(రాఘవ శర్మ)
రచయిత, ఒకనాటి విప్లవ రచయిత, పాత్రికేయుడు, సంపాదకుడు, నిత్య అధ్యయన శీలి, వైద్యుడు, కార్మికనాయకుడు, రాజకీయవేత్త, అలనాటి కడపజిల్లా ఫ్యాక్షన్ రాకీయాలలో ఎదురు లేని వీరుడు, హత్య కేసులో జీవిత ఖైదు పడి, బైటపడిన అదృష్టవంతుడు, తెలుగు నాట ఇన్ని విశేషణాలున్న ఏకైక శక్తి ఎవరంటే ఏం చెపుతాం!?
ఆయనే డాక్టర్ ఎం.వి.రమణా రెడ్డి!
ఎనభై ఏళ్ళకు దరిదాపులకు చేరిన రమణారెడ్డి రాత్రి పగలు ఆక్సీజన్‌పై జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఒక పక్క అధ్యయనాన్ని, మరొక పక్క రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.
లేవలేని స్థితిలో కూడా అతికష్టంపైన కుర్చీలో కూర్చుని, ఎదురుగా మంచంపైన పుస్తకాలు పెట్టుకుని, ఒణుకుతున్న చేతులతోనే మాక్సిమ్ గోర్కీ ‘అమ్మ’ నవలను అనువాదం చేస్తున్నారు. ఆ అనువాదం చివరి దశకు వచ్చింది.
రమణారెడ్డిని చూడడానికి తిరుపతి నుంచి నేను, భూమన్, గుంటూరు నుంచి చెరుకూరు సత్యనారాయణ శుక్రవారం ప్రొద్దుటూరు వెళ్ళినప్పుడు మాకు కనిపించిన దృశ్యం అది.
‘జర్నలిస్టు రాఘవ శర్మ ‘ అంటూ భూమన్ నన్ను పరిచయం చేయబోయారు. ‘నాకెందుకు తెలియదు, భూమన్ ‘ అన్నారు.
రమణారెడ్డి, భూమన్, చెరుకూరి సత్యనారాయణ, ఇమాం(కదలిక) ఒక నాటి ఉద్యమ సహచరులు, ప్రాణమిత్రులు. అంతా ఒక సారి కలుద్దాం, మళ్ళీ కలుస్తామో లేదో అనుకుని బయలుదేరారు.భూమన్‌తో కలిసి వెళ్ళే అవకాశం నాకు కలిగింది.
కానీ, మరొక ఆత్మీయుడు ఇమాం రాలేకపోయారు.
మేం తిరుపతిలో బయలుదేరాం అని చెప్పగానే రమణారెడ్డికి ప్రాణం లేచొచ్చింది.’ఎక్కడివరకొచ్చారు భూమన్, ఎప్పటికల్లా రాగలుగుతారు’ అంటూ మేము దారిలో ఉండగా రెండుమూడుసార్లు ఫోన్ చేశారు.
మమ్మల్ని చూడగానే రమణారెడ్డికి ప్రాణం లేచొచ్చి, ముఖం విప్పారింది. రమణారెడ్డితో మాటామంతీ మొదలైంది.
‘మాక్సిమ్ గోర్కీ (Maxim Gorky March 28,1868- June 14, 1936) నవల అమ్మ (Mother 1906) గతంలో చాలా మంది అనువాదం చేశారు కదా!’అన్నారు భూమన్, చెరుకూరి సత్యనారాయణ. ‘అవ్వన్నీ సంక్షిప్తం, ఇది సంపూర్ణం. ఈ నాటి రీడర్‌కు బోర్ కొట్టే ఆ నాటి రాజకీయ విషయాలను కొన్నిటిని ఒదిలేసి రాస్తున్నాను’ అన్నారు రమణారెడ్డి. ఈ తరానికి రమణారెడ్డి ‘అమ్మ’ ని గుర్తు చేయాలనుకోవడం గొప్ప విశేషం. రష్యా సాహిత్యం ’అమ్మ‘ నవలకి ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు.
అయిదు వందల పేజీల పుస్తకం. ‘మీ జీవిత విశేషాలు ఎవరైనా రాశారా’ అడిగాను నేను. రాయలేదన్నారు.
‘రమణారెడ్డి.. నీ జీవిత చరిత్ర రాయచ్చకదబ్బా. ఎంత విలువైంది’ అన్నారు భూమన్. ‘రాయాలి. దీనికే నా శక్తి సరపోవడం లేదు’ అన్నారు రమణారెడ్డి.
‘చాలా విలువైంది. నీవు రాసి తీరాలి’ అన్నారు చెరుకూరి సత్యనారాయణ. ‘ఇది అయిపోతే జీవిత చరిత్ర రాయడానికి ప్రయత్నం చేస్తాను’ అన్నారు.
‘ఈ రాజకీయాలు, ఈ టెన్షన్, ఇంత వైవిధ్యమైన జీవితం కదా! ఎట్ల రాస్తున్నావ్ !? అసలు నీపైన ఎవరి ప్రభావం ఉంది!?’ అడిగారు భూమన్.
‘నా పైన తిక్కన ప్రభావం ఉంది. కవిత్వంలో తిక్కన అంటే నాకు చాలా ఇష్టం. వచనంలో నాపైన చలం ప్రభావం ఉది. కథనంలో మధురాంతకం రాజారాం ప్రభావం ఉంది’ అన్నారు రమణారెడ్డి.
‘మధురాంతకం నరేంద్రరాసిన మనోధర్మపరాగం వచ్చింది చూశావా? ‘ అడిగారు భూమన్. చాలా బాగుంది అన్నారు. ‘రాజారాం, నరేంద్ర తండ్రీకొడుకులైనా రచనావిధానంలో ఇద్దరికీ తేడా ఉంది. రాజారాం రచన సరళంగా ఉంటుంది. నరేంద్రది కొంచెం కాంప్లికేటెడ్.అంటే బాగుండదని కాదు. అదొక శైలి. అదికూడా గొప్ప శైలి ‘ అన్నారు.
తిక్కన అంటే రమణారెడ్డికి ఎంత ఇష్టమో!ఆయన ఇంట్లోకి ప్రవేశిస్తుండగానే వరండాలో ఒక శిలాఫలకంపైన తిక్కనపద్యం చెక్కి ఉంది.
‘ఒరు లేయని యొనరించిన
నరవర! అప్రియము తన మనంబునకగు, తా
నొరులకు అవి సేయకునికి
పరాయణము పరమధర్మ పథముల కెల్లన్
-తిక్కన
‘రాయలసీమ రచయితలకు సింగమనే నారాయణ ఒక పెద్ద దిక్కు. ఆయన పోవడం నన్ను బాధించింది భూమన్’ అన్నారు రమణారెడ్డి. రమణారెడ్డి చేతులు ఒణుకుతూనే ఉన్నాయి.
‘మీకేమైనా పార్కిన్సన్ ఉందా’ అన్నాను. లేదన్నారు. ఇప్పుడేం రాస్తున్నారు అని అడిగారు నన్ను. ‘తిరుపతి జ్ఞాపకాలు రాస్తున్నాను. ట్రెండింగ్ తెలుగు న్యూస్ డాట్కాం లో వస్తున్నాయి’ అన్నాను. ‘పత్రికలకు రాయచ్చు కదా’ అన్నారు.
‘జాతీయ రాజకీయాలపైన వారానికొక అనువాద వ్యాసం మన తెంగాణాలో రాస్తున్నాను’ అని చెప్పాను. కాసేపు పత్రికలపైన మా చర్చ సాగింది.
శ్రీశ్రీ మహాప్రస్థానం మొదలైన గీతాలు విశ్వేశ్వరరావు పెద్ద సైజులో అచ్చేసిన పుస్తకాన్నిరమణారెడ్డికి చెరుకూరి సత్యనారాయణ బహుకరించారు.చెరుకూరి సత్యనారాయణ ఆరోగ్యమూ అంతంత మాత్రమే. అయినా లెక్క చేయకుండా రమణారెడ్డి కోసం గుంటూరు నుంచి కారులో అనేక గంటలు ప్రయాణం చేసి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చారు.
నిలువెత్తు ‘మహాప్రస్థానం’ రావాలని శ్రీశ్రీ కలలు కన్నాడు. నిలువెత్తు కాకపోయినా పంతొమ్మిదిన్నర అంగుళాల పొడవు, పదమూడున్నర అంగుళాల వెడల్పు ఉన్న ఈ పుస్తకాన్ని చూసి రమణారెడ్డి చాల ముచ్చటపడిపోయారు.
‘రాయలసీమ కన్నీటి గాథ ను అప్ డేట్ చేసి రాయచ్చు కదా ‘ అడిగారు భూమన్ . ‘ఏముంది అప్ డేట్ చేయడానికి. రాయలసీమ పరిస్థితి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది కదా ‘ అన్నారు.
‘ప్రపంచ చరిత్రనాలుగు భాగాలు రాశాను. అన్నిటికంటే చాలా కష్టతరమైంది చరిత్ర రచన. ఎన్నో పుస్తకాలు రిఫర్ చేయాలి. ఎంత చాకిరీ అబ్బా! రాస్తే ఇంకా మూడు భాగాలు ఉంది. రాయలేక ఒదిలేశా. శరీరం సహకరించడంలేదు’ అన్న రమణారెడ్డి మాటలు వింటుంటే బాధనిపించింది.
ఇంకా చదవాలని, ఇంకా రాయాలని, ఇంకా ఏదో చేయాలని తపన. ఆ తపనే ఆయన జీవిత కాలాన్ని పెంచుతున్నట్టుంది. చిరకాల స్నేహితులు రమణారెడ్డి, భూమన్, చెరుకూరి సత్యనారాయణ మొన్న శుక్రవారం కలవడం ఒక మంచి జ్ఞాపకం.
ఈ రోజు ఆదివారం స్నేహితుల దినోత్సవం నాడు గుర్తు చేసుకోవడం యాదృశ్చకం.