(సలీమ్ బాషా)
ఇంతవరకు పతకాలు గెలిచిన వాళ్ళ గురించి విన్నాం, తృటిలో పతకాలు చేజార్చుకున్న వాళ్ల గురించి విన్నాం, డోపింగ్ టెస్టులలో పతకాలు పోగొట్టుకున్న వారి గురించీ విన్నాం.
ప్రత్యర్థుల మధ్య ఎన్నో వివాదాలు, స్నేహాల గురించి కూడా విన్నాం. కానీ 1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో ఒక క్రీడాకారుడు తన ప్రత్యర్థికి సలహా ఇచ్చి బంగారు పతకాన్ని పోగొట్టుకుని రజత పతకం మాత్రమే పొందడం మాత్రం ఇంతవరకు ఒక్కసారే జరిగింది.
క్రీడా స్ఫూర్తి కి మరపురాని సంఘటన ప్రతీకగా నిలిచిపోయింది. బంగారు పతకం గెలిచిన క్రీడాకారు డు ” నాకు బెర్లిన్ ఒలింపిక్స్ లో గెలిచిన పతకం కన్నా, లజ్ లాంగ్ స్నేహమే గొప్పది” అని చెప్పాడంటే మనం అర్థం చేసుకోవచ్చు.
బంగారు పతకం గెలిచిన వాడు కూడా ఒకానొక గొప్ప క్రీడాకారుడు జెస్సీ ఓవెన్స్. అతనికి సలహా ఇచ్చి రజత పతకం పొందడమే కాకుండా, హిట్లర్ ఆగ్రహానికి గురైన వాడు లజ్ లాంగ్. అతని క్రీడా స్ఫూర్తి ఇప్పటికీ ఒలింపిక్స్ లో క్రీడాకారులు అందరూ గుర్తుకు తెచ్చుకుంటారు.
1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో పాల్గొన్నపోతున్న జెస్సీ ఓవెన్స్ ప్రతిభ గురించి విన్న హిట్లర్ అతన్ని ఓడించడానికి కి లజ్ లాంగ్ అనే క్రీడాకారుడి ని ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి సిద్ధం చేశాడు. లజ్ లాంగ్ కూడా ప్రతిభావంతుడైన క్రీడాకారుడు. లాంగ్ జంప్ లో క్వాలిఫైయింగ్ దశలోనే జెస్సీ ఓవెన్స్ తడబడ్డాడు. 7.15 మీటర్ల దూరాన్ని దూక లేకపోయాడు. ఇది గమనించిన లజ్ లాంగ్ జెస్సీ ఓవెన్స్ దగ్గరకొచ్చి ” ఈసారి బోర్డుకి 10 ఇంచుల అవతల పెట్టి దూకమన్నాడు. జెస్సీ అతని సలహా మేరకే దూకి ఫైనల్స్ చేరటమే కాకుండా బంగారు పతకం కూడా గెలిచాడు. లజ్ లాంగ్ రజతం తో సరిపెట్టుకున్నాడు.
గెలిచిన తర్వాత జెస్సీ మాట్లాడుతూ ” నేను గెలిచిన పతకాలన్ని కరిగించి ఒక ప్లేట్ తయరుచేసినా లజ్ లాంగ్ స్నేహాన్ని పూర్తిగా ప్రతిబింబించలేవు” అన్నాడు.
లజ్ లాంగ్ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం లో పోరాడుతూ చనిపోయాడు. జెస్సీ ఓవెన్స్ లజ్ లాంగ్ కూతురిని కలిశాడు. ఆమెకు ఓవెన్స్ కుమారుడికీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయని పత్రికల్లో వచ్చింది.
(సలీమ్ బాషా, స్పోర్స్ట్ జర్నలిస్టు, హోమియో వైద్యుడు)