ఆంధ్రప్రదేేశ్ ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలనుంచి మళ్ళీ 57కు తగ్గించబోతున్నాదా?
నరసాపురం లోక్ సభ సభ్యుడు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ రెబెల్ రఘురామకృష్ణ రాజు అలాంటి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వేళ ఆలోచన ఉంటే మానుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారుు.
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో, 1956 నుంచి చూస్తే పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలు ఉండేదని, ఇతర రాష్ట్రాలలో కూడా పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు లేదా 58 సంవత్సరాలు ఉంటున్నదని చెబుతూ దీనిని 57 సంవత్సరాలకు పదవీ విరమణ వయసును కుదించాలని అనుకోవడం అత్యంత దారుణం, తీవ్ర నిరాశ కలిగించే నిర్ణయమని ఆయన ముఖ్యమంత్రికి రాసిన ఒక సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు.
‘మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించబోతున్నారని విన్న తర్వాత నా మనసు అల్లకల్లోలం అయింది. అయితే అది వదంతి మాత్రమేనని తెలిసి కొంత ఊపిరి పీల్చుకున్నాను. అయినా ఎందుకైనా మంచిదని కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను,’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
లేఖలోని ముఖ్యాంశాలు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం భారతీయుడి ఆయు:ప్రమాణం 65 సంవత్సరాలు. ఈ లెక్కతోనే 1998లో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచింది. పదవీ విరమణ వయోపరిమితి నిర్ణయించిన నాటి కాలం తో పోలిస్తే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో భారతీయుడి ఆయు:ప్రమాణం మరింత మెరుగైంది. ఏపి పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (పదవీ విమరణ వయసు సడలింపు) చట్టం 1984 ను 2017లో చివరి సారిగా మార్చారు. అప్పటి వరకూ ఉన్న 58 ఏళ్ల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచుతూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మీరు మీ మనసులో ఇప్పుడు అనుకుంటున్నట్లుగా కాకుండా, గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగినదే.
మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచారు. 35 సంవత్సరాల పాటు సవరించకుండా ఉన్న ఈ నిబంధనను రాష్ట్రం ఏర్పడిన ఏడు సంవత్సరాలలో సవరించుకున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రమే దేశంలో కెల్లా అతి ఎక్కువ పదవీ విరమణ వయసు ఉన్న రాష్ట్రంగా చెప్పుకోవచ్చు.
మీకు ఈ సందర్భంగా చరిత్రలో జరిగిన కొన్ని విషయాలను తెలియచేస్తాను. 1985లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు పదవీ విరమణ వయసును 56 సంవత్సరాలకు కుదించారు. ఆయన అలా చేసినందుకు అన్ని ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. న్యాయస్థానాలు కూడా ఉద్యోగ సంఘాల వాదనలనే బలపరిచాయి. ఇప్పుడు మీరు అలాంటి నిర్ణయమే తీసుకుంటే అలాంటి ప్రతిఘటనలే సాధారణ ప్రజల నుంచి, న్యాయస్థానాల నుంచి కూడా మీరు ఎదుర్కునే అవకాశాలు ఉంటాయి.
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గించాలని మీరు తలపోస్తున్న ఈ కొత్త ఆలోచనకు విరుద్ధంగా మీరు ఇటీవల ఒక నిర్ణయం తీసుకోవడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. మీకు అత్యంత విధేయుడుగా ఉండి పలు అంశాలలో, నాకు సంబంధించిన అంశాలతో సహా, మీ మనోవాంఛను తీర్చిన సిఐడి అదనపు ఎస్ పి అయిన విజయ పాల్ కు మాత్రం ఆయన తన 60 సంవత్సరాల వరకూ పని చేసి, పదవీ విరమణ చేసినా, మళ్లీ తిరిగి ఆయనను కాంట్రాక్టు ప్రాతిపదికన మరింత సర్వీసును బహుమతిగా ఇచ్చారు.
అదే విధంగా పదవీ విరమణ చేసిన జస్టిస్ కనగరాజ్ కు 80 సంవత్సరాలకు పైబడి ఉన్న వయసులో కూడా పదవి ఇచ్చి సత్కరించారు. పాపం… ఆయనకు అంత ముదిమి వయసులో కూడా అత్యంత ఎక్కువ పని భారం ఉండే పోలీసు ఫిర్యాదుల అథారిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు. ఈ రెండు సంఘటనల్లో కూడా వయసు వచ్చి పదవీ విమరణ చేసిన వారినే మళ్లీ పిలిచి మరీ బాధ్యతలు అప్పగించారు.
గ్రామ సర్పంచ్ ల నుంచి కొన్ని బాధ్యతలను ఊడబెరికి వాటిని విఆర్ఓ కు కట్టబెడుతూ మన ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.2ను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసిన ఘటనను కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ మరో ఉదాహరణ చెబుతున్నాను.
ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులైన సర్పంచ్ ల నుంచి అధికారాలలో కోత విధించి ప్రభుత్వ ఉద్యోగులైన వారికి (విఆర్ఓ లకు) ఎక్కువ అధికారాలు ఇవ్వాలని మీరు ప్రయత్నించారు.
దీనికి విరుద్ధంగా మీరు మరో విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల వార్షిక పనితీరు నివేదికను తయారు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన నుంచి ఆ అధికారాన్ని ప్రజాప్రతినిధి అయిన మీరు లాక్కుంటున్నారు. మీరు చేస్తున్న ఈ పరస్పర విరుద్ధమైన పనులను, ఈ అసంబద్ధమైన నిర్ణయాలను ఎవరైనా సరే సాధారణ నిర్ణయాలుగా పరిగణనించగలరా? ఇలాంటి మీ చర్యల ద్వారా మీ ద్వైదీభావనలను వెల్లడించడమే కాకుండా ప్రతి చోటా ఒక రకమైన సందిగ్ధతను, సంశయాన్నీ కావాలని రుద్దుతున్నట్లుగా అనిపిస్తున్నది.
ఇలాంటి చర్యలన్నీ మీ పక్షపాత వైఖరిని వెల్లడిస్తున్నాయి. అంతే కాదు మిమ్మల్ని ఆశ్రయించిన వారికి సాధారణ ప్రజలకు మీరు వ్యత్యాసం చూపుతున్నారని మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. దీన్నే తెలుగు సామెతలో చెప్పాంటే ‘‘ అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్లకు కంచంలో’’.
పైన పేర్కొన్న అన్ని విషయాలలోనూ ఎలాంటి చర్చలు జరపకుండా, ఎవరి అభిప్రాయం తీసుకోకుండా మీ అంతట మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకున్నారు. మీరు ఈ సందర్భంగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.
మీరు ఆదరాబాదరాగా తీసుకుంటున్న పరస్పర విరుద్ధ నిర్ణయాలు, అస్పష్టతను మరింతగా పెంచే నిర్ణయాలన్నీ ఎలాంటి సత్ఫలితాన్నిచ్చే అవకాశమే ఉండదు. మీరు ఎంత ఆరాటపడి ఇలాంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకుంటే అంతలా మీరు పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది.
మనం మన ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు చెల్లించలేకపోతున్నాం. అదే విధంగా పదవీ విరమణ చేసిన మన మాజీ ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇంతటి దారుణమైన ఆర్ధిక పరిస్థితిలో ఉన్న మనం వయసు తగ్గించడం వల్ల పదవీ విరమణ చేసే 15,000 నుంచి 16,000 మంది ఉద్యోగులకు పదవీ విరమణ లాభాలను కూడా కలిపి ఎలా ఇవ్వగలుగుతాం? అదీ కూడా బడ్జెట్ లో ఎలాంటి వెసులుబాటు పెట్టుకోకుండా అర్ధంతరంగా తీసుకునే నిర్ణయంతో పడే ఆర్ధిక భారాన్ని ఎలా పూడ్చుకోగలుగుతాం? మీరు గుర్తించాల్సింది ఏమిటంటే వయసు అనేది కేవలం మన భావనే, సత్తాకు సూచిక కాదు.
సమర్ధత ముందు వయసు పెద్ద విషయమే కాదు. అందువల్ల మీరు తక్షణమే మీ ఆలోచన మార్చుకోండి. కనీసం జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న మీరు ప్రభుత్వ ఉద్యోగుల వెంట ఎందుకు పడుతున్నారు?
మీ ఆలోచనలను రాష్ట్రంలోకి వచ్చే పారిశ్రామికవేత్తలను ఎలా ప్రోత్సహించాలా అనే అంశంపైకి మళ్లించండి. రాష్ట్రంలో వారితో పెద్ద పెద్ద కర్మాగారాలు, ప్రాజెక్టులు పెటించే దిశగా ప్రోత్సహించండి. అలా కాకుండా వారితో తెరవెనుక కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు కూడా మూతపడేలా చేయకండి. నోటీసులు ఇవ్వడం ద్వారా లేదా ఎవరూ గమనించకుండా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాటకలిపి వారు కూడా మీ కక్షపూరిత వైఖరికి అయిష్టంగానైనా మద్దతు ఇచ్చేలా వత్తిడి తీసుకురాకండి. మీరు ఇలా చేస్తున్న ఒక ప్రయత్నం ప్రస్తుతానికి మన మధ్యే ఉండనివ్వండి.
వయసు పెరగడం అనేది మన చేతుల్లో లేనిది. అయితే పురోగమించడం అనేది మాత్రం కచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ తేడా తెలసుకోవడానికి కొంచెం సమయం తీసుకుని అయినా సరే మీరు ఆలోచించండి. పురోభివృద్ధి సాధించడం అనేది మన ప్రవర్తన పై ఆధారపడి ఉంటుంది. అందువల్ల నేను, ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గించే ఆలోచనను మానుకోండి,(అనే).