కడప, జులై 9 : తెలుగు బాషా సాహితీ సౌరభంలో మణి దీపంలా వెలుగొందుతున్న సి.పి.బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు.
రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం బద్వేలులో పర్యటన ముగించుకుని మధ్యాహ్నం కడప సి.పి.బ్రౌన్ సాహిత్య పరిశోధన గ్రంథాలయాన్ని సందర్శించిన ఆయన.. ముందుగా యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న.. సి.పి.బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రంలో.. జానుమద్ది సాహితీపీఠం వారి సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగు సూర్యుడు, తెలుగు భాషా సముపార్జకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఆ తర్వాత.. సి.పి. బ్రౌన్ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి ఒక్కొక్కటిగా తిలకించారు. అంతేకాకుండా.. గ్రంధాలయంలో నిక్షిప్తం చేసిన అమూల్యమైన, వెలకట్టలేని పురాతన తాళపత్ర గ్రంథ నిధిని, పరిశోధనా గ్రంథాలను, పలు రకాల గ్రంథాలను ఆయన పరిశీలించారు. అనంతరం.. యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న.. సి.పి.బ్రౌన్ బాషా పరిశోధనా కేంద్రం విస్తరణాభివృద్ధికి.. గాను చిత్రకూటం అమృతవల్లి, కీ.శే. సంపత్ కుమార్ గార్ల సౌజన్యంతో రూ.5.50 కోట్లతో నిర్మించతలపెట్టిన నూతన భవన నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం.. ఆదరణ, ఔన్నత్యాన్ని కోల్పోయే స్థితిలో ఉన్న తెలుగు భాష సాహిత్యాన్ని.. పునర్లిఖించిన ఆంగ్లేయ సాహితీ శిఖరం.. “చార్లెస్ ఫిలిప్ బ్రౌన్” అని ఆయన సేవలు తెలుగు భాషా సాహితీవేత్తలకు ఆదర్శనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జేసీ (హౌసింగ్) ధ్యానచంద్ర, వైవియు విసి డా. సూర్యకళావతి, రిజిస్ట్రార్ విజయరాఘవ ప్రసాద్, ప్రిన్సిపాల్ ప్రొ.కృష్ణారెడ్డి, ప్రాజెక్ట్ ఇంజనీర్ నాగేశ్వర్ రెడ్డి, మూల మల్లికార్జునరెడ్డి, జానుమద్ది ట్రస్ట్ అడ్వైజరి కమిటీ మెంబెర్ జానుమద్ది విజయభాస్కర్, భూగర్భజల వనరుల శాఖ డిడి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.