తెలంగాణ = శౌర్యం అని చాటి చెప్పిన కొమరయ్యకు నివాళి

దొడ్డి కొమురయ్యఅమరత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రేరణ నిచ్చింది. భూమి, భుక్తి ,విముక్తి ఆ పోరాట నినాదంగా మారింది. ఈ రోజు దొడ్డి కొమురయ్య 75వ వర్ధంతి. ఆ అమరత్వాన్ని నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నమే ఈ నివాళి.

 

(వడ్డేపల్లి మల్లేశము)

“అమరజీవి నీవు కొమరయ్య
అందుకో జోహార్లు కొమురయ్య
లంచగొండుల అండ దేశముకులకు ఉండ
న్యాయ రక్షణ కొరకు నడుము బిగించి తిని
గుండాల తుపాకి గుళ్ళకు ఎదురుగా పోరి
బలి అయిన వీరులలో కొమురయ్య
నీ పేరు నిలుపకనే కొమురయ్య
నిద్ర పోము మేము కొమురయ్య”

తెలంగాణ ప్రజల బానిస సంకెళ్ల విముక్తికోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఈ నేల మీద సాగిన మహోద్యమం. దొరలు ,దేశ్ముఖ్ల, పటేళ్లు ,పట్వారీలు, దౌర్జన్యాలను రజాకార్ల బీభత్సకాండను ,నిజాం నిరంకుశత్వాన్ని, బాంచన్ నీ కాల్మొక్తా అనే బానిసత్వం నుండి సామాన్య ప్రజలు వెట్టిచాకిరి చేస్తున్న వారు “నీ జులుం ఏందిరా “అని తిరగబడ్డారు.

నాటి కరీంనగర్ జిల్లాకు చెందిన బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి ,ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమల వంటి ఎందరో నాయకుల సారధ్యంలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, లెవీ ధాన్యం వసూలుకు నిరసనగా, రజాకార్ల అకృత్యాలకు ప్రతిఘటన గా ఎందరో సాయుధ పోరాట వీరుల ను ఈ ఉద్యమం తయారు చేసినది.
ఈ ఉద్యమంలో తొలి అమరుడు కడివెండి గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య.

దొడ్డి కొమురయ్య అనగానే కడవెండి, కడవెండి అనగానే పోరాటయోధుడు నల్ల నరసింహులు పుట్టిన ఊరు. ఊరి మధ్యలో అమరుడు దొడ్డి కొమురయ్య స్తూపం కడవెండి గ్రామ ప్రదేశంలోనే సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు తో పాటు అనేక నాటి నేటి పోరాట రూపాలు దర్శనమిస్తాయి.

అక్కడికి దాదాపుగా పది కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర మహాసభ కార్యకర్తగా తన పోరాటంలో గెలిచిన కూడా గుండాల చేతిలో అమరుడైన కామారెడ్డిగూడ కు చెందిన బంధగీ సమాధి కామారెడ్డి గూడచౌరస్తా లో ఉంది.
వీరనారి చాకలి ఐలమ్మ స్వగ్రామం పాలకుర్తి. 60 గ్రామాలకు అధిపతి గా ఉన్న రామచంద్రా రెడ్డి స్వగ్రామం విస్నూరు దగ్గరే.

చరిత్రలో తమకంటూ పోరాట ప్రాధాన్యత లిఖించుకున్న ఈ గ్రామాల్లో అన్నీ కూడా ఒకే ప్రాంగణంలో ఉండటం ఇప్పటికీ ఆ ప్రాంతంలో చైతన్యం కనబడుతూనే ఉండటం గమనించదగినది. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య నడయాడిన నేల ఆ గ్రామాలకు వన్నె తెస్తే ఆ ప్రాంతాలలో పర్యటిస్తే తప్పకుండా మనం భావోద్వేగానికి గురి అవుతాము.
నేను 2017 ప్రాంతంలో ఆ ప్రాంతాలను పర్యటించి చారిత్రక వారసత్వాన్ని, పోరాట గాథలను నాటి వ్యక్తుల నుండి సేకరించి కదలాడిన నేలను ముద్దాడి వారి అమరత్వానికి జోహార్లు అర్పించిన అనుభవంతోనే ఈ వ్యాసాన్ని రాస్తున్నాను.

విసునూరు రామచంద్రారెడ్డి తన ప్రాబల్యాన్ని కొనసాగిస్తుంటే తన తల్లి జానమ్మ దొరసానికి బదులు “దొర”అని ప్రజలతో పిలువబడుతూ ప్రజలను నానారకాలుగా పీడించే ది. జానమ్మ కడివెండి గ్రామములో ఉంటూ లెవీ ధాన్యాన్ని నిర్బంధంగా వసూలు చేస్తూ వెట్టిచాకిరి ని నిర్బంధంగా అమలు చేస్తూ ఎదిరించిన వారిని చంపి తన ఆగడాలను నిరాటంకముగా కొనసాగించింది.

దొడ్డి మల్లయ్య తమ్ముడు దొడ్డి కొమురయ్య అన్నకు ఆసరాగా ఉండి అన్యాయాన్ని ఎదిరించి నప్పటికీ జానమ్మ ఆగడాలను భరించలేక దొడ్డి మల్లయ్య ఇస్లాం మతాన్ని స్వీకరించి ఖాదర్ అలీ గా పేరు మార్చుకుని నికృష్టంగా బ్రతుక వలసి వచ్చింది.

1944లో భువనగిరిలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కడవెండి గ్రామం లో ఆంధ్ర మహాసభ గ్రామ శాఖను దామోదర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై ఏర్పాటు చేసుకున్నారు.నల్లనరసింహులు కార్క్యయదర్శి. ఉద్యమం ఫలితంగా నాటి అధికారులతో జానమ్మ ఆగడాలపై ఒత్తిడి తెచ్చిన కారణంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు
కడివెండి లో పర్యటించి ప్రజల నుండి జానమ్మ అక్రమంగా సంపాదించిన 80 పూట ధాన్యాన్ని జప్తు చేసి వెళ్ళారు.

ఈ అవమాన భారాన్ని అటు రామచంద్రారెడ్డి ఇటు జానమ్మ పట్టుకోలేక పోయింది. ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తల పై అక్రమ కేసులు బనాయించి పోలీసులతో అరెస్టు చేయించారు. అప్పటిదాకా సంఘం కార్యకర్తల దగ్గర కర్ర బలమే తప్ప ఆయుధాలు లేవు ఐక్యత వారి ఆయుధం పోరాట స్ఫూర్తి వారికి కొండంత అండ.

సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని విసునూరు రామచంద్రారెడ్డి మామ గడ్డం నరసింహ రెడ్డి నేతృత్వంలో గుండాల ఆధ్వర్యంలో 40 మంది కడవెండి గ్రామం పై జులై 4, 1946 న విరుచుకుపడ్డారు. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఆర్గనైజర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వందల మందికి పైగా ప్రజలు దౌర్జన్యాన్ని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తూ ఆంధ్ర మహాసభ, గ్రామ సంఘం వర్ధిల్లాలి, దేశ్ముఖ్ల దౌర్జన్యాలు నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహిస్తుండగా దొడ్డి కొమురయ్య తన అన్న దొడ్డి మల్లయ్య తో సహా ఊరేగింపు ముందు వరుసలో నిలిచారు. ఊరేగింపు జానమ్మ గడి దగ్గరికి రాగానే నరసింహారెడ్డి ముస్కిన్ అలీ అనుచరుల గుండాల జరిపిన కాల్పుల్లో జై ఆంధ్ర మహాసభ అంటూ దొడ్డి కొమరయ్య వీర మరణం చెందారు.

దొడ్డి కొమురయ్య శవాన్ని జనగామ తీసుకెళ్ళి గత్యంతరం లేని పరిస్థితుల్లో కడవెండి గ్రామానికి తీసుకురాలేక నెల్లుట్ల గ్రామం వద్ద పూడ్చి పెట్టారు. కేవలం విసునూరు జాగీర్దార్ హయాంలో జరిగిన ఈ అరాచకం కొమురయ్య అమరత్వం నాటి తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న వెట్టిచాకిరి, బానిసత్వ నిర్మూలన కోసం విముక్తి కోసం తెలంగాణ వ్యాప్తంగా మహోద్యమంగా మారింది ఆ ఉద్యమమే తదనంతరకాలంలో 1947 సెప్టెంబర్లో ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు రాష్ట్ర నాయకత్వం తెలంగాణ సాయుధ పోరాటంగా పిలుపునివ్వడంతో 1951 వరకు ఈ ఉద్యమం కొనసాగింది.

ఆ ఉద్యమం కొనసాగుతున్న కాలంలో పటేల్ పట్వారీ ల దోపిడీ నుంచి రజాకార్ల దుర్మార్గాన్ని నుండి వందలాది గ్రామాలను విడిపించి భూస్వాముల నుండి నిర్బంధంగా గుంజుకున్న పది లక్షల ఎకరాలను పేద ప్రజానీకానికి పంచిపెట్టి విప్లవోద్యమానికి సార్ధకత చేకూర్చిరి.

ఈ ఉద్యమంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టు ,ఆంధ్ర మహాసభ కార్యకర్తలు అమరులైన ప్పటికీ భూస్వాముల ఆగడాలను నిలువరించడం దేశ చరిత్రలోనే గొప్ప అధ్యాయం.

దొడ్డి కొమురయ్య అమరత్వానికి నేటికీ 75 ఏళ్లు నిండినవి. నాటి ఉద్యమ అవసరాల రీత్యా పేద ప్రజానీకం ఏరకంగా ఉద్యమంలో చేరి ప్రజల విముక్తి కోసం పనిచేశారో నాటి ఉద్యమ స్థితిగతులను పోరాటపటిమను నేటి యువత అధ్యయనం చేసినట్లయితే నేడు రాష్ట్రంలో దేశంలో కొనసాగుతున్న గడ్డు పరిస్థితులను ఎదిరించడం లో కృతకృత్యులం  కాగలము.

దొడ్డి కొమురయ్య నాడు తూటాలకు బలి కావడంతో గ్రామగ్రామాన ఊరూరా ప్రజానీకం ఎగిసిపడింది. నాటి ఆంధ్ర మహాసభ 1948 జూలై 26 వ తేదీన సంస్మరణ సభ ఏర్పాటు చేయడానికి పూనుకుంటే దానికి వేలాదిగా అనేక గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ ఊరేగింపులో ఒక్క చోటనే కాకుండా రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ భారీ ఎత్తున నిర్వహించబడినవి. రాష్ట్రవ్యాప్తంగా దావానలంలా వ్యాపించిన ఊరేగింపు కథనాలు ఉద్యమ తీవ్రతను పెంచడమే కాకుండా ప్రజానీకానికి ఎక్కడికక్కడ కదిలేలా ప్రోత్సహించింది.

1919 లో సూర్యాపేట లో జన్మించిన ఆవుల పిచ్చయ్య ఒక పేద కుటుంబానికి చెందిన వాడు. పెద్దగా చదువుకోకపోయినా అప్పటికీ నాటి సమకాలీన పరిస్థితులను అధ్యయనం చేసి తాను కూడా స్వయంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని 1949 వరకు జైలు శిక్ష అనుభవించాడు.

ఒక రచయితగా, కథకునిగా ఆవుల పిచ్చయ్య తాను పరిశీలించిన అంశాలను దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని నాడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఊరేగింపు లను “ఊరేగింపులు “అనే పేరుతో కథ రాసి నేటి తరానికి నాటి అనుభవాలను అందించాడు.

ఆ కథను చదవడం ద్వారా కూడా నాటి సమకాలీన పరిస్థితులు ఎలా ఉండేవి?. దొడ్డి కొమురయ్య అమరత్వం, వీరత్వం, పోరాటం, ప్రతిఘటన మనం, ఈనాటి తరం తెలుసుకోవచ్చు.

అవినీతి అన్యాయం అక్రమార్జన దోపిడీ దౌర్జన్యాలు ఏ కాలంలోనైనా వ్యవస్థలో కొనసాగినప్పుడు పాలకులు ఆ దుర్మార్గానికి పూనుకున్నప్పుడు ప్రజలకు గత్యంతరం లేని పరిస్థితుల్లో పోరాటమే ఏకైక మార్గం. ఈ చారిత్రక సత్యాన్ని 75 సంవత్సరాలకు పూర్వమే నాటితరం అమలు చేసి చూపింది.
మరి నేడు రాష్ట్రంలో దేశంలో ఎన్నో అకృత్యాలు, అసమానతలు ,అంతరాలు, వివక్షత కొనసాగుతున్నప్పటికీ ప్రజానీకం స్పందించకపోవడం, పట్టించుకోకపోవడం బాధాకరం. నాటి ఉద్యమంలో పాల్గొన్న వారిలో చాలా మంది నిరక్షరాస్యులే కేవలం 4 శాతం గా ఉన్నటువంటి అక్షరాస్యత ఆనాడు కొనసాగితే నేడు 75 శాతం అక్షరాస్యత ఉన్నప్పటికీ సమకాలీన పరిస్థితుల పట్ల స్పందించక పోవడం విచారకరం ఆ వైపుగా ప్రజానీకం ఉద్యమ శక్తులు ప్రజాసంఘాలు పక్షాలూ ఆలోచించవలసి ఉంది. అప్పుడే మనము దొడ్డి కొమురయ్య అమరత్వానికి నిజమైన నివాళి అర్పించి నట్లు అవుతుంది.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *