు. కానీ, అప్పుల ఊబిలో చిక్కుకుని క్లాసిక్ డెట్ లోకి వెళ్లిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అప్పులు చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆధ్వర్యంలోని జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాల కారణంగానే రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆర్ధిక కష్టాలను అధిగమించాలనే ఆలోచన మాని.. సమాచారం బయటకొచ్చిందని అక్కసు ప్రదర్శించడం ప్రభుత్వ నీతి బాహ్య పాలనకు నిదర్శనం.
(యనమల రామకృష్ణుడు, కౌన్సిల్ లో ప్రతిపక్ష నేత, మాజీ ఆర్థిక మంత్రి)