ఓబిసీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు (విహెచ్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఇటీవల జరిగిన క్యాబినెట్లో బిసిలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్లు ప్రధాని గొప్పగా చెప్పుకుంటున్నవిషయంప్రస్తావిస్తూ , బిసినేతలకు క్యాబినెట్ పదవులు ఇస్తున్నపుడు క్రీమీ లెేయర్ ను పరిగణనలోనికీ తీసుకున్నారా? అని ఆయనలేఖ లో ప్రశ్నించారు.
క్యాబినెట్ లోకి బిసిల తీసుకుంటున్నపుడు అవసరం లేని క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ని బయట ఉద్యోగాలలో అమలుచేయడం సమంజసంకాదని, ఈ నియమాన్ని చట్టం నుంచి తీసేయాలని ఆయనప్రధానిని కోరారు.
గత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తాను బీసీ నని, అందుకే తన మీద ఒక పథకం ప్రకారం అసత్య ప్రచారం కొనసాగుతున్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకున్న విషయం గుర్తు చేస్తూ మోదీ చిత్తశుద్ధి ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని హనుమంతరావు లేఖలో పేర్కొన్నారు.
మోదీకి నిజంగా ఓబీసీల మీద సానుభూతి ఉంటే, వారికి కేటాయించిన 27శాతం రిజర్వేషన్లు అమలుకు కావాలంటే ఇపుడు అమలులో ఉన్న క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని వి హెచ్ డిమాండ్ చేశారు.
జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాల్సిందే నని, క్రీమీ లేయర్ బిసి అభ్యున్నతికి పెద్ద ఆటంకం అని ఆయన పేర్కొన్నారు.
బిసిలకు 27% రిజర్వేన్లు కేటాయించినట్లు ప్రకటించుకుంటున్నా ఇప్పటివరకు 9 నుంచి 10 శాతం రిజర్వేషన్లు కూడా అమలుకు నోచుకోవడం లేదని ఆయన అన్నారు.
క్రిమిలేయర్ విధానాన్ని తీసి వేయకుంటే ఇక వందేళ్లు పోయినా కూడా బీసీలకు సామాజిక న్యాయం జరగదని హనుమంతరావు పేర్కొన్నారు
గతంలో పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్ లే ఇప్పటికీ అమలుకాకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మంత్రి వర్గంలోని 27 మంది బిసి మంత్రులకు క్రిమిలేయర్ చూసి పదవులను కట్టబెట్టారా ఒకసారి ఆలోచించుకోవాలని ఆయన ప్రధాని మోదీకి సూచించారు.