పాతాళంలో భారతదేశపు ఆకలి ఇండెక్స్ ర్యాంకు, ఎందుకు?

(వడ్డేపల్లి మల్లేశము)

ప్రకృతి వనరులు, పచ్చదనం, పంట పొలాలు, అన్నింటికీ మించి మానవ వనరులు అధికంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం ప్రపంచంలో గుర్తింపు పొందిన ది. అయితే వర్తమాన దేశము స్థాయి నుండి అభివృద్ధి చెందిన స్థాయికి మాత్రం ఇంతవరకు చేరుకోక పోవడం భారతదేశం యొక్క స్థాయిని నిర్ణయించే క్రమంలో వివిధ సూచికలు కారణం అని తెలుస్తున్నది. కేవలం భారత దేశంలోనే కాక ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆకలి కేకలు ఆర్తనాదాలు విశ్వవ్యాప్తం అవుతున్నట్టుగా అనేక గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ఇటీవలి ఆక్స్ఫామ్ నివేదిక

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కారణంగానూ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆకలి కేకలతో అల్లాడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య భయంకరమైన చేదు నిజాన్ని ఆక్స్ఫామ్ (Oxfam:Hunger Virus Multiplies) సంస్థ తన నివేదికలో ప్రకటించింది.

విశ్వవ్యాప్తమైన కరోనా కోరలకు ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 7గురిని బలి తీసుకుంటే అర్ధాకలితో కడుపు మండి నిమిషానికి 11 మంది ప్రాణాలు విడుస్తున్నట్లుగా ఆ నివేదిక సారాంశం.

ఈ దౌర్భాగ్యానికి కారణం ఆర్థిక అంతరాలు, కరోనా కలకలం, యుద్ధాలు,
పేదరికాన్ని నిర్మూలించి ఉపాధికల్పన ను పూర్తిస్థాయిలో సాధించ లేకపోవడం వల్లననే చేదు నిజాన్ని గుర్తించిన బుద్ధిజీవులు, మేధావులు, ఆవేదన చెంది ప్రభుత్వాలకు ఎన్ని సూచనలు చేసినా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకంగా భారతదేశంలోనూ ఈ దుర్భర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నవి.

భారతదేశంలోని కొన్ని పరిస్థితులు:-

గత సంవత్సరం కరోనా ప్రారంభమైన తర్వాత మొదటి దశలోనూ ఈ సంవత్సరం రెండవ దశలోనూ వలస కూలీలు అందరూ తమ తమ ప్రాంతాలకు వలస వెళ్ళినప్పుడు అనుభవించిన బాధలు, దారిలోనే జరిగిన చావులు ప్రజలతో పాటు ప్రభుత్వాలను కూడా కదిలింప చేసినవి.

భారతదేశంలో సుమారుగా 20 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని వారి అవసరాలను తీర్చడానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఆదుకోవాలని సూచనలు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.

సుమారుగా 20 కోట్ల మంది ఈ దేశంలో దారిద్య్ర రేఖ దిగువన నివసిస్తూ ఉంటే రోజువారీ సగటు సంపాదనను 375 గా నిర్ణయించిన ప్రభుత్వం కనీసం ఆ స్థాయిని కూడా చేరుకోలే నటువంటి 23 కోట్ల మంది రోజువారి కార్మికులు, చిరు వ్యాపారులు పస్తులు, అర్ధాకలితో అలమటిo చినట్లు
తెలుస్తున్నది.

కరోనా నేపథ్యంలో…

కరోనా సందర్భంగా పనులు లేక ఉపాధిని కోల్పోయి నటువంటి సాధారణ ప్రజానీకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చౌక ధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతున్నది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం గా నిర్ధారించిన వారికి మాత్రమే ప్రస్తుతము ఈ బియ్యం సరఫరా అవుతుండడంతో దశాబ్దకాలంగా అదనంగా వచ్చిన జనాభాకు అంటే సుమారుగా 10 కోట్ల మందికి అర్హత ఉండి కూడా బియ్యం సౌకర్యం అందక పోవడం విచారకరం. దానికి కారణం 2021 జనాభా లెక్కల సేకరణ జరగకపోవడమే.

దాదాపుగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలలో నిర్వహించబడుతున్న మధ్యాహ్న భోజన సౌకర్యం కరోనా కారణంగా పాఠశాలలు ,కళాశాలలు మూత పడటంతో సుమారుగా 12 కోట్ల మంది బాలబాలికలకు భోజన సౌకర్యం అందడం లేదని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ఆహార భద్రత పథకం కింద అట్టడుగు వర్గాలకు సంపూర్ణ స్థాయిలో ఆహారధాన్యాలను సరఫరా చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పేద ఇంటి గడప దాటని కారణంగా ఈ ఆకలిచావులు భారతదేశంలో మరీ ఎక్కువగా జరుగుతున్నట్లు ఆక్స్ ఫామ్ తన నివేదికలో వెల్లడించడం ఆందోళన కలిగిస్తున్న విషయం.

ఆహారధాన్యాల ఉత్పత్తి లేకనా…

వంట చేసుకో లేకపోతే తినలేము. కానీ వంట చేసి కూడా తినకపోవడం ఎంత బాధాకరమో! భారతదేశ గోదాములలో ఆహార ధాన్యాలు నిల్వ ఉండి కూడా కారణాలేవైనా ప్రజలకు ఆహార ధాన్యాలు అందకపోవడం కూడా అంతే స్థాయిలో బాధాకరమైనది.

ఈ అంశం అనేక సందర్భాల్లో పత్రికల్లో వచ్చినప్పటికీ ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ప్రజలు, బుద్ధి జీవులు, మేధావులు ప్రజల ఆకలి బాధలు నివారించలేక పోవడం పాలకుల వైఫల్యం గా భావించవచ్చు.

భారత ఆహార సంస్థ గోదాములలో ఆహార ధాన్యం ముక్కి పోతున్నా పేదలకు అన్నార్తులకు అందించకపోవడం లోని ఔచిత్యం ఏమిటని న్యాయవ్యవస్థ అనేకసార్లు ప్రశ్నించినా ఫలితం లేకపోయింది.

గోదాముల్లో 7.70 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నట్లుగా తెలుస్తుంది.అయి నప్పటికీ పేదల ముంగిటకు చేర్చడానికి అనేక సాంకేతిక కారణాలు అడ్డురావడంతో గత ఆరేళ్ళ కాలంలో 40 వేల టన్నుల తిండి గింజలు వృధాగా పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి దర్పణం పడుతున్నది. వలస కార్మికులు దినసరి తదితర కూలీల ఆకలి సమస్యను తీర్చమని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశిస్తే కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం లోని మర్మమేమిటి?

ప్రపంచ ఆకలి సూచి- పౌష్టికాహార సమస్య

ప్రతి రంగంలోనూ నిర్దేశించిన దేశాల సంఖ్యకు గాను సూచి నిర్ణయించే క్రమంలో భారతదేశం చాలా రంగాల్లో వెనుకబడి ఉన్న మాట నగ్నసత్యం. కేవలం పత్రికా స్వేచ్ఛ లోనే 147 దేశాల గాను 141 స్థానంలో భారతదేశం ఉండడాన్ని బట్టి ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ ఏపాటిదో తెలుస్తుంది. అలాగే ప్రపంచ ఆకలి 2020 సూచీ (Hunger Index 2020) లో 107 దేశాలకు గాను 94 వ స్థానంలో భారతదేశం నిలిచిందంటే అన్నార్తుల ఆకలి బాధలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ దేశంలో సంపద లేక కాదు కానీ ఆ సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండటం వల్ల ఈ దౌర్భాగ్యం దాపురిస్తుంది. అందుకే ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ “సంపన్నుల సంపద కంటే పేద అట్టడుగు వర్గాల మానవాభివృద్ధి ఈ దేశ అభివృద్ధికి గీటురాయి” అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది.

పాకిస్తాన్, నేపాల్, మయన్మార్ వంటి చాలా వెనుకబడిన దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఆకలి సూచీలో మరీ వెనకబడటం విడ్డూరం. పాలకుల యొక్క అసమర్థతకు అద్దం పడుతోంది.

ప్రణాళికా రచనలో 85 శాతం గా ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను కాకుండా 15 శాతంగా ఉన్నటువంటి సంపన్న వర్గాల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఇప్పటికీ జనాభాలో 14 శాతం సరైన పోషకాహారానికి నోచుకోకపోవడం రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పాలకుల యొక్క లోపం గానే చెప్పవచ్చు.

రాజ్యాంగం ద్వారా సంక్రమించిన జీవించే హక్కును అందులో భాగంగా గౌరవప్రదంగా బ్రతకడానికి అవసరమైన ఆహారం, ప్రాథమిక సౌకర్యాలను పొందడానికి ఈ దేశంలోని ప్రతి వ్యక్తికి హక్కు ఉందని ఇటీవల భారత సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిన విషయాన్ని ముఖ్యంగా పాలకులు దృష్టిలో ఉంచుకోవాలి. భారతదేశంలో ఒక్క శాతంగా ఉన్న సంపన్నవర్గాల చేతిలో 73% సంపద నిక్షిప్తమై ఉన్నది. అంటే మిగతా 99 శాతo ప్రజల చేతిలో 27 శాతం సంపద ఉంటే ఇలాంటి విపరీత పరిణామాలు కాక దేశములో తృప్తి ,ప్రశాంతత ,సమానత్వం ఎలా చేకూరుతుంది?

అభివృద్ధికి సంబంధించి, మానవ అభివృద్ధికి సంబంధించి ,అంతరాలు లేని వ్యవస్థ గురించి పాలకులు తమ కనీస బాధ్యత గా ఆలోచించి రాజ్యాంగ నేపథ్యంలో వినూత్న పరిపాలన అందిస్తేనే ఈ దేశంలో అర్థవంతమైన జీవితాన్ని అందించడంతోపాటు ఆకలికేకలు అధిగమించవచ్చు. లేకుంటే అతి వెనుకబడిన దేశాల సరసన భారతదేశం నిలబడితే ఎంత అవమానమో పాలకులు సమీక్షించుకోవాలి.


(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *