ఉద్ధం సింగ్ వర్ధంతి నేడు, ఉద్ధం సింగ్ ఎవరో తెలుసా?

(వడ్డేపల్లి మల్లేశము)

ఉద్ధమ్ సింగ్ ఎవరు?

1910 సంవత్సరంలో ఆంగ్లేయ ప్రభుత్వం భారతీయ ప్రజల ప్రతిఘటనను
సాకుగా చూపి ప్రజలను నియంత్రించడానికి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలు చేసే చట్టాన్ని తీసుకువచ్చింది.

ఈ అతి పాశవికమైన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు, నిరసన కారులు, దేశభక్తులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తీసుకున్నారు.

ఇందులో భాగంగా 1919 ఫిబ్రవరి 10వ తేదీన దేశ వ్యాప్తంగా అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేస్తే దానికి నిరసనగా 1919 ఏప్రిల్ 13 వ తేదీన అమృతసర్ లోని జలియన్వాలాబాగ్ ప్రదేశంలో కార్యకర్తలు ప్రజలు శాంతియుతంగా సమావేశమయ్యారు.

వేలమంది శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సందర్భంలో అప్పుడు అనాథాశ్రమము లో శిక్షణ పొందుతున్న 19 ఏళ్ల బాలుడొకడు మంచినీళ్లు సరఫరా చేయడానికి తన బృందంతో సహా వచ్చి సేవలు అందించాడు. ఆ బాలుడే ఉద్దమ్ సింగ్ (26 డిసెంబర్1899 –31 జూలై 1940).


క్రూరుడయిన  బ్రిటిష్ అధికారిని హతమార్చేందుకు 20 సంవత్సరాలు వేచి చూసిన యోధుడు…


జలియంవాలాభాగ్ తోటలోకి ఉన్న ఒకే ఒక్క మెయిన్ గేటు ను తీసి జనరల్ డయ్యర్ తన సిబ్బందితో సహా ప్రవేశించి సైన్యానికి కాల్పులు జరపమని ఆదేశించాడు. పదినిమిషాలు కాల్పులు జరుపగా వెయ్యి మంది చనిపోగా రెండు వేలకు పైగా క్షతగాత్రులయ్యారు. 1650 రౌండ్ల కాల్పులు జరిపినట్లు జనరల్ డయ్యర్ తెల్లవారి ప్రకటించడాన్ని మనం ఇక్కడ గమనించాలి.

ఈ సంఘటన నుండి బయటపడ్డ ఆ 19 ఏళ్ల బాలుడు గుట్టలుగా పేరుకుపోయిన శవాలను చూసి చలించిపోయి కాల్పులకు కారణమయిన నరహంతకుని ఎలాగైనా చంపుతానని రక్తంతో తడిసిన మట్టిని చేత పట్టుకొని ప్రతిజ్ఞ చేశాడు.

జనరల్ డయ్యర్ హత్యకు ఉద్దంసింగ్ ప్రయత్నాలు

తన ప్రతిజ్ఞను రుజువు చేసుకోవడానికి, దేశ మాత సేవలో పునీతం కావడానికి, తుపాకీ కాల్చడంలో శిక్షణ ప్రారంభించారు. భగత్ సింగ్ స్ఫూర్తి తో విప్లవ వీరులతో కలిసి పని చేయడంతో పాటు 1924లో గద్దర్ పార్టీలో చేరాడు. విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించి, జైలు శిక్ష నుంచి విడుదలైన తర్వాత లండన్ లో ఉన్న డయ్యర్ ను చంపే వరకు తిరిగి రానని స్వర్ణ దేవాలయం లోని సరోవరంలో స్నానం చేసి ప్రమాణం చేశాడు.

అందుకోసం ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, జర్మనీ మీదు గా 1935లో లండన్ చేరుకుని ఇంజనీరుగా స్థిరపడ్డాడు.అయితే, లోలోపుల డయ్యర్ ను చంపే వ్యూహం గురించి ఆలోచిస్తూ వచ్చారు. అనేక సందర్భాల్లో అక్కడ డయ్యరును చంపడానికి అవకాశాలు వచ్చినప్పటికీ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ దురాగతాలు ప్రపంచానికి తెలియాలంటే సభలోనే చంపాలని అనుకోని అనేక సార్లు వాయిదా వేసుకున్నాడు.

1940 మార్చి 13 వ తేదీన మైకేల్ ఓ డైయర్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ మరియు సెంట్రల్ ఆసియా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రసంగిస్తున్న సమయంలో లండన్లోని కాకస్టన్ హాల్లోకి రహస్యంగా ప్రవేశించి సమావేశం అంతా పూర్తయిన తర్వాత డయ్యర్ ఎదురుగా వెళ్లి తన వెంట రహస్యంగా తెచ్చుకున్న రివాల్వర్తో రెండు రౌండ్లు కాల్పులు జరుపగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. చంపిన తర్వాత పారిపోకుండా అక్కడే ఉండి వీరత్వాన్ని చాటుకోవడం తోపాటు అరెస్ట్ అయిన తర్వాత 1945 ఏప్రిల్ 1వ తేదీన కారాగారంలో రిమాండ్ చేశారు.

ఉద్ధం సింగ్ నేపథ్యం

26 డిసెంబర్ 18 99 లో పంజాబ్లోని సంగ్రూర్ జిల్లా సున్నం గ్రామంలోతేహాల్
సింగ్ నారాయణ కౌ ర్ దంపతులకు సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల శరణాలయంలో ఉంటూ 18 లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసినాడు.

చిన్ననాటి నుండే అభ్యుదయ భావాలు కలిగి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ దేశభక్తిని పుణికి పుచ్చుకున్నాడు. జలియన్వాలాబాగ్ మారణకాండకు కారణమైన నాటి లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ డయ్యర్ ను చంపడం కోసం ఇరవై ఒక్క సంవత్సరాలు నిరీక్షించి దేశదేశాలు తిరిగి తన ఉపాధి ,ఉద్యోగాన్ని కూడా వదులుకుని ఆ దుర్మార్గున్ని చంపి ఉరికంబం ముద్దాడిన పోరాట యోధుడిని స్మరించుకో కుంటే జాతి క్షమిస్తుందా?

న్యాయస్థానం ముందు న్యాయమూర్తితో సంచలన ప్రకటన:

1940 జూన్ 4వ తేదీన సెంట్రల్ క్రిమినల్ కోర్టులో న్యాయ విచారణ జరుగుతున్న సందర్భంలో అట్కిన్సన్ న్యాయమూర్తి ముందు వాదన వినిపిస్తూ” జనరల్ డయ్యర్ ను చంపింది నేనే. ఇది హత్య కాదు ,తప్పు అని అనుకోవడం కూడా లేదు. జలియన్వాలాబాగ్ సంఘటనలో నా జాతి జనులను మట్టుబెట్టిన నరహంతకుడు డయ్యర్ ను చంపడం నా బాధ్యత అనుకొని చేశాను.” అని నిర్ద్వందంగా తన అభిప్రాయాన్ని చెప్పి న్యాయమూర్తిని ఆశ్చర్యపరిచాడు.

అయినా చట్టాల ముందు అనాదిగా న్యాయం వెలవెలబోతూ నే ఉంది. ఈ విషయంలో న్యాయం ఉందని న్యాయమూర్తి అనుకున్నప్పటికీ ఇంగ్లాండ్ దేశపు చట్టాన్ని ధిక్కరించడం కుదర నందున ఉద్ధం సింగ్ కు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పాడు.

అది 1940 జూలై 31వ తేదీ ఇక్కడ భారతదేశములో ప్రజలు దాస్యశృంఖలాల లో మగ్గుతూ నరకయాతన అనుభవిస్తూ ఉంటే లండన్లోని పెంటన్ విల్లే జైలులో మాత్రం భారతదేశ కొదమ సింహం విప్లవ వీరుడు భగత్సింగ్ వారసుడు ఉద్ధం సింగ్ మాత్రం ఉరికొయ్యల ముద్దాడి శాశ్వత నిద్రలోకి జారుకొని భారతదేశ చారిత్రక స్వాతంత్ర సమరయోధుల సరసన స్థానం సంపాదించుకొని యువతను ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాడు.

ఉద్ధం సింగ్ త్యాగం నుండి నేర్చుకోవాల్సింది ఏమిటి

తనకంటూ ఓ జీవితం లేకుండానే అనాధగ తన ప్రస్థానం ప్రారంభించి పోరాట స్ఫూర్తిని పొంది త్యాగాన్ని మేళవించి తన జాతి జనులు పడుతున్న హింస, వివక్షతకు కలతచెంది నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తున్న క్రమములో కలిసివచ్చిన అవకాశాన్ని జారవిడుచు కోకుండా నరహంతకుని చంపడం కోసం లండన్ వెళ్లి ప్రాణత్యాగం చేసిన నిన్ను ఎంత వర్ణించినా తక్కువే

ఉద్ధం సింగ్ కు జాతి ఇచ్చిన గౌరవం

ఆయన స్మారకార్థం 1995లో నాటి ఉత్తరప్రదేశ్ ఒక జిల్లాకు నాటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి  ఉద్దంసింగ్ నగర్ అని పేరు పెట్టారు.

అలాగే లండన్ లో మరణించిన తర్వాత వారికి సంబంధించిన వస్తు సామాగ్రి ఇండియా చేరుకున్నప్పుడు 74 లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ, రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ హాజరై స్వీకరించారు.

ఉన్నతమైన ఆశయం మాత్రమే లక్ష్య సాధనకు సరిపోదని ,ఆశయ సాధనలో జీవితాన్ని అర్పించే అంత తెగువ కూడా ఉండాలని సమాజానికి చాటిన వీరుడు ఉద్ధం సింగ్ కు వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళి.

(వడ్డేపల్లి మల్లేశం, సామాజిక విశ్లేషకులు, అధ్యక్షులు జాగృతి కళాసమితి
హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట)

One thought on “ఉద్ధం సింగ్ వర్ధంతి నేడు, ఉద్ధం సింగ్ ఎవరో తెలుసా?

  1. చాలా బాగా రాసారు మల్లేశం గారు..1974 ఇందిరాగాంధీ తోపాటు శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతి అని రాశారు..అది కాదనుకుంటా సరిచేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *