(సలీమ్ బాషా)
1952 హెల్సింకి ఒలింపిక్స్ లో ఒక సంఘటన ఎంతోమంది వికలాంగుల జీవితాలను ప్రభావితం చేసింది. ఆ యేడాది మొట్టమొదటి సారి గుర్రపు స్వారీ (Dressage) ఒక మహిళ పాల్గొనింది. మొదటి సారి ఒక శారీరక వైకల్యం ఉన్న మహిళ పాల్గొనింది. మొదటి సారి ఒక మహిళకు ఈ ఇవెంటులో మెడల్ వచ్చింది.
ఆ రోజు హెల్సింకీలో వ్యక్తిగత గుర్రపు స్వారీ పోటీ ఉత్కంఠతో పూర్తయింది. మొదటి, రెండవ స్థానాల్లో రైడర్స్ కు మధ్య కేవలం 20 పాయింట్లు తేడా, ఒలింపిక్ ప్రమాణాల ప్రకారం ఇది చిన్న తేడా. పోటీ చాలా తీవ్రంగా కొనసాగింది.
ఉత్కంఠ రేపినది ఆ పోటీ కాదు కానీ, తర్వాత జరిగిన పతకాల వేడుక. అది అందరినీ కదిలించింది. రజత పతక విజేత లిస్ హార్టెల్ (Lis Hartel) తన గుర్రం జూబ్లీ నుండి దిగడానికి సహాయం కావాలి. ఆమె సహాయానికి బంగారు పతక విజేత, స్వీడన్ కు చెందిన మేజర్ హెన్రీ సెయింట్ సిర్ (Henri Julius Reverony Saint Cyr) వచ్చాడు.
మేజర్ ఆమెను గుర్రం నుండి క్రిందికి దించి, ఆమెను పొడియం దగ్గరకు మోసుకుని వెళ్ళాడు. హార్టెల్ ను పొడియం దగ్గరకు తీసుకెళ్లగా, బలహీనంగా ఉన్న తన కాళ్లపై పోడియం మీద నిలబడ్డానికి ఆమె పడిన కష్టాన్ని చూసి అక్కడ కంటతడి పెట్టని వారు లేరు.
మేజర్ సిర్ క్రీడా నైపుణ్యం, స్నేహం మరియు క్రీడాస్ఫూర్తి కి అందరూ ఫిదా అయిపోయారు, ఈ కథ ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరింది. ఇది భావి తరాల రైడర్లను ఉత్తేజ పరుస్తుంది. వేలాది మంది వికలాంగుల జీవితాలను మెరుగుపరుస్తుంది. హార్టెల్ పోడియానికి తీసుకెళ్లడంలో, సెయింట్ సిర్ ఒలింపిక్ చరిత్రలో అత్యంత అసాధారణమైన మానవత్వాన్ని ప్రదర్శించాడు. తను స్వయంగా బంగారు పథక విజేత అయినప్పటికీ, రజత పతకం గెలిచిన హార్టెల్ ను పొడియం దగ్గరకు తీసుకెళ్లడం గొప్ప విషయం. ఆమె మెడల్ స్వీకరిస్తున్నప్పుడు బంగారు పతక విజేత మేజర్ తో పాటు, కాంస్య పతక విజేత ఆండ్రీ కూడా ఆమెకు సెల్యూట్ చేయడం మరుపురాని విషయం.
గుర్రపు స్వారీ చేసిన ప్రతిసారీ, హార్టెల్ కు ఎవరో ఒకరు సాయం చేయవలసి వచ్చేది. హార్టెల్ తొలినుంచి గుర్రపుస్వారీ అభిమాని. అందులో మంచి నేపుణ్యం సంపాదించింది.అనేక పతకాలు గెల్చుకుంది. హెల్సింకి ఒలింపిక్స్ కి ఎనిమిది సంవత్సరాల ముందు, 1944 లో, 23 ఏళ్ళ వయసులో, ఆమె రెండవ బిడ్డతో గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు పోలియో సోకింది.ఆమె శరీరం మోకాళ్ల కింద భాగం పక్షవాతం వచ్చింది.కాళ్లు చచ్చుబడ్డాయి. అయితే, ఇక జీవితం ముగిసిందని కుంగిపోలేదు. పండంటి బిడ్డకు జన్మనిచ్చాక, తల్లి, భర్తసాయంతో కాల్లు కదపడం మొదలుపెట్టింది.తర్వాత పాకడం, ఆపైన నడవడం ప్రాక్టీసు చేసి విజయవంతమయింది.
మొక్కవోని ధైర్యం, విశ్వాసంతో క్రచెస్ సహాయంతో ఆమె తన రైడింగ్ క్రీడను కొనసాగించింది. తన క్రీడలో మళ్లీ అగ్రశ్రేణిలో నిలబడింది. 1948 నాటికి ఒలింపిక్స్ సిద్ధమయింది. అయితే, పాల్గొనలేకపోయింది. కారణం, చచ్చుబడిన ఆమె కాళ్లు కాదు. ఒలింపిక్స్ డ్రెస్సేజ్ లోకి మహిళలకు ప్రవేశం కల్పించలేదు. 1900 లో ఒలింపిక్స్ లో తొలిసారి మహిళా క్రీడకాారులను అనుమతించారు. అప్పటి నుంచి ఒక్క ఏడాది ఒక్కొక్క ఇవెంట్ లోకి మహిళలను అనుమతిస్తూ వచ్చారు. అందుకే ఆమె మరొక నాలుగేళ్లు 1952 హెల్సెంకీ సమ్మర్ ఒలింపిక్స్ దాకా వేచిచూడాల్సి వచ్చింది. ఆ యేడాది డ్రెస్సేజ్ లోకి మహిళలను అనుమతించారు. అందుకే అక్కడ ఆమె పాల్గొనడం ఒక రికార్డు, ఆమె పతకం మరొక రికార్దు.
అదే విధంగా, బంగారు పతక విజేత మేజర్ హుందాతనం, ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి ఒలింపిక్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయింది.
(సలీమ్ బాషా, స్పోర్ట్స్ రచయిత, హోమియో వైద్యుడు,93937 37937)