– మిగతా 15 మంది హక్కుల ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలి: ఐక్యరాజ్యసమితి మానవహక్కుల హైకమిషనర్
(రాఘవ శర్మ,)
స్టాన్ స్వామి జైల్లోనే రిమాండు ఖైదీగా మృతి చెందడం పట్ల ఐక్యరాజ్యసమితి మానవహక్కుల హైకమిషనర్ మైఖేల్ బ్యాచ్‌లెట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మానవ హక్కుల ఉద్యమ కారుడు, ఎనభై నాలుగేళ్ళ స్టాన్ స్వామి మృతి సంఘటన తమను తీవ్రంగా కదిలించివేసిందని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషనర్ తరపున దాని అధికార ప్రతినిధి లిజ్ త్రోసెల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
స్టాన్‌స్వామి మృతి వార్త ఒక విధ్వంసకర సంఘటన అని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమర్ధనకు ప్రత్యేక సంధానకర్త మేరిలాలొర్ ట్వీట్ చేశారు.
స్టాన్ స్వామిని అరెస్టు చేసినప్పటి నుంచి బెయిల్ ఇవ్వకుండా జైలులో నిర్బంధించారని మైఖేల్ బ్యాచ్‌లెట్ ఆ ప్రకటనలో తెలిపారు.
మానవహక్కుల కోసం దీర్ఘకాలికంగా పోరాడుతున్న స్టాన్‌స్వామి పైన 2018లో జరిగిన ఒక ప్రదర్శనకు సంబంధించి చట్టవ్యతిరేక నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఆరోపణలతో కేసుపెట్టారని గుర్తు చేశారు.
ఈ కేసులోనే అరెస్టు చేసిన మరో 15 మంది మానవహక్కుల ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని భారత ప్రభాత్వానికి విజ్ఞప్తి చేశారు.
జైలులో ఉన్న స్టాన్ స్వామికి కరోనా సోకిందని, ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు.
తమకు లభించిన ప్రాథమిక హక్కులను అనుసరించి భావప్రకటనాస్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశం కావడం, సంఘటితంగా ఏర్పడిన వారిని నిర్బంధించరాదని గుర్తుచేశారు.
భీమా కోరేగాన్ కేసులో తగిన చట్టపరమైన ఆధారాలు లేకుండా కేవలం విమర్శలు చేసినందుకు, నిరసనను వ్యక్తం చేసినందుకు అరెస్టు చేయడం సరికాదని పేర్కొ న్నారు.
(The Wire సౌజన్యం తో)