(టి లక్ష్మినారాయణ)
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడ్డది. అపెక్స్ కౌన్సిల్ ఛేర్మన్ కేంద్ర జలశక్తి మంత్రి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులు. ఎపెక్స్ కౌన్సిల్ తీసుకొనే నిర్ణయాలను అమలు చేయడానికి ఏర్పాటైనవే కృష్ణా నది, గోదావరి నది యాజమాన్య బోర్డులు.
ఎపెక్స్ కౌన్సిల్, యాజమాన్య బోర్డులకు నదీ జలాలను పంపిణీ చేసే అధికారం లేదు. నదీ జలాలను పంపిణీ చేసే అధికారం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం -1956 మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించే ట్రిబ్యునల్స్ కు మాత్రమే ఉన్నది. నేడు బచావత్ ట్రిబ్యునల్ తీర్పే అమలులో ఉన్నది. నికర జలాలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకే వినియోగించుకోవాలి.
అలాగే, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన సర్దుబాట్లకు కట్టుబడి నీటిని వినియోగించుకోవాలి. ఆ ప్రాతిపదికనే 811 టియంసీల్లో ఆంధ్రప్రదేశ్ కు 512 టియంసిలు, తెలంగాణకు 299 టియంసిలు నిర్ధారించబడ్డాయి.
ఆ నిష్పత్తిలో కృష్ణా నదిలో ప్రతి నీటి సంవత్సరంలో నీటిని వాడుకోవాలి. అది అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎపెక్స్ కౌన్సిల్ పైన ఉన్నది. యాజమాన్య బోర్డుల ద్వారా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అందుకే విభజన చట్టం మేరకు గజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో మిగులు జలాల ఆధారంగా నిర్మాణం చేపట్టబడ్డ తెలుగు గంగ, గాలేరు – నగరి, హంద్రీ – నీవా, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులను విభజన చట్టంలో పేర్కొన్నారు. వాటికి ముందుగా మిగులు జలాలను సరఫరా చేయాలి. ఆ బాధ్యత కృష్ణా నది యాజమాన్య బోర్డుపై ఉంది.
బచావత్ ట్రిబ్యునల్ నికర జలాలు కేటాయించని, విభజన చట్టంలో పేర్కొనని ప్రాజెక్టులు/పథకాలన్నీ కొత్తవే. వాటికి ఎపెక్స్ కౌన్సిన్ అనుమతి ఇచ్చిన తర్వాతే నిర్మించుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘించిన రాష్ట్రంపై చర్యలు తీసుకొనే, పెనాల్టీ విధించే బాధ్యతను ఎపెక్స్ కౌన్సిల్ కు విభజన చట్టం కట్టబెట్టింది.
కృష్ణా నది నికరజలాలు, గోదావరి నది నికరజలాలను ఏఏ ప్రాజెక్టులకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందో వాటన్నింటినీ గజిట్ నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. ఏఏ ప్రాజెక్టులకు అనుమతులున్నాయో!
ఏ ప్రాజెక్టులు విభజన చట్టంలో పేర్కొనబడ్డాయో! ఏ ప్రాజెక్టులకు అనుమతులులేవో! మొత్తం జాబితాను గజిట్ నోటిఫికేషన్ లో పేర్కొనబడింది.
ఈ బాధ్యతలను సవ్యంగా ఎపెక్స్ కౌన్సిల్ నిర్వర్తిస్తే చాలా వరకు రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను నివారించవచ్చు.
గజిట్ నోటిఫికేషన్ ను జారీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ళు అలసత్వం ప్రదర్శించడం మూలంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఘర్షణలుపడుతూ వస్తున్నాయి.
బచావత్ ట్రిబ్యునల్ కాలంలోనే నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా మా వాదన వినలేదని, మాది కొత్త రాష్ట్రం కాబట్టి, కొత్త ట్రిబ్యునల్ ను నియమించి న్యాయం చేయాలన్న తెలంగాణ రాష్ట్ర డిమాండ్ రాజకీయపరమైనది.
బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టు విచారణ చేస్తున్నది. ఈ పూర్వరంగంలో మరొక ట్రిబ్యునల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించే అవకాశం ఉన్నదో! లేదో! న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకొన్న మీదట నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతవరకు బచావత్ ట్రిబ్యునల్ తీర్పే శిరోధార్యం. ఎవరికి ఇష్టం ఉన్నా, లేకపోయినా చేయగలిగింది ఏమీ లేదు.
ట్రిబ్యునల్ తీర్పులు, పార్లమెంట్ చేసిన చట్టాలే శిరోధార్యం.
(టి.లక్ష్మీనారాయణ, కన్వీనర్,ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)