మెరిట్ కావాలన్నోళ్లే ఇపుడు రిజర్వేషన్లు అడుగుతున్నారు!

(జువ్వాల బాబ్జీ)

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్ల మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. యువత లో ఉన్న ఆవేశాన్ని ఏ విధంగా అణచి వేయాలా అని ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వానికి ఇ. డబుల్యు. ఎస్.(ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) వారికి 10 శాతం  రిజర్వేషన్ అస్త్రం ఒక ఆయుధం గా ఉపయోగ పడింది.

ఇప్పుడు ఈ అంశం పైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. అసలు ఒక వైపు దళిత మేధావులు హక్కుల సాధన లో భాగంగా రిజర్వేషన్లు కాదు దళిత లిబరేషన్ కావాలి అంటూ , మేధో మధనానికి సిద్ధమయ్యారు.

మరొక వైపు నిన్న మొన్నటి వరకు రిజర్వేషన్ ల వలన తమకు తీరని అన్యాయం జరిగిందని, మెరిట్ ఆధారంగా నియామకాలు జరపాలని డిమాండ్ చేసిన వారే రిజర్వేషన్ కోరటం ఆశ్చర్యంగా ఉంది.

దీనిని గట్టిగా వ్యతిరేకించిన కులాలు, కమ్మ, రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారు ఇప్పుడు మెరిట్ గురించి మాట్లాడితే బాగుంటుందేమో.

అసలు రాజ్యాంగంలో ఆర్టికల్స్: 14 నుండి 16వరకు సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్ ల ను రాజ్యాంగ నిపుణులు పొందు పరిచారు. వీటిని వ్యతిరేకిస్తూ కొందరు, సమర్ధిస్తూ మరికొందరు వాదోపవాదాలు చేశారు. చివరికి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి రిజర్వేషన్లు ఖరారు చేసారు.

ఈ సమస్య దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉంది.
రిజర్వేషన్ ల గురించి స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్. ఎమ్. థామస్, AIR 1976,SC 490 కేసులో సుప్రీం కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కృష్ణఅయ్యర్ ఈ క్రింది విధంగా అన్నారు.
“By improvement of the social environment; by added educational facilities; and by cross_fertilisation of castes by intercaste and inter-class marriages sponsored by a massive state program.”

పై మాటలు వినేవారు నిజంగా మన సమాజం లో ఉన్నారా? ఎంత మంది రిజర్వేషన్ లు వ్యతిరేకించే ప్రజలు తమ కుల భావన వదులు కోవడానికి సిద్ధంగా ఉన్నారు? నిజంగా వారి పిల్లలను వేరే కులం, మతం వారికిచ్చి వివాహాలు జరిపి దాని ద్వార కుల రహిత సమాజం కోసం కృషి చేస్తున్నారు? అందరూ సమానమే అని భావిస్తూ, రిజర్వేషన్ లు అక్కర్లేదు అని అడగ వచ్చు కదా. ఇంకా పరువు హత్యలకు ప్రేరే పించే ఖప్ పంచాయితీల తో పనేమీ ఉండదు కదా. ఇవేమీ మనం పట్టించుకోము. గుడ్డిగా ఒక వైపు మాత్రమే అర్థం చేసుకుని మంచి చెడులు మరిచి వాదులాడు తాము అనేది వారి వాదన.

గత తెలుగుదేశం ప్రభుత్వం హయంలో కాపు ఉద్యమాన్ని ఎదుర్కోవడం కోసం అప్పటి ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు వారికి 10 శాతం రిజర్వేషన్ తెచ్చాడు. దానికి వెంటనే జీ. ఓ. ఎమ్.ఎస్. నెంబర్; 52బి. సి. సంక్షేమ శాఖ, తేది;6/5/2019. తెచ్చారు.

అప్పట్లో ఈ అంశం మీద పెద్ద రాజకీయ చర్చ జరిగింది. ఇందిరా సహాని కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కు విరుద్ధంగా ఉందని ఇది పూర్తిగా రాజకీయ కుట్రగా ప్రతిపక్షాలు వాదించాయి.

సుప్రీం కోర్టు తీర్పు లో రిజర్వేషన్ లు 50 శాతం మించ కూడదని ఉంది. కాబట్టి అది ఓ. సి. లను సంతృప్తి పరచడం కోసం తెచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో, నిజంగా ప్రభుత్వం రిజర్వేషన్ సౌకర్యం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి అమలు చేస్తే ఈ విధంగా ఉంటాయి.
ఎస్సీ_15 శాతం, ఎస్టీ 6 శాతం, బి.సి 27శాతం, విభిన్న ప్రతిభా వంతులు3 శాతం, ఆర్మీ  1 శాతం,  ఇ. డబ్ల్యు. ఎస్. 10 శాతం, మొత్తం:62 శాతం.

అంటే దానర్ధం సగానికి పైగా ఇప్పుడు రిజర్వేషన్ సౌకర్యం పొందటానికి అర్హులు. ఇది పూర్తిగా సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా. దీనికి మహిళ కోటా కలిపితే 95 శాతం అవుతుంది.

రాష్ట్రం మొత్తం రిజర్వేషన్ ఫలాలు పొందే టప్పుడు ఇంకా మెరిట్ గురించి మాట్లాడితే మీ జ్ఞానాన్ని ఏమను కోవాలి.

ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని గ్రహించక పోవడం విచారకరం. నిజానికి సామాజిక న్యాయం అందించడమే రాజ్యాంగంలోపొందు పరిచిన రిజర్వేషన్ లప్రధాన ఉద్దేశ్యం, 6000 సంవత్సరాలుగా అణచి వేతకు గురవుతూ, అంటరాని వారుగా, విద్య, ఉపాధి, అవకాశాలు పొందలేక పోవడం, సహజ వనరులు అయిన భూమి, నీటిపై హక్కులు కోసం దళితులు ఆదివాసీలు చేసిన పోరాటాల ఫలితంగా వచ్చినవి.

అయితే, అవి ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఒక కొత్త పాలన కోసం కృషి చేసిన వారు కొంచెం ప్రయత్నం చేశారు. ఒక రెండు దశాబ్దాల పాటు రిజర్వేషన్ లు అమలు చేశారని చెప్పవచ్చు.

సంక్షేమ పథకాలు అమలు కు కృషి చేశారు. దళితులకు
విద్యకోసం ప్రభుత్వం పాఠశాలలు దళితవాడలకు అందుబాటులోకి తెచ్చింది. సంక్షేమ హాస్టళ్ల ద్వారా పేద విద్యార్థులకు వసతి, భోజన సదుపాయాలు , స్కాలర్షిప్పులు అందించి బలహీన వర్గాల పిల్లలకు విద్యను ప్రోత్సహించింది.”

గరీబీ హటావో “నినాదాన్ని ముందుకు తెచ్చి ,భూమిలేని పేదలకు ప్రభుత్వ భూములను పంపిణీ చేసి , వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి, డి .ఆర్ .డి. ఎ, షెడ్యూల్ కులాల కార్పొరేషన్లు, ఇలాంటి సంస్థలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.

దానితో ఒక తనం దళితులు చదువుకొని రిజర్వేషన్ల పేరుతో కొంత మంది ఉద్యోగ ఫలాలు అందుకోగలిగారు. 1975 సంవత్సరం తర్వాత పేదలకు భూ పంపిణీ కార్యక్రమం ,1985 తర్వాత దళితులకు ఉచిత విద్య ,ఉపాధి అవకాశాలు నెమ్మది నెమ్మదిగా ప్రభుత్వాలు తగ్గించడం ప్రారంభించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇటీవల కాలంలో ఉద్యోగ నియామకాల కోసం జాబ్ కేలండర్ విడుదల చేసింది. జీ. ఓ. ఎమ్ ఎస్ నెంబరు: 39 (తేది;18/6/2021)  ఉద్యోగాలు;10143.(అన్ని కులాల వారికి కలిపి) అందులో ప్రత్యేకంగా దళితుల కోసం జీ. ఓ. ఆర్. టి. నెంబర్;181సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసింది. దాని ప్రకారం మొత్తం ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టు లు 1238 రావాలి. కానీ నేటికి, అనగా జూలై 2021నాటికి వివిధ శాఖల నుంచి కేవలం 802 పోస్టులు ఇవ్వ నున్నారు. ఎస్సీ లకు:432,
ఎస్టీ లకు:370, మొత్తం:802. ఇంకా 436 ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ లు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయదు.

దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువత పెరిగి పోతుంది. మన రాష్ట్రం లో నిరుద్యోగ శాతం 2017నుండి విపరీతంగా పెరిగిపోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం; నిరుద్యోగులశాతం:2017సం.  14.8 శాతం నుండి. ఏప్రిల్ 2020లో నాటికి 20.5శాతం.పెరిగింది.

అలాగే దేశ వ్యాప్తంగా పోల్సితే మన నిరుద్యోగ రేట్;7.55శాతం. దీనిని బట్టే అర్థమవుతోంది మనకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కటం లేదనేది.
యువత కోసం ఉద్దేశించిన జాతీయ యువత పాలసీ ఎందుకు అమలుకు నోచుకోవడం లేదు. ఇందులో దళిత, ఆదివాసీ రిజర్వేషన్ రంగాల వారు కూడా ఉన్నారు.

భూముల పంపిణీ : దళితులు, ఆదివాసీలు అత్యధికంగా ఆధారపడిన వ్యవసాయ రంగంలో భూపంపిణీ 1975 సీలింగ్ చట్టం వచ్చాక పాలకులు ఉద్దేశ్య పూర్వకంగానే నీరు గార్చారు. భూస్వామ్య వ్యవస్థ ద్వారా రాజకీయ రంగంలో ప్రవేశించిన ఆధిపత్య కులాల వారు, భూ పంపిణీ కార్యక్రమం ఒక ఫార్స్ గా మార్చి వేశారు. వ్యవసాయ రంగం లోకి పెట్టుబడి రంగం ప్రవేశించడంతో వ్యవసాయ విధానమే పూర్తిగా మారిపోయింది.

గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పద్ధతులు యాంత్రీకరణ చెందడంతో తో దళితులకు ఆదివాసులకు భూముల పై హక్కులు దక్కడం లేదు సరికదా గతం నుంచి సాగు చేసుకుంటున్న ఎస్సైన్ మెంట్ భూముల ను పరిశ్రమ లకోసం బలవంతంగా తీసుకుంటు న్నారు. నిర్వివాదాంశం. పరిశ్రమలకు పెట్టుబడిదారులకు విస్తారమైన అటువంటి భూములు కట్టబెట్టడంతో ,భూముల నుండి వ్యవసాయం నుండి దళితులను వ్యవసాయ కూలీలను బలవంతంగా బయటకు నెట్టి వేస్తున్నారు.

కోనేరు రంగారావుభూ కమిటీ నివేదిక ప్రకారం: 1954 సంవత్సరం నుండి 2021వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వివిధ సందర్భలాలో ప్రభుత్వం భూములు పంపిణీ చేశారు. వీరిలో చాలామంది దళితులు ఆదివాసీలు ఉన్నారు.
మొత్తం లబ్ధిదారులు:1,743,449.
ఎకరాలు:2,657,106.28.
వీటిలో చాలా భూమి అసలైన పట్టా దారుల నుండి అనర్హుల చేతుల్లోకి వెళ్లింది.

వీటిపై 1/77 ఎస్సైన్మెంట్ చట్ట ప్రకారం నోటీస్ లు ఇచ్చి స్వాధీన పరచుకుని మరలా దళితుల కు ఇవ్వాలని కూడా కమిటీ నివేదిక ద్వారా సిఫార్స్ చేశారు. కానీ, అమలుకు నోచుకోలేదు.

2005సం. లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్రెడ్డి గారు విస్తారమైన వ్యవసాయ భూములను ప్రత్యేక ఆర్థిక మండళ్లు పేరుతో, పేదల సాగులో ఉన్న భూముల ను పరిశ్రమలకు కట్టబెట్టారు.

దేశంలోనే రెండవ స్థానం లో 68 సెజ్ లను నోటిఫై చేసి దాని ద్వార వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కానీ, అక్కడ మన లేబర్ చట్టాలు అమలు కావడం లేదని ఎంతమందికి తెలుసు.

అందులో చిన్న సన్న కారు రైతులు, వ్యవ సాయ కూలీలు, మత్య కారులు,మహిళలు ఎంతో మంది జీవనోపాధి కోల్పోయి గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళారో మనకు తెలుసు. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ లు ప్రైవేట్ కంపెనీలో అమలు చేయడం లేదు. పాలకులు, ప్రభుత్వ విద్యా సంస్థలను పిల్లలు లేరని మూసివేసి, ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడా ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం ఉండదు. దాని ద్వార, దళిత,ఆదివాసీ లను నాణ్యమైన విద్య కు దూరం చేశారు.

అది భారత రాజ్యాంగ రచన పూర్తి చేసి సభలో ఆమోదించటానికి సిద్ధమైన వేళ నవంబర్ నెల 1949 రచనా కమిటీ చైర్మన్ గా ఉన్న అంబేద్కర్ గారు చర్చలో పాల్గొంటూ ఇలా అన్నారు:  “ఏది ఏమైనా సరే,రాజ్యాంగం మంచిదే కావచ్చు.కానీ దానిని అమలు చేయవలసిన వారు చెడ్డ వారైతే అది చెడ్డ దవుతుంది. లేదా రాజ్యాంగం చెడ్డదే కావచ్చు, అది అమలు చేసే వారు మంచి వారైతే, అది మంచిది అవుతుంది.రాజ్యాంగం పూర్తిగా దాని స్వరూపం పైనే ఆధారపడి ఉండదు. అమలు చేసే వారి ఆలోచన ల పై ఉంటుంది.”

పై మాటలlను బట్టి రిజర్వేషన్ ఫలాలు ఏమాత్రం ఎస్సీ ఎస్టీ లకు అందున్నాయో అర్థం చేసుకుని నడవాలి.

అంబేడ్కర్ వాదులు/మేధావులు, దళిత వాదన (Dalit assertion) గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మనకు, మన జనాభా దామాషా ప్రకారం నిధులు, బడ్జెట్లో కేటాయింపులు జరిగాయా? నియామకాలు (ఎస్సీ, ఎస్టీ ల బ్యాక్ లాగ్)జరుగుతున్నాయా?

వనరులు అయిన భూమి, అడవి, నీరు,సముద్రం మొదలగు వాటిలో మనకు ఉన్న అభివృద్ధి,హక్కుల గురించి చెప్పడం లేదు.

అవన్నీ ఇప్పుడు మనకు కావాలి. వాటి సాధన కోసం కృషి చేయాలి. రాజకీయాలు చేస్తున్నారు కానీ, రాజీ పడితే ఎలా? నీ లక్ష్యం దిశగా అడుగులు వేయడం మంచిది. దానికి అంబేద్కర్ విగ్రహం దగ్గర చేసే తాత్కాలిక నినాదాలు కాకుండా, కొన్ని ప్రధానమైన డిమాండ్లతో సామాజిక న్యాయం కోసం ,ఆయన ఆశయాలను,ఆచరణలో పెట్టడానికి ముందుకు రావడం మంచిది.

(బాబ్జీ అడ్వకేట్,పోలవరం ప్రాజెక్టు దళిత నిర్వాసితుల జాయింట్ యాక్షన్ కమిటీ. 9963323968)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *