• టిడిపి నేతల అరెస్ట్ ను ఖండిస్తున్నాం
• రాజారెడ్డి రాజ్యాంగంలో మానవహక్కుల హననం
• గిరిజనుల ఉనికికే ముప్పు తెస్తున్న వైసిపినేతలు
• నిబంధనల ప్రకారం తవ్వకాలు జరిపితే భయం దేనికి?
• సిబిఐతో విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలి
• అప్పటివరకు విశాఖ మన్యంలో తవ్వకాలను నిలిపివేయాలి
బాక్సైట్ తవ్వకాల పరిశీలనకు వెళ్తున్న టీడీపీ బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖండించారు. ఈ మేరకు ఒక ప్రటకన విడుదల చేశారు. ఆంధ్రదేశంలో రాజారెడ్డి (ముఖ్యమంత్రి జగన్ అబ్బ) రాజ్యాంగం అమలు అవుతూ ఉందని, దీనితో మానవహక్కలు పూర్తిగా అంతరిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్ర బాబు ప్రకటన:
ప్రతిపక్ష నేతలకు రాష్ట్రంలో ప్రశాంతంగా పర్యటించే హక్కు లేదా? రాజారెడ్డి రాజ్యాంగంలో మానవ హక్కులను కాలరాస్తున్నారు.
ప్రకృతి వనరులను విధ్వంసం చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు క్షేత్రస్థాయి పరిశీలన జరిపితే వైకాపా నేతల అక్రమ మైనింగ్ వ్యవహారం బహిర్గతమవుతుందనే భయంతోనే ఇలాంటి దొంగదారులు వెతుక్కుంటున్నారు.
ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? టీడీపీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు? రెండేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.
వైసీపీ నేతల ధన దాహానికి అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. పంచభూతాలను దోచేస్తున్నారు.
అక్రమ మైనింగ్ తో గిరిజనుల ఉనికికే ముప్పువాటిల్లేలా వైసిపి నేతలు వ్యవహరిస్తున్నారు.
రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ చేయడమంటే ఆదివాసీల హక్కులను కాలరాయడమే.
వైసీపీ నేతల అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు వారికి సహకరించడం దారుణమైన చర్య. లేటరైట్ తవ్వకాల పేరుతో సుమారు వేల కోట్లరూపాయల విలువైన బాక్సైట్ నిక్షేపాలను కొల్లగొట్టేందుకు అధికార పార్టీ పెద్దలు పథకం రూపొందించారు.
ఇప్పటికే లాటరైట్ పేరుతో బాక్సైట్ అక్రమ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వైసిపికి చెందిన ఒక బినామీ రాబోయే అయిదేళ్లలో 15వేల కోట్లరూపాయల మేర తవ్వకాలు చేపట్టనున్నట్లు గిరిజన నేతతో చేసిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కొందరు వైసిపి పెద్దల అండదండలతో విశాఖ మన్యంలో సాగుతున్న లాటరైట్, బాక్సైట్ మాఫియాపై సిబిఐ విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గుతేల్చాలి.
అప్పటివరకు తవ్వకాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
గిరిజనుల మనోగతాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.