తెలంగాణను కాపాడటానికే ఈ మొరుగుడు!

(జోగు అంజయ్య)

ఈ మధ్య తెలంగాణ పాలక ప్రభువులు పదే పదే ఒక మాటను అలవోకగా విడుస్తున్నారు .”కుక్కలు మొరుగుచున్నాయి,మేము పట్టించుకోవడం లేదు, మా పని మేము చేసుకుంటూ పోతున్నాము “అని వివిధ సభలలో సమావేశాలలో అంటున్నారు.

మొన్నామధ్య సాగర్ ఉపఎన్నిక సభలో మరియు  ఈ మధ్య కాలంలో సొంత జిల్లాలో  జరిగిన కార్యక్రమంలో అన్నారు. పత్రికలలోను వచ్చినవి. వీటిని మామూలుగా తీసుకోవాలా వద్దా అనేది తెలంగాణ ప్రజల విచక్షణకు వదిలేసినా ఆత్మగౌరవం అనే మాటకు పట్టింపు ఉన్న వారు మాత్రం మౌనంగా ఉండలేరు.ఈ మాటలు రాజకీయంగా విభేదించే ప్రతిపక్షాలను  అన్నా, ప్రజలను ఉద్దేశించి అన్నా కూడ ఓర్చుకోవలసిన మౌనంలోకి తెలంగాణ సమాజం వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆందోళన కలిగిస్తుంది.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక ఉద్యమ సమయంలో ప్రతి సందర్భంలో ఆత్మగౌరవం మాటను ముందు పెడుతూ వచ్చాము. దానిని ప్రధాన నినాదంగా మలిచాము. మరి ఇప్పుడు దానిని మరచిపోయి బతుకుచున్నామా అని ఎవరికి వారు ప్రశ్నలు వేసుకోవాలి.

తెలంగాణలో కొన్ని మాటలను మంచిని తెలపడానికి చెడును తెలపడానికి వాడుతారు. కుక్కకున్న విశ్వాసం మనిషికి లేదనే ఒక సందర్భంలో ,కుక్క బతుకు ఎందుకు అని మరొక విదంగా వాడుతున్నారు. అంటే ఒక మనిషి జీవితం బజారున పడడాన్ని సమాజం మానసికంగా ఒప్పుకోదు. అందుకే కలో గంజో తాగుతూ గౌరవంగా బతుకాలనే ఒక సదుద్దేశం ఇందులో దాగి ఉంది.

మామూలుగా చెప్పాలంటే కుక్కలు అర్ధరాతి పూట మొరిగితే దొంగో దొరో వాటికి కనపడి ఉంటాయని భావిస్తాము. నిద్రాభంగం అవుతుంది .లేచి లైట్లు వేసి అటు ఇటు తిరుగుతూ ఏమి లేదని నిర్దారించుకొని  మళ్ళీ ప్రశాంతత ఏర్పడితే నిద్రలోకి జారుకుంటాము. కుటుంబాలను యజమానులను కాపాడటానికి అవి సర్వ శక్తులు ఒడ్డుతాయి. సెంట్రీ డ్యూటీ చేస్తాయి. ఇంటికి మొదటి రక్షణ చర్యగా మానవులు కుక్కను పెంపుడు జంతువుగా పెంచుకుంటారు. విశ్వాసంలో దానికి సాటి ప్రపంచంలో మరేదీ లేదు అని ప్రతి ఒక్కరికి తెలుసు.

మరి ఇప్పుడు తెలంగాణలో కుక్కలు మొరుగుతున్నాయి అనే మాటలు వినపడతున్నాయి కాబట్టి ప్రజలు మేల్కోవాల్సి ఉంది. భూదొంగలో మెడికల్ దొంగలో కరోనా దొంగలో ఏవో తిరుగుచున్నాయి కాబోలు. ప్రత్యక్షంగా నో పరోక్షంగానో ఏదో దోపిడి వాటి కండ్లకు కనపడుతున్నాయేమో ! అవి చేసే పని అవి చేస్తున్నాయి. మేల్కోవాల్సింది చూసుకోవాల్సింది ప్రజలే అని అర్థం.

తెలంగాణను కాపాడటానికి కాపలా కుక్కలా ఉంటానని ఒకనాడు మాట ఇచ్చిన వ్యక్తే  ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఉన్నాడు. కుక్క ఎలాగు విశ్వాసం తప్పదు. లేనిదల్లా మనిషికే. మనిషిలో ఇది లోపిస్తే జరగరాని పనులు జరుగుతాతాయి. కాపలాదారు సరిగా లేకపోతే మరొకరిని నియమించుకునే స్వేచ్చ ప్రజలకు ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల సంపద అంతా భూమి రూపంలో వస్తు రూపంలో సేవల రూపంలో ఉంది. వీటిలో ఏ మేరకు దోపిడి జరిగినా  అది ప్రజల కంటపడితే కాపలాదారుకు చెబుతారు. అలా చెప్పే భాష రాజకీయంగా ఉండొచ్చు,ప్రతిపక్షంగా ఉండొచ్చు ,ప్రజా సంఘాలుగా ఉండొచ్చు ,ప్రజా సమూహంగా ఉండొచ్చు.

ఏడేండ్లుగా ప్రజలు ఇదే చేస్తున్నారు. ధర్నాచౌక్ రద్దు అన్న దగ్గర నుండి నేటి కరోనా వరకు ఎన్నో చెబుతున్నారు. భూములు కొల్లగొట్టబడుచున్నాయని కొలువులు నింపడం లేదని వైద్యం అందడం లేదని నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని ఇలా పలు రకాల సమస్యలపై  అడుగుచున్నారు. ఇవి ఎక్కువైనప్పుడు కాపలాదారునికి అసహనం పెరిగిపోతుంది. చేంతాడంత చేస్తున్నాము మూరెడు మొరిగితే ఏమవుతుందని సమర్దించుకుంటున్నారు.

రాష్ట్రం ధనికమైనదిగా ఉంటే ఎన్ని పనులైనా చేయవచ్చు. తప్పులేదు. కానీ లక్షల కోట్లు అప్పుతెచ్చి వాటికి వడ్డీ చెల్లిస్తూ ఉంటే  దాని ప్రభావం పథకాలపై సంక్షేమ రంగంపై తప్పక పడుతుంది. ఉద్యోగులకు ఏమి చెప్పారో ఏమి చేశారో మొత్తం సమాజానికి తెలిసిపోయింది. పీఆర్సీ అడిగినందుకు పిచ్చెక్కించారు. బకాయిలను మరచిపోయేంత ముసలితనం తెప్పించారు. చిన్న చిన్న బిల్లులు కూడా  నెలల తరబడిగా పెండింగ్ పెడితే దేనికి సంకేతమో చెప్పక్కర్లేదు. కరోనా పేరుచెప్పి, కాళేశ్వరం పేరు చెప్పి ఎన్నని సమర్దించుకుంటారు.

ప్రచారం కోసం విమర్శలు చేస్తున్నారని అనుకుంటే చాలా పొరపాటు. వాస్తవ పరిస్థితులు తెలంగాణలోని ప్రతి పౌరుడుకి తేటతెల్లంకానున్నాయి. పనులు చేసి బిల్లులు రాక గ్రామ సర్పంచులు ఆత్మహత్యకు పోతున్నారంటే సిగ్గుపడాల్సి వస్తుంది. బంగారు తెలంగాణను బేరీజు వేసుకుంటున్న ప్రజలు మనకు నిత్యం మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. ప్రాజెక్టుకు భూమి ఇచ్చి పరిహారం రాక నిలువ నీడను కూల్చితే అదే స్థలంలో చితిని పేల్చుకున్న రైతు స్థితిని తలచుకొని ఆ రాత్రి తెలంగాణ సమాజం నిదురపోలేదంటే అతిశయోక్తి కాదు. అధికారం కోసమే ప్రతిపక్షాలు గాయి గాయి చేస్తున్నాయని ఎందుకు అనుకోవాలి.

ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ అత్యంత సమర్థవంతమైన సమస్యల పరిష్కార వేదిక. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పుడు గౌరవస్తాయి సానుకూలతను చూపాలి. చర్చించాలి. అఖిలపక్ష సమావేశాలు పెడితే లాభమే తప్ప నష్టం ఏముంటది. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ తరానికి చేరేలా ప్రయత్నం చేస్తున్నారా అని ఆలోచించండి.

తెలంగాణ తెచ్చుకుంది రాజకీయ ఘర్షణల కోసం కాదు. పగ పంతాల కోసం అసలే కాదు. ఎన్నికలలో ఓడినంత మాత్రాన నాయకుడి మాటకు విలువలేదనుకోవడం దుర్మార్గమైనది. ఉద్యమంలో ఒక్కడే ఉంటే ఎండిపోయిన వాగులా ఉండేది.

సబ్బండ వర్గాలు కదలడం వలన ఎన్నో పాయలుగా వాగులుగా నదులుగా చివరికి సముద్రంగా మారింది. త్యాగాల ప్రవాహాన్ని చూసి ఇగ తెలంగాణ ఇవ్వక తప్పదనే స్థితికి ఉద్యమం చేరింది. వచ్చింది. అలాంటి తెలంగాణను కాపాడటానికి ప్రజలను మేల్కొలపడానికి  కుక్కలు మొరుగుచున్నాయి అని అర్థం చేసుకుంటే మంచిది.

(జోగు అంజయ్య, జనగామ. సెల్. 8008957480)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *