(కె.శాంతారావు)
గోడలకు చెవులుంటాయి. నిఘా నీలి నీడలు నీ చుట్టూతానే నీకు తెలియకుండా పరుచుకుంటాయి. కంటికి కన్పించని రహస్య కెమెరాలు, మైక్రోపోన్లు నీ చేతల్ని, నీ మాటల్ని కడకు నీ శ్వాసను కూడా పసికడతాయి. ఇదేదో డిటెక్టివ్ కథ కాదు. జేమ్స్ బాండ్ సినిమా అంతకన్నా కాదు. భారత రాజకీయ రంగాన ప్రమాదభరితంగా జరుగుతున్న క్రీడ.
పెగాసస్ స్పైవేర్ ద్వారా ఈ చట్ట విరుద్ధమైన నిఘా జరుగుతున్నది. ఈ హ్యకింగ్ (నిఘా) బాధితుల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపునకు అడ్డం పడ్డాడని భావిస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ వారితో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ఎప్పటి కప్పుడు ఎండగట్టే మీడియా, పాత్రికేయ ప్రముఖులు, మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తలు ఉన్నారు. దాదాపు మూడువందల మంది కీలక వ్యక్తులపై ఈ నిఘా జరుగుతున్నదనేది వార్తా కథనం.
‘ద వైర్’ అనే వార్తా సంస్థ ఈ కథనాన్ని ప్రచురించింది. కేంద్ర ఎన్నికల మాజీ కమిషనర్ అశోక్ లావాసా, పశ్చిమబెంగాల్ మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్, ఎన్నికల వాచ్డాగ్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎ.డి.ఆర్) వ్యవస్థాపకుడు జగదీష్ ఖర్లతో పాటు, స్వపక్ష కేంద్ర మంత్రులు అశ్వినీవైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ ఈ నిఘా నీడలో ఉన్నారని తెలపడం గమనార్హం.
తమను విమర్శించే వారిపై మోడీ సర్కార్ నిఘా పెట్టిందని, అందుకోసమే ఇజ్రాయిల్ సంస్థ ఎస్.ఎస్.ఓ. రూపొందించిన పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించిందని అమెరికాకు చెందిన వాషింగటన్ పోస్ట్ కూడా ఈ సందర్భంలో ఉటంకించడం, విషయాన్ని రూఢ పరుస్తున్నది. పెగాసస్ అనేది ఇజ్రాయిల్‌కు చెందిన టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ సంస్థ (ఎస్.ఎస్.ఓ) రూపొందించిన ఓ సాప్ట్వేర్ ప్రోగ్రాం. స్మార్ట్ ఫోన్ల నుండి రహస్యంగా సమాచారం సేకరించేందుకు ఈ ప్రోగ్రాం పనికి వస్తుంది. అప్పుడు క్షణాల్లో వ్యక్తిగత సమాచారం అంతా వారికి తెలియకుండానే వేరేవారి గుప్పిట్లోకి చేరిపోతుంది.
2010లో రూపొందించిన ఈ ప్రొగ్రాంను దాదాపు 50దేశాలు వాడుతున్నాయి. ఉగ్రవాద నేరాలను పసిగట్టి, అదుపులో ఉంచేందుకే ఈ ప్రోగ్రాంను డిజైన్ చేశామని, నమ్మకమైన మిత్ర ప్రభుత్వాలకు మాత్రమే ఈ సాఫ్ట్‌వేర్‌ను విక్రయిస్తామని ఆ సంస్థ తెలుపు తున్నది. కాగా, ఆ 50 దేశాల్లో వెయ్యికి పైగా వ్యక్తుల నెంబర్లు ఈ ప్రోగ్రాం ద్వారా హ్యాక్ చేశారని, వారిలో 600మంది రాజకీయ వేత్తలు, 189మంది జర్నలిస్టులు, 85మంది మానవ హక్కుల ఉద్యమ కారులు ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ వివరించింది.
అధికారం చేజారిపోతున్నదనే భయంతోనే మనదేశంలో మోడీ ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు వడిగడుతున్నదనేది రాజకీయ పరిశీలకుల భావన. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం, ప్రైవసీ ప్రాథమిక హక్కుల్లో భాగమే. ఒక పక్క రాజ్యాంగవిరుద్ధ చట్టాలు అమలు కావడం, మరో పక్క చట్టవ్యతిరేక నిర్భందాలు యదేశ్ఛగా సాగుతున్న ఈ దశలో ఈ నిఘా ఉపద్రవం తెరపైకి వచ్చింది.
విదేశీ సంస్థలకు భారత ప్రముఖుల ఆంతరంగిక సమాచారం అప్పజెప్పడం ఏమిటని, దేశ భద్రతకు భంగం కలిగించే ఈ చర్యలు దేశ ద్రోహం నేరంతో సరితూగవా..? అనే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మీ ఫోన్లో ఉన్న ప్రతిదాన్ని ఆయన (మోడీ) చదివేస్తున్నాడు అని రాహుల్‌గాంధీ అంటే, చివరకు ‘మీ పడకగది ముచ్చట్లు కూడా మోడీ సర్కార్ వినగలదు. తస్మాత్ జాగ్రత్త’ అని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ హెచ్చరించారు. ఇలా భారతీయులపై అక్రమంగా నిఘా పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారని సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో ఆగ్రహంతో ప్రశ్నించింది.
అధికార పీఠంపై ఉన్నవారు ఆయా వ్యక్తుల రహస్య సమాచారాన్ని సేకరించి తిమ్మిని బమ్మిన చేయవచ్చు. బెదిరించవచ్చు. బ్లాక్ మెయిల్ చేయవచ్చు. మారు మాట్లాడకుండా లొంగదీసుకోవచ్చు. ఇది అప్రజాస్వామ్యమే కాక చట్ట విరుద్దం కూడా. తమను విమర్శించే వారిని, తమపై ఆరోపణలు చేసేవారిని సూటిగా ఎదుర్కొలేక పాల్పడే కుట్రపూరిత చర్య ఇది.
గతంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోరుపై లైంగిక చర్యల ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఆరోపణలు చేసిన ఆమెపైనా, వారి కుటుంబ సభ్యులు పదకొండు మందిపైనా ఇలాగే నిఘా పెట్టారని వార్తలు వచ్చాయి. దీనిపై మీడియా వివరణ కోరితే ఆయన నిరాకరించారు.
2019లో కర్నాటకలో జేడీయూ, కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసిన కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కూడా ఈ పెగాసస్ నిఘానే కీలకపాత్ర పోషించిందనేది తాజా వార్త. అందుకే అక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ, హౌంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దద్దరిల్లుతున్నాయి.
మన చేతిలోని మన స్మార్ట్ఫోనే మనను బలికొనే మారణాయుధం అవుతున్నప్పుడు భద్రతకు ఆస్కారమెక్కడీ అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వాలను గద్దె దింపాలని, ప్రత్యర్థులను నిట్టనిలువునా నిర్వీర్యం చేయాలని యత్నిస్తే ప్రజాస్వామ్యానికి చోటెక్కడీ ప్రజలకు ఏమాత్రం స్వేచ్ఛ లభిస్తుందో అదే ప్రజాస్వామ్యానికి కొలమానం అన్న అబ్రహం లింకన్ మాటలు అక్షర సత్యం.