టిడిపికి సూటి ప్రశ్న!

(టి.లక్ష్మీనారాయణ)

ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల పరిరక్షణ కోసం నడుంబిగించాల్సిన బాధ్యత ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ సమాజంపై ఉన్నది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతూనే ఉన్నది. ఈ పూర్వరంగంలో “రామాయణంలో పిడకలవేట” అన్నట్లు టిడిపి శాసనసభ్యుల లేఖాస్త్రం ఉన్నది. పైపెచ్చు, దాన్నొక ఆందోళనాంశంగా మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా నీటి కష్టాలు వర్ణనాతీతం. నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రింద ప్రకాశం జిల్లాలోని ఆయకట్టు, ప్రత్యేకించి చివరి ఆయకట్టు భూములకు నీళ్ళు సక్రంగా అందడం లేదు. అలాగే కృష్ణా పశ్చిమ డెల్టాలో ఉన్న చివరి ఆయకట్టు భూములకు నీళ్ళు అందడం లేదు. జిల్లాలోని మెట్ట ప్రాంతాలు, కరవు పీడిత ప్రాంతాల నీటి కష్టాలు తొలగిపోతాయని కొండంత ఆశతో ఎదురు చూస్తున్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో క్షమించరాని జాప్యం జరుగుతున్నది.

2004లో అనుకొంటాను, సిపిఐ, ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో మార్కాపురం సమీపంలో ఉన్న వెలుగొండ శంకుస్థాపన స్థూపం వద్ద నుండి ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశాం. ఆ పాదయాత్రలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, నిథులు కేటాయించకుండా, నిర్మాణ పనులు ప్రారంభించకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే లక్ష్యంతో నాడు పాదయాత్ర చేశాం.

రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రకాశం జిల్లాకు నష్టదాయకమని ఆందోళన వ్యక్తం చేస్తూ ముగ్గురు టిడిపి శాసన సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్రాసిన ఉత్తరంపై నా స్పందనను సీనియర్ పాత్రికేయ మిత్రులు, రాజకీయ విశ్లేషకులు విక్రం పూలా గారు కోరారు. విక్రం గారికి ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ ద్వారా సమాధానం పంపాను. అలాగే, కృష్ణా నదీ జలాలపై తెలంగాణ ప్రభుత్వం తెరలేపిన వివాదంపై జరుగుతున్న చర్చలో భాగంగా వివిధ టీవీల్లో నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలను, నా ఇంటర్యూల వీడియోలను యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీక్షించిన కొందరు మిత్రులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రింద ప్రకాశం జిల్లాలోని ఆయకట్టు నీటి కష్టాలను జోడించి సానుకూల స్పందనలు తెలియజేశారు. వాటిపై స్పందించడం అవసరమని, కాస్త వివరంగా వ్రాయాలని భావించాను.

శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నీటిమట్టం నుండి నీటిని తరలించడానికి వీలుగా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుర్తి ఎత్తిపోతల మరియు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల (కొత్తది) పథకాలు, 824 అడుగుల నీటిమట్టం నుండి సొరంగ మార్గంలో నీటిని తరలించడానికి వీలుగా శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్.ఎల్.బి.సి.) ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నాయి. వాటివల్లలేని ప్రమాదం రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఎలా ముంచుకొస్తున్నదో! రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ వ్రాసిన ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టిడిపి శాసనసభ్యులు వివరిస్తే తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు ఉన్నది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ క్రింద ప్రకాశం జిల్లాలోని ఆయకట్టుకు నీటి సరఫరా సక్రమంగాలేని మాట ముమ్మాటికీ నిజం. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు బచావత్ ట్రిబునల్ 281 టియంసిల నికరజలాలను కేటాయించింది. అందులో 132 టియంసిలు కుడి కాలువకు కేటాయించబడ్డాయి.

బచావత్ ట్రిబునల్ కేటాయింపులకు అనుగుణంగా నికర జలాలను మరియు వినియోగ స్వేచ్ఛ కల్పించిన మిగులు జలాలను శ్రీశైలం జలాశయం నుండి వినియోగించుకోవడానికి వీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 జూన్ 15న జీ.ఓ.యం.ఎస్.నెం.69ను జారీ చేసింది. అందులో నీటి వినియోగానికి సంబంధించి మార్గదర్శకాలను ప్రాధాన్యతాక్రమంలో విస్పష్టంగా పేర్కొన్నారు.

1.మద్రాసుకు త్రాగునీరు, 2. హైదరాబాదుకు త్రాగునీరు, 3. కృష్ణా డెల్టాకు సాగునీరు, 4. నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీరు, 5. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు నీరు, 6. తెలుగు గంగ, శ్రీశైలం ఎడమ గట్టు కాలువకు నీటిని విడుదల చేయాలని ఆ జీ.ఓ.లో పేర్కొనబడి ఉన్నది. దాన్ని అమలు చేయమని అడగడం న్యాయం. అది అడగకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రకాశం జిల్లాకు నష్టమని అనవసర రాద్ధాంతం ఎందుకు చేస్తున్నట్లు!

శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(ఎస్.ఆర్.బి.సి.)కి 19 టియంసిల నికరజలాలు, చెన్నయ్ నగరానికి 15 టియంసిలు త్రాగునీరు, తెలుగు గంగకు 29 టియంసిలు(బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 25 టియంసిల మిగులు జలాలను కేటాయించింది), గాలేరు-నగరి పథకానికి 38 టియంసిలు, కె.సి.కెనాల్ కు 10 టియంసిలు, రాయలసీమ ప్రాంతంలో త్రాగునీటికి 3 టియంసిలు, మొత్తం 114 టియంసిలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే శ్రీశైలం జలాశయం నుండి కృష్ణా నదీ జలాలు సరఫరా కావాలి. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం తర్వాత మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తరలించాలని జీ.ఓ.నెం.69లో పేర్కొన్నారు.

కర్నాటకలో ఆల్మట్టి డ్యాం నిర్మించి, ప్రస్తుతానికి 519 అడుగుల ఎత్తుకు పరిమితం చేసి నీటిని వాడుకొంటున్నా, శ్రీశైలంకు వరద ప్రవాహం తగ్గిపోయింది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్ల ఎత్తుకు పెంచుకోవడానికి అనుమతిస్తూ తీర్పులో పేర్కొన్నది. అది అమలులోకి వస్తే పరిస్థితి మరింతదారుణంగా ఉంటుందని తీవ్ర ఆందోళన చెందుతున్నాం.

రాష్ట్ర విభజనతో ఎగువ రాష్ట్రంగా మారిన తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు ప్రశ్నార్థకమవుతాయి. నిర్మాణంలో ఉన్న వాటితో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ప్రకటించిన ప్రతిపాదిత పథకాలన్నింటి ద్వారా దాదాపు 400 టియంసిల మిగులు జలాలను వినియోగించుకోవడానికి వీలుగా ప్రాజెక్టులను నిర్మించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పథకం రచిస్తున్నది.

శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టం 834 అడుగులుగా జీ.ఓ.నెం.69లో పేర్కొన్నారు. అంతకంటే క్రింద నుండి త్రాగునీటికి తప్ప నీటిని వినియోగించకూడదు. కానీ, 800 అడుగుల నుండి కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు, 824 అడుగుల వద్ద నుండి ఎస్.ఎల్.బి.సి. పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చిన మీదట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీటిని సరఫరా చేయడానికి శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టంపైన ఎన్ని రోజులు నీటి నిల్వ ఉంటుందో విజ్ఞతతో ఆలోచించాలి.

ఈ పూర్వరంగంలో ఒకటే పరిష్కారం. జీ.ఓ.నెం.69లో పేర్కొన్న మార్గదర్శకాలకు కట్టుబడి శ్రీశైలం జలాశయం నుండి నీటిని వినియోగించుకోవాలి. మిగులు జలాలపై ఆధారపడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టంపైన నీటి నిల్వ ఉన్నప్పుడే నీటిని విడుదల చేయాలి. ఆ నిబంధనను విధిగా అమలు చేస్తే అప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే ఉండదు.

ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల పరిరక్షణ, నిత్య కరవు పీడిత ప్రాంతాలను నీటి కష్టాల నుండి శాశ్వతంగా విముక్తి చేసే రాజకీయ సంకల్పంతో, రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ సమాజం ఐక్యంగా నిలబడి, పోరుసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

(టి.లక్ష్మీనారాయణ, కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *