పోరాడి తెచ్చుకున్నతెలంగాణ పాలనలో కొత్తదనమేది?

(వడ్డేపల్లి మల్లేశము)

ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులు ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడం పరిపాలన అనబడుతుంది.

రాచరిక వ్యవస్థలో నైతే వారసత్వంగా సంక్రమించే అధికారంతో గద్దెనెక్కిన రాజులు కూడా ప్రజలనుకన్నబిడ్డలవలె పరిపాలించ వలసినదే.లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురైన దాఖలాలు అనేకంవున్నాయి.

సహజంగా రాజులు పరిపాలించే విధానాన్ని రాచరిక పాలన అని ఎన్నికల ద్వారా నియమితులైనవారు పరిపాలించే విధానాన్ని ప్రజాస్వామిక విధానమని ముద్దు పేర్లతో పిలుస్తున్నాము. అయితే చాలా సందర్భాల్లో రాచరిక పాలన కూడా ప్రజాస్వామిక వ్యవస్థ కంటే ఎంతో మెరుగైన స్థితిలో కొనసాగినట్లు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నవి.

రాచరిక వ్యవస్థలో కొంత నిర్బంధం, నియంతృత్వం, ఏకచ్ఛత్రాధిపత్యం ఉండవచ్చు. కానీ పాలన ప్రజల కోణంలో కొనసాగిన దాఖలాలు అనేకం ఉన్నాయి.

సుపరిపాలన అనేది పాలకుల యొక్క చిత్తశుద్ధిని బట్టి ఆధారపడి ఉంటుంది.

అనేది మనకు కూడా అర్థమవుతున్నది. అసఫ్ జాహీ రాజులు, మొగలాయి చక్రవర్తులు, భారతదేశంలోని ఇతర అనేక సంస్థానాధీశులు కూడా ఆయా ప్రాంతాల ప్రజల యొక్క అవసరాలను గుర్తించి మెరుగైన చర్యలు చేపట్టి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న సందర్భాలు కూడా లేకపోలేదు.

పరిపాలన లో కొత్త కోణం అంటే ఏమిటి?

భారతదేశ పరిపాలనకు సంబంధించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రచించబడిన రాజ్యాంగం చోదకశక్తిగా పని చేస్తున్నప్పటికీ పరిపాలించే పాలకులు కేంద్ర రాష్ట్రాలలో సైతం రాజ్యాంగాన్ని పక్కనబెట్టి తమ సొంత ఎజెండా ను పాటించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి ఇటీవలి కాలంలో. దానివలన స్వతంత్ర భారతదేశం ఎంచుకున్న రాజ్యాంగ విలువలకు భిన్నమైన రీతిలో పరిపాలన అప్పుడప్పుడు గాడి తప్పుతున్న ది.
పరిపాలన అనగానే పెన్షన్లు ఇవ్వడం, రోడ్లు పోయడం, భవనాలు నిర్మించడం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం, ఎన్నికల సందర్భంగా హామీలు ఇవ్వడం, వరాలు కురిపించడం, రాయితీలతో ప్రజలను మభ్య పెట్టే విధానం లో పరిపాలన కొనసాగుతున్నది.

కానీ ప్రజల దైనందిన కీలక సమస్యలైన పేదరిక నిర్మూలన ,ఉపాధి కల్పన, అంతరాలను తొలగించి సమానత్వాన్ని సాధించే దిశగా తీసుకోవలసిన కీలకమైన చర్యలను ప్రభుత్వాలు ఏనాడో మరిచిపోయిన వి. అభివృద్ధి అంటే మానవుని సంపూర్ణ అభివృద్ధి అని” మానవా భివృద్ధి ఏ తగిన నిర్వచనం” అని భారతదేశ ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ చెప్పిన విషయాన్ని 74 ఏళ్ల భారతావని మర్చిపోయింది అనిపిస్తుంది.
ఈ దేశంలో 72 % సంపద కేవలం 1% శాతంగా ఉన్న సంపన్నవర్గాల చేతిలో ఉన్నదంటే మన దేశ పాలకులు ఏ కోణంలో పాలించారు అర్థమవుతుంది. ఇప్పటికి ఇరవై కోట్ల మంది పేదలు దారిద్ర్య రేఖ దిగువన ఉంటే మరో ఇరవై కోట్ల మంది వలస కార్మికులతో ఈ దేశం వెలిగిపోతోందని మురిసి పోదామా?.

అనేకమంది సంపన్న వర్గాల పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, నీరవ్ మోడీ వంటి అనేక మంది భారతదేశ బ్యాంకుల నుండి కోటానుకోట్ల రూపాయలను రుణంగా తీసుకుని ఎగవేసి ఇతర దేశాలలో తల
దాచుకుంటే ప్రభుత్వ నిర్లిప్తతను ఏమందాం.?

తెలంగాణలోని స్థితిగతులు

నీళ్లు ,నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం పేరుతో తెలంగాణ పోరాటం సఫలమై రాష్ట్రం ఆవిర్భవించినప్పటికి పరిపాలన చేపట్టక ముందు ప్రపంచము నివ్వెరపోయే స్థాయిలో పాలన అందిస్తామని హామీ ఇచ్చిన నాయకులు సాంప్రదాయ పద్ధతిలో పాలన కొనసాగించడమే కాక ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి నారు. యదేచ్చగా ప్రకృతి విధ్వంసం కొనసాగుతూనే ఉన్నది.

తెలంగాణ సాధన కోసం అమరులైన 1200 కుటుంబాలను పట్టించుకోక పోవడమే గాక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా విమర్శించి దాడి చేసిన వారే నేడు పాలకులుగా కొనసాగడం హాస్యాస్పదం. పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాలను లేకుండా చేస్తుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్న ది. శాసన సభ్యులు, మంత్రుల భూ ఆక్రమణ ,అక్రమార్జనకు అంతే లేకుండా పోతే రైతుబంధు పేరున కష్టించే రైతులకు కాకుండా భూస్వాముల జేబులు నింపడానికి రైతుబంధు అమలు చేయడం విడ్డూరం.
కానీ ప్రజలు తమకు ఉపాధి కల్పించమని, వేతనాలు పెంచమని, ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులు ఉండాలని, భూమిలేని పేదలకు భూములు పంచాలని, క్షేత్రస్థాయిలో పనిచేసే రైతన్నలకు ఆర్థిక సాయం పెట్టుబడి సాయం అందాలని తమ పిల్లలకు ఉద్యోగ కల్పన చేయాలని మెరుగైన జీవన పరిస్థితులు కావాలని కోరుకుంటున్నారు. కానీ వీటిని ప్రభుత్వాలు పట్టించుకోకపోగా ఎన్నికలు వస్తేనే వాగ్దానాలు, ఎన్నికలంటేనే నిధులు, ఎన్నికల వస్తేనే పనులు మంజూరు చేసే విధానము అమలవుతున్నది.

రాష్ట్రంలో ఒకటి రెండు జిల్లాలకు మాత్రమే అధిక ప్రాధాన్యతనిస్తూ మిగతా జిల్లాల ను చూసి చూడనట్లు ఉంటే సమతుల్యత ఎలా సాధ్యమవుతుంది.?
ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రజావ్యతిరేక విధానాలను తీసుకుంటున్న సందర్భంలో అక్రమాలకు పాల్పడడమే కాకుండా ప్రభుత్వ ఆస్తిపాస్తులను భూములను తాకట్టు పెట్టడం తో రాబోయే తరాలకు భూములు లేకుండా పోయే ప్రమాదం ఉన్నది.

వృధాను అరికట్టి, అనవసరపు నిర్మాణాలు పెట్టుబడుల జోలికి పోకుండా,
ప్రజల ఆదాయాన్ని ప్రభుత్వ ఆస్తులను పెంచుతూ భావితరాలకు అందించే విధంగా నిర్మాణాత్మకమైన టువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అంతిమంగా ప్రణాళికాబద్ధంగా కొనసాగే ఈ పాలనసమసమాజం వైపు దారి తీయాలి. అప్పుడు మాత్రమే ప్రపంచము నివ్వెరపోయే పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నట్టు లెక్క.

గత ఏడెనిమిది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎన్నికలు అంటే మద్యం, డబ్బు అనే అలవాటు పడిన ప్రజానీకం అలవాటు చేసినటువంటి రాజకీయ పక్షాలు తమ ఎన్నికల అసలు సరలిని మార్చుకున్నప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది.

ఆ వైపుగా ఎన్నికల సంఘాలు రాజకీయ పార్టీల మీద కఠినమైన చర్యలు తీసుకొని అవసరమైతే నిబంధనలు ఉల్లంఘించిన వారిని జైలుకు పంపే విధంగా ఆదేశాలను జారీ చేయాలి. గతంలో టిఎన్ శేషన్ గారు కేంద్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న కాలంలో ప్రస్తుతం ఉన్న చట్టాల తోనే కొన్ని మార్పులను తీసుకు వచ్చిన అనుభవం మనకు ఉండనే ఉన్నది.
ప్రజల కోణంలో ఆలోచించే సుపరిపాలన యే పాలనలో కొత్త కోణం.

ఆ కొత్త కోణాన్ని అందుకొని పాలకులు ముందుకెళ్లాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *