(రాఘవశర్మ)
ఇది దాదాపు 25 సంవత్సరాల కిందటి మాట. ఆ రోజుల్లో తిరుమల సమీపాన ఉన్న కుమారధార తీర్థానికి సాగిన యాత్ర ముచ్చట.
తిరుమలలో పశ్చిమాన ఒక అతి పెద్ద రాతి కుండ.దానికి ఒక పక్క చీలిక నుంచి పడుతున్న నీటి ధార. ఆ ప్రకృతి వైచిత్రే కుమారధార.
తిరుమలలోని అతి ముఖ్యమైన తీర్థాలలో కుమార ధార ఒకటి. ప్రతి ఏడాది మాఘపౌర్ణమి నాడు (ఫిబ్రవరి లో)ఈ తీర్థ ఉత్సవం జరుగుతుంది. చుట్టూ గుండ్రంగా కప్పేసుకున్నట్టున్న ఒక పెద్ద రాతి కొండ.నేలంతా పరుచుకున్న రాతి బండ.
ఆ వలయాకారపు రాతి కొండకు పశ్చిమాన సన్నని చీలికనుంచి నిరంతరం వచ్చిపడుతున్న నీటి ధార. తిరుమల కొండల్లో కనువిందు చేసే కుమార ధారను చూస్తుంటే మనసు పరవశించిపోతుంది.
తిరుమలలో మా ట్రెక్కింగ్ కుమారధారతోనే మొదలైంది. ఈ తీర్థాన్ని 1997లో మా మిత్రబృందంతో కలసి తొలిసారిగా దర్శించాను.
ఆ రోజుల్లో తిరుపతి వార్త బ్యూరో చీఫ్‌గా ఉన్న పున్నాకృష్ణమూర్తి, ఆయన సతీమణి, మా మేనల్లుడు నాలుగేళ్ళ వయసున్న బబ్బి(శరత్ చంద్ర, ఇప్పుడు software నిపుణుడు ), మా మేనకోడలు ఉషారాణితో కలిసి తిరుమలలో అది మా తొలి ట్రెక్కింగ్.
జర్నలిస్టు బీవీ రమణ, మా కుటుంబ స్నేహితుడు తిరుపాలు, కాళ్ళకు చెప్పులు లేకుండా అడవిలో చకచకా నడిచిపోయే గిరిజనుడు ఈశ్వరయ్య(దివంగతుడు) తోపాటు మరికొందరు మాతో కలిసి కుమారధారకు నడిచారు.
ద్విచక్రవాహనాల్లో పొద్దున్నే తిరుమలకు బయలుదేరాం. తిరుమలలో పాపనాశనం డ్యాం చేరుకున్నాం. పాపనాశనం డ్యాం పిట్టగోడపైన మా మేనల్లుడిని కూర్చోబెట్టి పున్నా కృష్ణమూర్తి ఫోటో తీస్తానన్నారు. పిట్టగోడపైన కూర్చున్నాడు కానీ , ఎంత చెప్పినా నోటిలో కొబ్బరి చిప్ప తీయలేదు.అలాగే ఫొటో తీశారు. వాడి బాల్యంలో అదొక మధురానుభూతిగా మిగిలిపోయింది.
మా మేనల్లుడు బబ్బి కొంత దూరం నడిచి, నడవలేనప్పడు మా బుజాలపైకెక్కేవాడు. బుజాలపై కూర్చుని అడవిని చూస్తూ, సరదాగా కబుర్లు, చెబుతూ అందరినీ అలరించాడు. డ్యాం దాటి పశ్చిమ దిశగా కొంతదూరం సాగితే నడకదారి రెండుగా చీలింది. కుడివైపు దారిలో నడిస్తే తాంత్రికలోయ, రామకృష్ణ తీర్థం, తుంబురు తీర్థం వస్తాయి.
కుమార ధారకు ఎడమవైపున పశ్చిమదిశగా సాగాం. గుంతలు మిట్టలు ఎక్కుతూ దిగుతూ ఆ దారి వెంట నడవడం గొప్ప అనుభూతి. దారిలో సైకస్, శతావరి, తదితర మొక్కలతో పాటు ఈసాఫల్ గడ్డలు కనిపించాయి.కొండ ఎక్కి దిగగానే ఎదురుగా చదునైన ప్రాంతం. కుమారధారకు దారి చూపిస్తున్నట్టు దారంతా పరుచుకున్న బండలు. ఇప్పడు ఆ బండలు కనిపించడంలేదు. కుమారధార, పసుపుధార ప్రాజక్టులు కట్టే సమయంలో ఆ బండలును తొలగించారు. ముందుకు సాగితే చిన్న మిట్ట. అక్కడ ఈత చెట్లు, సారపప్పు చెట్లు కనిపిస్తాయి.
కాస్త ముందుకు సాగితే అరుదైన అడవిపసుపు కనిపిస్తుంది. అక్కడ పరుచుకున్న బండలపైన చెప్పులు లేకుండా నడిస్తే చల్లని స్పర్శానుభూతి కలుగుతుంది. వీటిని పసుపుధార బండలనేవారు.
ఈ మార్గంలో సారపప్పు చెట్లు, కరక్కాయ చెట్లు, నెల్లి(పెద్ద ఉసిరి) చెట్లు కనిపిస్తాయి. నీటి కోసం ఈ ప్రాంతానికి కణుతులు, దుప్పులు వచ్చేవి. పసుపుధార బండలు దాటగానే పొరలు పొరలుగా పరచుకున్న బండలు మొదలవుతాయి.
ఈ రాతి పేటుదగ్గరే రాతి సాంబ్రాణి లభ్యమయ్యేది. పసుపుధార, కుమారధార ప్రాజెక్టులు కట్టకముందునాటి మాట ఇది. కాస్త ముందుకు వెళితే ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు కనిపిస్తాయి.
చీకటిపడితే చాలు దుప్పులు, జింకలు, చిరుతలు, ఒక్కొక్కసారి ఏనుగులు కూడా నీటికోసం ఈ ప్రాజెక్టు వద్దకు వస్తాయి. ఆ ప్రాజెక్టుల పై నుంచి చూస్తే కుమారధారకు వెళ్ళే లోయ కనువిందు చేస్తుంది.
పసుపుధారకు కుడివైపుగా దిగువకు నడిస్తే ఒక చిన్న లోయ. ఆ లోయలోకి దిగి ముందుకు సాగితీ రెండు కొండల నడుమనుంచి వంక పారిన ఆనవాళ్ళు.
ఆ వంకకు ఇరువైపులా పందిరిలా కప్పుకుపోయిన చెట్లతో పరుచుకున్ననీడ.ఏ మాత్రం వెలుతురు చొరబడని దట్టమైన ఆ చెట్ల మధ్యనుంచి వంకలో రాళ్ళపై నడుస్తూ ఉంటే ఏదో సాహసం చేసినట్టు ఉంటుంది.
దారి ఇరుకుగా ఉండే చోట మధ్యలో పెద్ద నీటి గుండం. కొండ అంచులనుంచి వంగి వంగి ఆ నీటి గుండాన్ని జాగ్రత్తగా దాటితే, ఏటవాలుగా పరుచుకున్న బండలపై సాగే దారి కనిపిస్తుంది.
ఇక్కడ నుంచి గ్రిప్పులేని చెప్పులు, బూట్లు వదిలేసి ఉత్తి కాళ్ళతో నడవడం ఉత్తమం. ఉత్సవ సమయంలో ఈ ఏటవాలుబండపై నుంచి కుమారధారలోకి దిగడానికి ఇరువైపులా ఇనుప కమ్మీలు అమర్చుతారు.
ఈ ఇనుపకమ్మీలకు తాళ్ళు కట్టి దిగడానికి ఏర్పాటు చేస్తారు. మేం తొలిసారిగా కుమారధారకు వెళ్ళిన సమయంలో ఈ ఏర్పాట్లేమీ లేవు. కూర్చుని అతి జాగ్రత్తగా దిగాం. ఏ మాత్రం జారినా వంద అడుగుల లోతులో ఉన్న కుమారధార తీర్థంలోకి దొర్లుకుంటూ పడిపోతాం.
ఏటవాలుగా ఉన్న బండ పైనుంచి కుమారధారలోకి చూస్తే మనసు పరవశించిపోతుంది. అదొక ప్రకృతి వైచిత్రి. ప్రతి ఏడాది తీర్థ సమయంలో చెట్లమాన్లతో చెక్క నిచ్చెన ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఇనుప నిచ్చెన శాశ్వతంగా ఏర్పాటు చేశారు.
ఆ నిచ్చెన ద్వారా ఒక పెద్ద విశాలమైన గుండ్రటి రాతి లోయలోకి దిగుతాం. వలయాకారంలో చుట్టూ ఉన్న రాతి కొండకు అక్కడక్కడా లోనికి చొచ్చుకుపోయినట్టున్న గుహ అంతర్భాగం.
రాతి కొండ ఆంచుల్లో పెరిగిన వృక్షాల నుంచి కిందికి వేలాడుతున్న ఊడలు. వలయాకారపు కొండకు పశ్చిమదిశగా ఒక చిన్న చీలిక నుంచి జాలువారుతున్న జలధార. ఆ జలధార చిన్న చిన్న నీటి గుండాలలో పడి తూర్పునకు ప్రవహిస్తూ తాంత్రికలోయకు చేరుతుంది.
అక్కడి నుంచి రామకృష్ణతీర్థం ద్వారా తుంబురు తీర్థంలోకి చేరుతుంది. వలయాకారపు కొండకు తూర్పున మరొక పెద్ద చీలిక. ఈ చీలికలో రెండు కొండల నడుమ నీటిలో ఈదుకుంటూ ముందుకు సాగితే రెండు వైపులా చిత్రవిచిత్రమైన రూపాల్లో ఎత్తైన రాతి కొండ, ఒక్కోచోట ఒక్కో రూపంలో దర్శనమిస్తుంది.
ఒక్కొక్క చోట ఒక్కరు మాత్రమే ఈదుకుంటూ సాగేలా సన్నని దారి. మాఘ పౌర్ణమినాడు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ తీర్థంలో స్నానాలు చేస్తారు.కొందరు ఈ తీర్థంలోనే గడిపి మర్నాడు తిరుగుప్రయాణమవుతారు. ఈ తీర్థం ఏకాంతానికి నిలయం.
కుండలాంటి వలయాకారపు కొండ మధ్యలో రాతిబండపై వెల్లకిలా పడుకుంటే ఎంత అలుపైనా తీరిపోతుంది.కుమార ధారకు వెళ్ళడం ఒక మధురానుభూతి.
(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)