(గద్దల మహేందర్)
తెలంగాణలో ప్రజాస్వామ్యానికి బదులు వ్యక్తి స్వామ్యం రాజ్యమేలుతున్న వేళ ఇది.
ప్రజలు వెనకబడి పోయారు. ఎటుచూసిన నేతలే కనబడుతున్నారు.కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయినా ఇంకా తెలంగాణ చిత్రం స్పఫ్టంగా అగుపించడమే లేదు. తొల్త జెండాలెతిన వాళ్లని వెనక్కి నెట్టేస్తున్నారు.
భారతదేశంలో తెలంగాణ నేలకు, అపురూపమైన చరిత్ర ఉంది. భూమితో సంభాషించిన రైతులు, ఈ నేల విముక్తి కోసం పోరాటం చేశారు. నిరంకుశ నిజాం పాలనకు చరమగీతం పాడారు. ప్రపంచ చరిత్రలో దిక్సూచిగా నిలిచారు. భిన్న ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తులు ప్రజాస్వామిక భావన కోసం పోరాడారు. ఇందులో కాంగ్రెస్ వాదులు కమ్యూనిస్టులు కలిసి తెలంగాణ లో స్వేచ్ఛ వాయువుల కోసం పని చేశారు. వెట్టి చాకిరి, నిత్య నిర్బంధాన్ని, కూడా లెక్క చేయకుండా, వేలాది ప్రాణాలను అర్పిస్తూ విముక్తికి బాటలు వేసి ఈ నాటికీ చరిత్రలో నిలిచిపోయారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో వివిధ సామాజిక రాజకీయ సాంస్కృతిక పోరాటాల సందర్భంలో తెలంగాణ సమాజం అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తి నిలబడింది. చాలా సందర్భాలలో పాలకపక్షానికి ప్రజలే నిజమైన ప్రతిపక్షంగా బరిగీసి నిలిచారు.
మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భిన్న,రాజకీయ విశ్వాసాలు కలిగిన వారు కూడా ప్రజాస్వామిక ఆకాంక్షను గెలిపించడంకోసం కోసం కృషి చేశారు. వైరుధ్య భరితమయిన భావజాలాలున్న వాళ్లు కూడా తెలంగాణ కోసం చేతులు కలిపారు.
ఈ నేలమీద పోరాటాలు ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలో ,సామాజిక చైతన్యం వ్యక్తమయ్యింది. ప్రజా పోరాటాలే ప్రజాస్వామిక భావనను విస్తృతం చేశాయి.
అయితే ఎందరో త్యాగాల ఫలితంగా, సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామికం కాకుండా పోయింది. తెలంగాణ హైజాక్ కాబడింది. మరోసారి ఫ్యూడలిజంలోకి, నిరంకుశత్వంలోకి జారుకుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
సకలజనులు- ధనవంతుల దగ్గిర నుంచి పూరి గుడిసెల్లోని పేదల దాకా, హైదరాబాద్ నుంచి మారుమూల పల్లె దాక, ఉస్మానియా నుంచి పల్లెటూరి సెలూన్ దాకా- జెఎసిలు ఏర్పాటు చేసుకుని, రోడెక్కి పోరాడి తెచ్చుకున్నా, తెలంగాణలో భిన్న అభిప్రాయాన్ని సహించ లేని తనం పెరిగిపోయింది.
ప్రజాస్వామ్య స్థానంలో వ్యక్తి స్వామ్యం ప్రవేశించింది. ప్రజలచేత ఎన్నికైన సభ్యులు చట్టసభల నిమిత్తమాత్రమే అయ్యాయి. ఏలినవారి ప్రతిమాటకు చప్పట్లు కొట్టే వాళ్లు, ప్రతి ప్రకటనకు పాలాభిషేకం చేసేవాళ్లతో, తెలంగాణలో కొత్త అవాంఛనీయ, అప్రజాస్వామిక సంస్కృతి మొదలయింది. బహుశ, దేశంలో ఎక్కడా ఇంతగా పాలు వృధా చేసి, ప్లెక్స్ బోర్డులకు పాలభిషేకం చేసే సంస్కృతి లేదేమో. డీసెన్సీకి తావు లేకుండా పోయింది.
ఉద్యమకాలంలో ప్రజల నుంచి వ్యక్తమైన ప్రజాస్వామిక ఆకాంక్షలు అన్ని పూర్వపక్షం అయ్యాయి. నీళ్లు, నిధులు ,నియామకాలు ,నినాదాలు, నెరవేరని కలలు అయ్యాయి.ఏడేళ్లుగా నిరుద్యోగులు,వాళ్లతల్లితండ్రులు ‘నియామకాలు’ కోసం ఆశగా ఎదురుచూసూనే ఉన్నారు.
తెలంగాణ ఏమి తెచ్చింది, తెలంగాణకు ఏమయింది, మనం కలలుగన్న తెలంగాణ ఎటువోయింది?
“దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతాం
ప్రాంతం వాడి దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం,” అన్న కాళోజీ మాటలు గాలికి కొట్టుకుపోతున్నాయా?
(గద్దల మహేందర్, జనగామ)