తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ యాగం నేటి నుంచి జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి నిన్న అంకురార్పణ జరిగింది.
కోవిడ్-19 కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ టిటిడి ఈ మహాయాగం నిర్వహిస్తోంది.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, మూల వర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన, నిత్యార్చన జరిగింది.
ఉదయం 8.30 గంటలకు ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారిని వేంచేపు చేశారు. ఇందులో భాగంగా సంకల్పం, కుంభ అవాహన, అగ్ని ప్రతిష్ట, చతుష్టార్చన, కోటి కుంకుమార్చనలో ఒక ఆవర్తి,హోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం కోటి అర్చన, మహా నివేదన, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో 400 కిలోల పుష్పాలతో అమ్మవారిని అర్చించారు. ఇందులో ఒక్కపూటకు 40 కిలోల కనకాంబరాలు, 120 కిలోల మల్లెపూలు, 40 కిలోల ఇతర సాంప్రదాయ పుష్పాలు ఉన్నాయి. మొత్తం 180 మంది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన ప్రముఖ ఋత్వికులు పాల్గొంటున్నారు.
ప్రతిరోజూ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ఈ మహాయాగాన్ని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
భక్తులకు అందుబాటులో వర్చువల్ సేవా టికెట్లు
భక్తులు తమ ఇళ్ల నుండి టీవీల ద్వారా వర్చువల్ విధానంలో మహాయాగంలో పాల్గొనాలనుకునే గృహస్తులు (ఇద్దరు) రూ.1001/- ఆన్లైన్లో టికెట్లను పొందవచ్చు. వర్చువల్ విధానంలో మహాయాగంలో పాల్గొనే గృహస్తులు 90 రోజుల్లోపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రూ.100/- ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా ఉచితంగా దర్శించుకోవచ్చు. దర్శనానంతరం గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అమ్మవారి అక్షింతలు అందజేస్తారు.