తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఎల్.రమణ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. రాజకీయ వనవాసం భరించలేక, ఆయన చివరకు రూలింగ్ టిఆర్ ఎస్ లో భవిష్యత్తుంటుందనే నమ్మకంతో ఈ రోజు పింక్ పార్టీ లో చేరారు. ఆయనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు.
టిఆర్ ఎస్ చేరిన వాళ్లంతా కే కేశవరావులాగానో, తలసాని తదితర మంత్రుల లాగనో ఒక వెలుగు తారన్న గ్యారంటీ లేదు. చాలా మంది టిఆర్ ఎస్ చేరి మాయమయిన పోయిన వాళ్లున్నారు. ఉదాహరణకు డాక్టర్ మందా జగన్నాథం ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియదు. ఆయన నాలుగు సార్లు లోక్ సభకు గెల్చిన యోధుడు. చివరన తెలంగాణ రాష్ట్ర సమతిలో చేరారు.అంతే, పత్తాలేదు. ఆయన పేరిపుడు వినిపించడం లేదు. టిఆర్ ఎస్ కు మీరెంత ఉపయోగం ఉంటుందనే దానిమీద ఆ పార్టీ లో మీ అదృష్టం ఆధారపడి ఉంటుంది. చేనేత కుటుంబానికి చెందిన బిసి నాయకుడయిన రమణ మొదట తాను టిఆర్ ఎస్ చాలా పనికొస్తానని రుజువుచేసుకోవాలి లేకపోతే, ఏదో ఒక పదవి వొచ్చినా,అది మూన్నాళ్ల ముచ్చటగానే మారిపోతుంది.
టిఆర్ ఎస్ సభ్యత్వం తీపుకుని ఒక సారి కౌన్సిల్ లో ప్రవేశించి అక్కడ ఉండేలేకపోయిన కాంగ్రెస్ నేత యాదవ్ రెడ్డి లాంటి వాళ్లు కూడా టిఆర్ ఎస్ ఉండిన వారే.
అందువల్ల టిఆర్ ఎస్ లోచేరడం పదవులకు పాస్ పోర్టు కాదేమో అనిపిస్తుంది. కెసిఆర్ ను కలసి అనుమతి ఏదో హామీ తీసుకున్నాకే ఆయన టిఆర్ ఎస్ లో చేరారని కొందరుచెబుతున్నారు. ఆయన ఏ హామీ ఇచ్చారో, ఎపుడు అమలుచేస్తారో వేచి చూడాలి.