యదియూరప్ప ను ఎందుకు సాగనంపారు, రహస్యం ఇదేనా?

కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యదియూరప్పను సాగనంపిన తీరు  మీద దేశమంతా చాలా చర్చ జరుగుతూ ఉంది.

యదియూరప్ప వయసు 78 సంవత్సరాలు. కాకలు తీరిన ఆర్ఎస్ ఎస్ వాది.  ఏడు సార్లు అసెంబ్లీకి, ఒక సారి  లోక్ సభకు ఎన్నికయ్యారు.  ఇలాంటి వ్యక్తిని ఒక్కసారి కూడా ఫుల్ టర్మ్ ముఖ్యమంత్రి గా కొనసాగనీయకుండా సాగనంపడంలో అర్థం ఏమిటి?  2003 అసెంబ్లీ ఎన్నికల దాకా కొనసాగించి గౌరవంగా సాగనంపి ఉండవచ్చుగా?, అని చాల మంది అంటున్నారు.

యదియూరప్ప బిజెపికి మొన్న మొన్నటి దాకా పెద్ద దిక్కే. ఆయన అనుకుంటే బిజెపిని దెబ్బతీయగలరు. ఎందుకంటే బిజెపి మీద అలిగి ఆయన సొంత ‘కర్నాటక జనతా పక్ష’ పెట్టి దెబ్బతీశారు. అందుకే ఆయనని దూరంగా ఉంచడం కష్టం, నష్టం అని మోదీ-బిజెపి ఆయనను మళ్లీ పార్టీ లోకి వెనక్కి తీసుకుంది. అయితే, ప్రధాని మోదీ మాత్రం ఆయన మీద ఒక కన్నేసి ఉంచారు.

మొన్న కర్నాటకలో  జనతాదళ్ ముఖ్యమంత్రి కుమారస్వామిని పదవీచ్యుతిని చేసి, బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకావడంలో యదియూరప్ప రోలే మీ లేదని బిజెపి కేంద్ర నాయకత్వానికి తెలుసు.

ఈ కర్నాటక ఆపరేషన్ ని ఢిల్లీ నుంచి  మొత్తం ఎలా రిమోట్ కంట్రోల్ తో విజయవంతంగా నిర్వర్తించారో ఇపుడు బయటపడింది.

నిజానికి అపుడే యదియూరప్పను  పక్కన బెట్టి మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించి వుండవచ్చు.కాని, యదియూరప్ప వ్యవహారాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. ఆయనకు ఆ శక్తి  సామర్థ్యాలు ఉన్నాయి. అందుకే ఆయనను ముఖ్యమంత్రిని చేసి కోరలు పీకేశారు. ఢిల్లీకి రాకుండా చేశారు. ప్రధానితో కలవ కుండా చేశారు. క్యాబినెట్ లోకి మంత్రులను ఢిల్లీ నుంచే ఎంపిక చేశారు.  యదియూరప్ప మనిషి ఒక్కరు కూడా క్యాబినెట్ లో లేకుండా కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నాక మొక్కుబడిగాా  ఢిల్లీ వెళ్లి పుష్పగుచ్ఛం ఇవ్వడం మినహా వారిద్దరి మధ్య ముఖా ముఖి సమావేశం ఇంతవరకు జరగనే లేదు.

అయినా ఇపుడే ఆయన చేత రాజీనామా చేయించడానికి  కారణాలు ఏమిటి? చాలా మంది  చాలా కారణాలు చెబుతారు. అవినీతి ఆరోపణల మీద విచారణ కొనసాగించేందుకు కర్నాటక హైకోర్టు అనుమతి నీయడంతో గతంలో లాగా పార్టీ మీద యదియూరప్ప తిరుగబాటు చేయలేరని అధిష్టానం నమ్మకం.

యదియూరప్పని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకువాడుకున్నారు. అందుకే  ప్రధాని మోదీ గత ఏడేళ్లలో   ఒక్క సారి కూడా యదియూరప్పకు  అప్పాయంట్ మెంటు ఇవ్వలేదు. ఇచ్చింది ఒకేసారి, అది  జూలై 16న. అది కూడా ‘నాకు ఆరోగ్యం బాగా లేదు, ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించలేక పోతున్నా, కాబట్టి దయచేసి రాజీనామా చేసేందుకు అంగీకరించండి, నన్ను విముక్తి చేయండి,’ అని యడియూరప్ప రాసిన లేఖ అందిన తర్వాతే.

లేఖని యదియూరప్ప జూలై 10న రాశారు. జూలై 11న ప్రధానికి అందించారు. అది అందాకే, జూలై 16న ప్రధానిని కలుసుకునేందుకు యదియూరప్పకు పిలుపు వచ్చింది. ఇంత పకడ్బందీ గా మంత్రాంగం నడించింది.

జూలై 16 సమావేశం గురించి ఆసక్తి కరమయిన విషయాలు ఇపుడు వెల్లడయ్యాయి. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన తనని ఈ సారైనా పూర్తి కాలం పదవిలో ఉండనీయండని ప్రధానిని ఆయన బతిమాలలేకపోయారు.

ఎందుకంటే తన నుంచి రాజీనామా లేఖ తీసుకోవడంతోనే ముఖ్యమంత్రిగా తనకి నూకలు చెల్లాయని ఆయనకు తెలిసిపోయింది.

అందుకని రెండు కోర్కెలు ప్రధాని ముందు పెట్టారు. అవి: 1) ఆగస్టు 15 దాకా ఉండనీయండి. 2) ఆషాఢ మాసంలో రాజీనామా చేయడం బాగుండదు.

కాని వీటికి అధిష్టానం నుంచి ఆమోదం లభించలేదు. రెండు కోర్కెలు ఆమోదించలేదు కాని పదవిలో  రెండేళ్లు కాలం పూర్తి చేసేందుకు  అంగీకరించారు. అందుకే రాజీనామా చేసేందుకు  జూలై 26 దాకా గడువిచ్చారు.  2019 జూలై 26న ముఖ్యమంత్రి అయ్యారు.  నిన్నటికి రెండేళ్లు పూర్తయ్యాయి.గడవు ప్రకారం  ఆయన రాజీనామా ప్రకటించారు. లేఖ గవర్నర్ కి ఇచ్చారు. గవర్నర్ మరుక్షణం ఆమోదించారు.

మోదీ హాయాంలో బిజెపి పూర్తిగా ఢిల్లీ పార్టీ అయిపోయింది. పార్టీలో పాతుకుపోయి, ప్రజల్లో పేరు ప్రతిష్టలుండి, అనుకుంటే స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టి నడపగలిగే నేతలు ఇపుడు అవసరం లేదు. ఈ లెక్కన యదియూరప్పను కొనసాగించడం కష్టం. ఎందుకంటే, యదియూరప్ప రాష్ట్రంలో బాగా పేరున్న లింగాయత్ కుల నాయకుడు. ఈ కులం జనాభా 17 శాతం దాకా ఉంది. ఈ కులానికి మంచి ధార్మిక సంస్థలున్నాయి. ఈ లింగాయత్ మఠాధిపతులంతా యదియూరప్పకే మద్దతు తెలిపారు. ఇలాంటి ప్రాంతీయ శక్తులను భరించడం మోదీ వంటి నేతకు సాధ్యం కాదు. ఈ కారణాన కూడా యదియూరప్పకు ఉద్వాసన తప్పదు.

 తెరవెనక కథ ఏమిటి?

యదియూరప్ప పోవడంతో బిజెపిలో ఉన్న పాతకాపుల తకం అంతరించి పోయింది. మోదీ సామంతులలో  వాజ్ పేయి-అద్వానీ కాలపు బిజెపికి చెందిన చివరి స్వతంత్ర సేనా నాయకుడు యదియూరప్పేనేమో. దీనితో పాతకాలపు బిజెపితో మోదీ బిజెపికి పూర్తిగా అనుబంధం తెగిపోయిందను అనుకోవాలి.

కర్నాటక బిజెపికి కూడా మోదీ యుగం కొత్త ముఖాలు అవసరం. అందుకే  యడియూరప్పని జాప్యం లేకుండా తప్పించారు. కర్నాటకలో 2003 ఏప్రిల్ లో ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సమాయత్తం కావాలంటే కొత్త నాయకుడికి కొంత గడువు అవపరం.

మోదీ-షా బిజెపిలో ఇపుడు  వాజ్ పేయి-అద్వానీ కాలపు నేతలెవరూ పదవుల్లో లేరు.

మొన్న జరిగిన కేంద్ర క్యాబినెట్ మార్పులో 12 మంది పాతకాలపు బిజెపి నేతలను తప్పించేశారు. ఆరోగ్య మంత్రి హర్షవర్దన్, ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ లతో పాటు సంతోష్ గంగ్వార్ , సదానంద్ గౌడ,  రమేష్ పోక్రియాల్, ప్రకాశ్ జవడేకర్ వంటి వారంతా వాజ్ పేయి నాయకత్వంలో పెరిగి పెద్దవాళ్లయిన వారే. అందుకే వారందరికి ఉద్వాసన చెప్పి కొత్త వారికి స్వాగతం పలికారు.  ఇపుడు  ప్రధాని మోదీ క్యాబినెట్ లో సుమారు 43 మంది కొత్త వాళ్లున్నారు. అంతా మోదీ ఐడియాలజీతో ఎదిగిన వాళ్లే. ఇపుడున్న క్యాబినెట్ లో ఇక  మిగిలింది రాజ్ నాథ్ సింగే. అయితే, ఆయన  పూర్తిగా కన్వర్ట్ అయిపోయారని కొందరు చెబుతారు. కాదు, ఆయనకు  కూడా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్వాసన తప్పదని, అనే వాళ్లూ ఉన్నారు.

ఇలా  భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఇపుడు వాజ్ పేయి-అద్వానీ యుగం అంతరించింది. జూలై 26, 2021 న ఈ యుగానికి చెందిన చివరి ప్రాంతీయ నాయకుడు పదవి నుంచి దిగిపోయారను కోవాలి.

ఇపుడు బిజెపిలో పూర్తిగా మోదీ-షా యుగం మొదలయింది.

కాకపోతే, వాజ్ పేయి కాలానికి చెందిన నేతల్లో కొందరిని గౌరవంగా సాగనంపి గవర్నర్లుగా నియమించారు.

రాజీనామా చేశాక యదియూరప్ప కంట తడి పెట్టడానికి కారణం ఇపుడర్థమయిందిగా.

మాంచి కులబలం, దండిగా ధనబలం పెట్టుకుని యదియూరప్ప ఏడుస్తూ రిటైరవుతారా? బిజెపి మీద ఎదురుదాడి చేస్తారా?

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *