న్యాయం చేయలేదు!.. కారుణ్య మరణమైనా ఇవ్వండి, సర్!

-రేష్మా సుల్తాన కుటుంబ సభ్యుల వేడుకోలు

వరంగల్ : గర్బస్థ శిశువు ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లితే వైద్యురాలి నిర్లక్ష్యం వల్ల ఓ యువతి నిండు జీవితం కోమాలోకి వెళ్లిపోయింది. ఇప్పుడామే జీవితం పసిపాప కంటే అధ్వాన్నంగా తయారైంది. జీవచ్చవంలా మంచంపైనే శవప్రాయంగా బతుకుతున్న ఓ ఇరవై ఐదేళ్ల యువతి గాథను వింటే హృదయం ద్రవిస్తోంది. ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం, ప్రాణాంతక చర్యలు యధేచ్చగా సాగుతున్నప్పటికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ అధికార యంత్రాంగం దున్నపోతు మీద వర్షం పడిన చందంలా వ్యవహరిస్తుంది. మానవహక్కులు, వినియోగదారుల చట్టాలు, కోర్టులు, మానవ హక్కుల కమీషన్లు ,లా అండ్ ఆర్డర్‌ ఒంటరి పేదలకు న్యాయం చేయలేకపోయినా ఆరేళ్లుగా కోమాలోనే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తమ బిడ్డకు ప్రభుత్వం కారుణ్య మరణమైనా ప్రసాదించమని వేడుకుంటోంది.

సోమవారం వరంగల్ పౌర స్పందన వేదిక అధ్యక్షుడు నల్లెల్ల రాజయ్య బృందం బాధితులను కలిసి పలు వాస్తవ వివరాలను సేకరించింది. బాధితుల కథనం ప్రకారం…

వరంగల్ పట్టణం ఎల్బీ నగర్ శాంతినగర్ కు చెందిన ఖమరున్నీసా ఫయాజ్ దంపతుల కుమార్తె రేష్మ సుల్తానకు 2015 లో ప్రెగ్నెన్సి కావడంతో వరంగల్ లో కల జయలక్ష్మి ఆస్పత్రిలోని డాక్టర్ అన్నపూర్ణకు చూపించారు.

రేష్మకు హై బీపి ఉందని ఆస్పత్రిలో చేరాలని డాక్టర్ సలహాతో జాయిన్ చేశారు. అబార్షన్ కోసం 50 మెగ్నీషియం సల్పెటు ఇంజెక్షన్లు ఇవ్వడంతో రేష్మా కోమాలోకి వెళ్లిపోయింది.

వెంటనే డాక్టర్ అన్నపూర్ణ హన్మకొండ లోని మాక్స్ కేర్ ఆస్పత్రికి రెఫర్ చేసి హుటాహుటిన తరలించింది. రెండు నెలలు కార్పొరేట్ వైద్యం అందించినప్పటికీ బాధితురాలు రేష్మసుల్తనా కోమా నుంచి బయటకు రాలేకపోయింది.

క్రమంగా కాళ్లు, చేతులు కూడా చచ్చుబడి నరాలు పని చేయకుండా పోయాయి. మరోవైపు ఆస్పత్రిలోనే హార్ట్ స్ర్టోక్, పెరాలసిస్ అటాక్ కావడంతో తీవ్రమైన అనారోగ్యం పాలైంది. తమ కుమార్తెకు మోతాదుకు మించిన మెగ్నీషియం సల్ఫేట్ ఇంజెక్షన్లు యాభై నుంచి వంద వరకు ఇవ్వడంతోనే మెదడు, నాడీ వ్యవస్థ పని చేయకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమీషన్ కు 2017లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ తమకు ఏలాంటి న్యాయం లభించలేదని బిడ్డ దుస్థితికి తండ్రి ఫయాజ్ కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు 2019 లో డా.అన్నపూర్ణ చికిత్స నిర్లక్ష్యం మీద హైకోర్టులో ప్రైవేటు వాజ్యం వేసినప్పటికీ నేటి ఇంతెజార్ గంజు పోలీసులు విచారణలోనే ఉండటం గమనార్హం.

6 నెలల్లో ఛార్జ్ షీటు దాఖలు చేయాల్సిన ఇప్పటికీ ఆపని చేయడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమ కూతురుకు వచ్చిన కష్టం ఏ శత్రు్రకూడా రావద్దని చేసుకుంటున్నారు. నెలనెలకు వేలాది రూపాయలు రెష్మ పోషణ కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, చట్టాలు అక్రమార్కులకే అండగా నిలవడం బాధగా ఉందన్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయలేని ప్రభుత్వం కనీసం కారుణ్య మరణాన్నైన ప్రకారం ప్రసాదించాలని కోరుతున్నారు. చికిత్సలో నిర్లక్ష్యం చేసిన డాక్టర్ అన్నపూర్ణ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ సందర్భంగా వరంగల్ పౌరస్పందన వేదిక జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల రాజయ్య మాట్లాడుతూ రెష్మకుటుంబాన్ని ఆదుకోవాలని, చికిత్సలో నిర్లక్ష్యం చేసిన వైద్య సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజయ్యతోపాటు ఆల్ హ్యుమన్ పౌండేషన్ ఛైర్మన్ సయ్యద్ ఆదిల్ పాషా, రచయిత కోడం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *