శతవసంతాలు పూర్తి చేసుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ

(యమ్. జయలక్ష్మి)

చైనా కమ్యూనిస్టు పార్టీ త‌న‌ శతజయంతిని జూలై 1న జరుపుకుంటున్నది. ఆ పార్టీ వందేళ్ళ చరిత్రలో  జూన్ 24, 1989న ఒక ముఖ్య ఘట్టం జ‌రిగింది. సోషలిస్టు చైనా నిలదొక్కుకోటానికి పునరంకితమైన రోజది.

సోవియట్ యూనియన్లో 1990లో ఏక పార్టీ పాలన అంత‌మైంది. సోవియ‌ట్‌యూనియ‌న్‌ 1991 డిసెంబరులో రద్దయి పోయింది. జర్మనీ బెర్లిన్ గోడ‌ను 1989 నవంబరులో  పడగొట్టారు. ఆ రోజుల్లోనే పోలెండ్, హంగరీ, తూర్పు జర్మనీ, జెకోస్లవేకియా, యుగోస్లావియా తదితర దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు పతనమయ్యాయి.చైనాలోనూ అదే జరగాలన్న అమెరికా, యూరపుదేశాల కుట్రలు, ఆశలు బైటపడినా, నేటికీ అది జరగలేదు.

తూర్పు యూరపులో, రష్యాలో లాగే చైనా ప్రభుత్వం, చైనా పార్టీ పతనమవుతాయని సామ్రాజ్యవాదులు కన్న కలలు వమ్మయేట్టు చర్యలు తీసుకొన్న రోజు.

హాంకాంగ్ చైనాలో విలీనం 1997లో పూర్తయినా,  దానిపై 1984లోనే మొదలైన చర్చల్లో చైనా పైచేయి సాధించింది.

అయితే, పెట్టుబడిదారీ విధానాన్ని అనుమతిస్తామన్న చైనాకి సామ్రాజ్యవాదులతో (బ్రిటన్ తో) ఘర్షణవాతావరణం ఏర్పడింది.

తియనన్మెన్ సంఘటనల (1989 జూన్) పై  పునరావృత‌మైన కుట్రలు. ఇరాక్ లో మారణాయుధాలు వున్నాయని అమెరికా లక్షలాది మందిని యుద్ధంలో చంపింది. ఆతర్వాత మారణాయుధాలు కట్టుకథే అని బట్టబయలయింది.

విమానాల్లో వచ్చి బాంబు దాడులు జరిపి ల‌క్ష‌లాదిమంది సాధారణ పౌరుల ప్రాణాలను బలిగొన్న అమెరికా, నాటోశక్తుల బండారాన్ని గత 30ఏళ్ళలో  ప్రపంచమంతా (గల్ఫ్ యుద్ధం నుంచి ఇరాక్,సిరియా, ఆఫ్ఘనిస్తాన్ మొ,, చోట్ల) వీక్షించింది.

picture credit : The Economist

అలాంటి శక్తులే తియన్మెన్ లో మారణకాండ అంటూ గ‌గ్గోలు పెడుతూ వచ్చారు. నాటి విద్యార్ధినేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత లియు కీ బావో (1955-2017 )  గురించి తెలుసుకొంటే చాల విషయాలు బోధ పడతాయి.

ఆయన బుష్ ట్రంప్ ఇజ్రాయెల్ సాగించిన అన్ని యుద్ధాలను, గతంలో కొరియా వియత్నాం యుద్ధాలను గట్టిగా బలపరిచిన ‘శాంతి ప్రియుడు’, ‘ప్రజాస్వామ్యవాది’.

తనకు గిట్టని ప్రభుత్వాలు వున్న చోట వాటిని కూలదోసే అమెరికా దౌర్జన్యకర పద్ధతులను (regime change policies) లియు బాహాటంగా సమర్థించాడు.

చైనా 300 ఏళ్ళైనా వలసగా ఉంటేగాని బాగుపడదని, అక్కడ భూమిని పరిశ్రమలను అన్నిటిని పూర్తిగా ప్రయివేటు పరం చేయాలనీ కోరాడు (న్యూయార్క్టై మ్స్ 13-7-2017, గార్డియన్ 15-12-2010).

నాటి విద్యార్థి ఉద్యమ నాయకత్వం , దాని వెనుక ఉన్న శక్తుల స్వభావం ఇది. “సంపూర్ణ పాశ్చాత్యీకరణ” ని, అమెరికా “స్టాట్యూ ఆఫ్ లిబర్టీ” నమూనాని కొంద‌రు తలకెత్తుకున్నారు.

పాశ్చాత్య దేశాల‌లో కూడా  కొందరు పేర్కొన్న‌ వాస్తవం అది. ఆపాదించిన, కల్పించిన విషయం కాదు.

చైనాపార్టీ చెప్పినది నిజమని లియుచరిత్ర, యుద్ధకాముకుడైన అతనికి నోబెల్ ‘శాంతి’ బహుమతి ఇవ్వటము ధృవపరుస్తున్నది. సామ్రాజ్యవాదకుట్రల నుంచి “ఎర్ర జన్యువు”ల్ని కాపాడుకోవటానికి అవసరమైన “శస్త్రచికిత్సకు”

చైనా పార్టీ పూనుకున్నది. ఏమాత్రం శ‌ష‌బిష‌లు లేకుండా దాన్ని ప్ర‌క‌టించింది కూడా. అది సామ్రాజ్యవాదులకే కాక మరి కొందరికి రుచించదు. ఈ విషయంలో చరిత్రని, కుట్రలను, వాస్తవాల ఆధారంగా అర్థం చేసుకోవటం అవసరం. ప్రత్యక్ష సాక్షి విజయ గోఖలే పుస్తకం, వాస్తవాలు

“నిరాయుధులైన విద్యార్థుల మీద సైన్యం, యుద్ధ ట్యాంకులతో చేసిన నరమేధం ఇదిష .అంటూ  సామ్రాజ్యవాదుల తప్పుడు ప్రచారం, కట్టు కథ.  ఆ విషయాన్ని తర్వాతి కాలంలో వారి ఏజెన్సీలు కూడా కొంతైనా అంగీకరించాయి. వాస్తవాలను చూడకుండా పాశ్చాత్య మీడియా స్పూన్ ఫీడింగుతో నడిచే ప్రజాస్వామ్యం మనది.

చైనావ్యతిరేక దుమారాన్ని తిరిగి ప్రోత్సహిస్తున్న నేటి బైడెన్ యుగంలో నాటి చరిత్రని “తిరగరాసిన” పుస్తకం. ఇది : “తియన్మెన్ స్క్వేర్: ద మేకింగ్ ఆఫ్ ఏ ప్రొటెస్ట్ – ఏ డిప్లొమాట్ లుక్స్ బాక్”

ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు చైనాలో ఇండియా దౌత్యవేత్తగా ఉన్న‌ చైనా నిపుణుడు, ప్రత్యక్ష సాక్షి విజయ గోఖలే రాసిన‌ పుస్తకం ఇది. ఈ ఏడాది మేనెలలో విడుదలైనది. (399రూ.హార్పర్ కాలిన్స్. 181పేజీలు). దౌత్యప్రపంచంలో సంచలనం.

“ఆ 50రోజుల ఘటనలను స్వంత అనుభవంతో చూశాను. నిజంగా ఏం జరుగుతున్నది అని పరిశీలించకుండా, ఒకరి కథనాల ఆధారంగా మరొకరు వార్తలను వండి వడ్డించారు. చైనా విద్యార్థుల్లో కొందరు కూడా అందులో భాగమయ్యారు. వారు చెప్పినవి పూర్తి వాస్తవాలు కావు. ప్రశ్నించదగినవి, నాకు స్వయంగా తెల్సిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అవన్నీ నా కళ్ళు తెరిపించాయి. ఈమొత్తాన్ని పాశ్చాత్య మీడియా తమదైన రీతితో వక్రీకరించింది. అందుకే వీటిని బైటపెట్టాల్సిన అవసరముంది అని భావించాను ” అని, ఆతర్వాత భారత విదేశాంగశాఖ కార్యదర్శి అయిన గోఖలే రాశారు.

తర్వాత అదే పదవిని అలంకరించిన శ్యాంశరణ్, శివశంకరమీనన్ వంటివారు ప్రశంసించారు. ‘ ఎంతోకాలంగా బైటపెట్టాలనుకున్న విషయాలివి. కానీ “నేనున్న పరిస్థితులలో” కుదరలేదు’ అని గోఖలే రాశారు.  అమెరికాలో వాక్ స్వతంత్రం ఉందికాని, చిక్కేమిటంటే రాజకీయాల్లో దాని ప్రయోజనం కన్నా ప్రమాదం జాస్తి.

ట్రంప్ తన నాలుగేళ్ల పాలనలో 25,000  బుకాయింపులు చేశారని వాషింగ్టన్ పోస్టు ఇటీవల రాసింది. పదుల లక్షల పౌరుల మరణానికి దారితీసిన ఇరాక్ యుద్ధానికి (2001-2003) సంబంధించి 950 అబద్ధాలు బుష్ ప్రభుత్వం చెప్పినదని కూడా అక్కడివారు లెక్కకట్టారు.

1950 నుంచి నేటి వరకు నాలుగు కోట్ల మంది ఆసియన్లు అమెరికా కుట్రలు, యుద్ధం మొదలైన వాటి ఫలితంగా మరణించారని అంచనా .

అయినా వారి ‘మానవ హక్కుల’ ప్రవచనాలు కోట్లాది మందిని; మన లెఫ్టిస్టులను కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.  ప్రపంచ మీడియాని వారు శాసిస్తున్న దాని ఫలితమే ఇది.

‘చైనాతరహా సోషలిజం – సైద్ధాంతిక, రాజకీయ నేపథ్యం జూన్ 4, 1989 విద్యార్థి తిరుగుబాటుస‌ పై ప్రధాని, పోలిట్ బ్యూరో సభ్యుడు లీపెంగ్ నివేదికను జూన్ 24న చర్చించి ఆమోదించారు.

జూన్ 19-21 పొలిట్ బ్యూరో, జూన్ 23-24 కేంద్రకమిటీ సమావేశాల్లో, చర్చించి, ఈ విషయాల్లో తప్పులుచేసిన ప్రధానకార్యదర్శి జావో జియాంగ్ ని అన్ని పదవులనుంచీ “డిస్ మిస్” చేశారు.

జియాంగ్ జెమిన్ ని ఎన్నుకున్నారు. చైనాలో సంస్కరణలక్రమంలో “బూర్జువా లిబరలైజేషన్”ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడివుండాల్సిన నాలుగు మౌలిక సూత్రాలను పునరుద్ఘాటించారు.

అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంతృత్వం, మార్కిస్టు లెనినిస్టు మావో సిద్ధాంత నేతృత్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం.

ఈ నాలుగు మౌలిక సూత్రాలను కాదనేవారు కొందరు పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలపైనా, ఆఫీసులపైనా దాడులను ఆర్గనైజు చేసారని, ప్రజా చైనా, పార్టీల భవితవ్యాన్ని దెబ్బ తీయటానికి, సామ్రాజ్యవాదుల ప్రోత్సాహంతో జరిగిన తిరుగుబాటు స్వభావాన్ని అర్థంచేసుకోకుండా, దాన్ని బలపరిచి, తీవ్రమైన తప్పుని జావో జియాంగ్ తోపాటు మరి కొద్దిమంది చేసారని వివరించారు.

చైనాలో ఆర్థిక సంస్కరణలలో భాగంగా మార్కెట్ వ్యవస్థను దేశ, విదేశీ పెట్టుబడిదారులను అనుమతించారు.

ప్రపంచ సాగుభూములలో 7% మాత్రమేకల వెనుకబడిన చైనా 22% ప్రపంచ జనాభాని పోషించి, ‘వీలైనంత త్వరగా వారికి ఉపాధి’ లక్ష్యంతో అత్యవసరమైన ఈ సంస్కరణల కీలక నిర్ణయం తీసుకున్నామని డెంగ్’ అనేకసార్లు వివరించారు.

అయితే నాలుగు మౌలిక సూత్రాల చట్రానికి, పార్టీ నియంత్రణకు లోబడి మాత్రమే జరగాలని, “బూర్జువా లిబరలైజేషన్” పెచ్చరిల్లకుండా జాగ్రత్త తీసుకోవాలని , ‘చైనా తరహా సోషలిజం’ నిర్మించాలని ఆయన నొక్కి చెప్పారు.

ఇంట్లోకి ఈగలు,దోమలు వస్తాయని ఎల్లకాలం కిటికీలు తలుపులు మూసుకుని, కూర్చోలేం కదా! అవి వస్తాయి ఆ చిక్కులని ఎదుర్కొవాలి అని తొలిదశలోనే వివరించారు.

జీవన ప్రమాణాలతో పాటు చెడు లక్షణాలు, విలాసాలు అంతరాలు ప్రవేశిస్తాయన్న అంచనా తోనే,  రిస్కు తీసుకోవాలనుకున్నారు.

మరో 20 ఏళ్ళ తరువాత అలాంటి వైరుధ్యాలను పరిష్కరించుకోవాల్సి వస్తుందని 1980 తొలిదశలోనే ‘డెంగ్’ రచనలలోనే పేర్కొన్నారు.

ఈ క్రమంలో బూర్జువా లిబరలైజేషన్ కీ నాలుగు మౌలిక సూత్రాల‌కి మద్య సంఘర్షణ అనివార్యం అన్నారు..

సాంస్కృతిక విప్లవం పేరిట సాగిన అతివాదానికి వ్యతిరేకంగా మావోకాలంలోనే ప్రారంభమైన పోరాటం తర్వాత డెంగ్ నాయకత్వంలో కొనసాగింది.

ఆక్రమంలో సంస్కరణలు, “ప్రజాస్వామ్యం” పేరిట పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాలను అనుసరించే లిబరలైజేషన్ ధోరణి ఒకటి యువకుల్లోనే కాక పార్టీలో, నాయకత్వంలో సైతం తలఎత్తిందని;

అది పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టటమేనని, మన సోషేలిస్టు ఆదర్శాన్ని, క్రమశిక్షణని విస్మరించరాదని; చాలా ముందే డెంగ్ నొక్కి చెప్పారు.

విప్లవ ప్ర‌తీఘాతుకత్వానికి, అమెరికా నమూనా పాలనా వ్యవస్థకి కూడా చైనాలో స్థానం లేదు.

అమెరికా విధ్యార్ధులు తిరగబాటు చేస్తే, వారిని సాయుధ బలగాలతో అణచివేయలేదా? ప్రజల,విధ్యార్ధుల రక్తం చిందించలేదా? మనని విమర్శించటానికి వారికి గల అర్హతేమిటి? అని డెంగ్ ప్రశ్నించారు.

గత కృషిలో ఒక ముఖ్యమైనలోపం ప్రజల్లో పొలిటికల్ ఎడ్యుకేషను నిర్వహించకపోవటం అని, ఆవిషయాన్ని కొందరు విదేశీ మిత్రులకు కూడా చెప్పాను- అని డెంగ్ వివరించారు. (1989 జూన్ 9 ) .

కొద్దిమంది మేధావులు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, వారి అసలు లక్ష్యం సోషలిజాన్ని వ్యతిరేకించడమేనని ; బూర్జువాలిబరలైజేషన్ ని “కనీసం” మరో 20ఏళ్ళపాటు వ్యతిరేకించాలని, పాశ్చాత్య పద్ధతులను కాపీ కొట్టరాదని డెంగ్ పలుసార్లు స్పష్టం చేశారు.

‘ప్రజాస్వామ్యం పేరిట మీ పద్ధతులను కాపీ కొట్టటం” మాకు మంచిది కాదని ఆయన మాజీ అధ్యక్షుడు కార్టర్ కీ (29-6-1987), అధ్యక్షుడు బుష్ కీ (1989ఫిబ్రవరి26) స్వయంగా చెప్పారు.

యువతరంలో, విద్యార్థుల్లో అవగాహనాలోపం, అలజడులగురించీ డెంగ్ ప్రస్తావించారు.

విద్యార్థుల అలజడి పరిసమాప్తి తర్వాత మిలటరీ అధికారులతో డెంగ్ సమావేశమై మాట్లాడారు (1989 జూన్ 9).

కొద్దిమంది విచ్చిన్న కారులు విద్యార్థుల్లో కలిసిపోయి, రెచ్చ గొట్టారని, వారి అసలు లక్ష్యం పార్టీని, సోషలిస్టూ వ్యవస్థనీ కూలగొట్టటం అనీ; ఇది ప్రజాస్వామ్యం-అవినీతి వ్యతిరేక పోరాటాల సమస్య కాదని; కొద్దిమంది నాయకులు ఈ కీలక విషయాలను అర్థంచేసుకోలేదని డెంగ్ వారికి వివరించారు.

ఈ క్రమంలో చాలామంది కామ్రేడ్స్ గాయపడ్డారు, చనిపోయారు కూడా అని శ్రద్ధాంజలి ఘటించారు.

కుట్రలు, వాస్తవాలు

చైనావిప్లవం, మావో విజయాలను అనుభవించడమేతప్ప, గతకాలపు అగచాట్ల, పోరాటాల లోతు తెలియని యువతరంవారి ఆందోళన తియన్మెన్ స్క్వేర్ సంఘటనలు.

పాశ్చాత్య పెట్టుబడిదారీ విధానపు బూర్జువా ప్రజాస్వామ్యం బండారం తెలియని విద్యార్థులు వారు. 1970 తర్వాత అమెరికాతో ప్రభుత్వ పరంగా సంబంధాలు ఏర్పడి, ఇరుదేశాలూ హలో హలో అని పలకరించుకుంటున్న వాతావరణం.

ఆతర్వాత పుట్టి పెరిగిన విద్యార్థితరంలో పాశ్చాత్య దేశాల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృ త్వంల గురించిన పైపై అవగాహనే వుంది.

జూన్ 4, 1989 విద్యార్థి తిరుగుబాటు: 

వాయిస్ ఆఫ్ అమెరికా, తైవాన్, హాంకాంగ్ ల విలేకరులు, కొన్ని యూరపు వార్తా సంస్థలు, చైనాకి చెందిన కొందరు రౌడీలు, విచ్చిన్న కారులు కూడబలుక్కొని అబద్ధాలు అర్ధసత్యాలు, పుకార్లని సృష్టించి వ్యాప్తి చేశారు.

ఏప్రిల్ మధ్య నుంచి 60రోజులపాటు ప్రధానంగా VOA కట్టుకథలని, అర్ధసత్యాలని రిపోర్టుచేసింది.  పరస్పర వైరుధ్యాలతో కొన్ని ఆనాడే బైటపడిపోయినాయి.

“100మంది ఆర్మీజనరల్స్, ఇతరులు” మార్షల్ లా విధింపుని వ్యతిరేకించారన్నది అలాంటి కట్టుకథల్లో (మే23)ఒకటి. కోటిమందిదాకా “స్క్వేర్ లో ప్రదర్శనలో పాల్గొన్నారని మరొకవార్త!

ఆనాడు బీజింగ్ నగరం జనాభా అంతా ఆ స్క్వేర్ లో వున్నారన్న మాట!  “అంతర్యుద్ధం” జరిగే పరిస్థితి ఉందని మరో కట్టుకథ (జూన్ 6).

1989జూన్ 4 నాడు “తియనన్మెన్ స్క్వేర్ లో పదివేలమంది విద్యార్థులను సైన్యం కాల్చి చంపింది” అని ఒక విషప్రచారంతో అమెరికా, పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు తమ కుట్రను కప్పిపెట్టుకో చూశారు.

కాగా చైనాపార్టీ నాడు చెప్పినదే మౌలికంగా సరైనదని చెప్పకనే చెప్పిన ఒక పుస్తకం (గోఖలే) ఇటీవల విడుదలైంది.


ఇవి కూడా చదవండి

*తియనన్మెన్ స్క్వేర్ సంఘటన: చరిత్ర “తిరగరాసిన” పుస్తకం

*చైనా మనకు శాశ్వత శతృవా?

*సరిహద్దు సమస్య ఉన్నా ఇండియా చైనా ల మధ్య స్నేహం సాధ్యమే


ఈ ఘర్షణల్లో ఎంతమంది చనిపోయారు? దీనికి సమాధానం 10,000, 20,000, 1400,1500, 3000 అని ఆయా వార్తాసంస్థలని బట్టి, వేర్వేరు రోజుల్లో వారివారి వార్తలనుబట్టి చాలా మారిపోతూ వచ్చింది.

“20వేలమంది” చనిపోయారని ఒక పుకార్లరాయుడు (క్సియావో బిన్) చెప్పటాన్ని చైనా టీవీలో (CCTV) చూపించారు.

ఏమిటిది? అని అడిగితే “VOA రిపోర్టుచేసింది” అని చెప్పాడు. చైనా మీడియా ఇటువంటి కట్టుకథలని నిర్దిష్టంగా వెల్లడించింది. నిరాయుధులైన విద్యార్థుల శాంతియుత ఉద్యమంగా ఏప్రిల్ మధ్యలో మొదలైనమాట నిజమే.

అందుకే మే18న పోలిట్ బ్యూరో నిర్ణయంతో, మే 20నగానీ మార్షల్ లా ప్రకటించలేదు. ఆతర్వాతే సైన్యప్రవేశం, కానీ సైన్యాన్ని నగరం వెలుపలే ఉంచారు.

మే 15-16న రష్యానేత గోర్బచేవ్ పర్యటన సందర్భంగా స్క్వేర్ లో కార్యక్రమాలకోసం మైదానాన్ని ఖాళీ చేయాలా అని చర్చించారు.కానీ చేయలేదు.

జూన్ 3 రాత్రిదాకా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. అయితే విద్యార్థుల చాటున, విదేశీ సహాయ ప్రోత్సాహాలతో కొందరు అల్లరిమూకలు చెలరేగి పోయారు; ఆత్మాహుతి దళాలు ఏర్పాటైనాయి. పోటీ ప్రభుత్వ ఏర్పాటును తలపెట్టారు, ప్రకటించారు కూడా.

జూన్ 4 తెల్లవారేసరికి “కొన్ని వందల” మిలటరీ వాహనాలు “డజన్ల కొద్దీ” జంక్షన్ల వద్ద తగులబడుతూ కన్పించాయి. జూన్ 3 అర్ధరాత్రి తర్వాత మిలటరీ స్క్వేర్ వైపు వెళ్తుండగా అల్లరిమూకలు అడ్డగించారు; రోడ్ బ్లాక్స్ పెట్టారు;సైనికులపై దాడిచేసికొట్టారు.బట్టలూడదీసేసారు.టైర్లు కోసేసారు; కొన్ని వాహానాలు తల్లకిందులుచేసి పడేశారు.

4వ తేదీ ఉదయం 7 గంట‌ల‌కు కూడా కొన్ని చోట్ల ఇలా దాడులు జరిగాయి. గాయపడిన సైనికులను అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే, అడ్డగించి టైర్లలో గాలితీసేశారు.  కొన్ని చోట్ల ఆయుధాలను లాక్కున్నారు.  పార్టీ, ప్రభుత్వ, మీడియా ఆఫీసులపై దాడులు చేసారు. సిబ్బందిపై కొన్ని చోట్ల కాల్పులు జరిపారు.

కొందరు అల్లరిమూకలు కత్తులు, ఇనపరాడ్లు, ఇటుకలు, సీసాలు, చెయిన్లు,సూదిగా చెక్కిన వెదురుకర్రలు పంపిణీ చేసారు.’సాయిదులై ప్రభుత్వాన్ని కూలదోయండి” అని మైకులో చెప్పారు. బస్సులు, ట్రాములను కొన్ని చోట్ల చెట్లని తగులబెట్టారు, ద్వంసం చేసారు.

మొత్తం అనేకచోట్ల ఘటనల్లో సుమారు 300మంది చనిపోయారని, అందులో సైనిక, పోలీసు, ప్రభుత్వ అధికారులు, అల్లరిమూకలు, పొరపాటున గురైన 23మంది విద్యార్థులు వున్నారని తొలిదశ రిపోర్టులో ప్రధాని, లీపింగ్ ప్రకటించారు.

సైనిక పోలీసుల సజీవదహనం కూడా జరిగింది. ఎంతో నిగ్రహంతో వ్యవహరించటంవల్ల అది అనివార్యమైంది. ఎక్కడెక్కడ ఏంజరిగిందో సవివరంగా, నిర్దిష్టంగా బీజింగు నగర అధికారులు (జూన్ 14 జిన్హువా ) ఒక నివేదికని విడుదలచేసారు.

వాటి ఫోటోలు, వీడియో క్లిప్పులు, తప్పుడు కథనాల స్క్రీన్ షాట్లు అనేకం నేటికీ పరిశీలనకు అందుబాటులో వున్నాయి. ‘ప్రజాసైన్యం” అన్న మాట నిలబెట్టుకున్నది; పరీక్షలో నెగ్గింది. జూన్ 3 రాత్రి స్క్వేర్ లో ఆందోళనకారులను తొలగించేక్రమంలో కాల్పులూ చావులూ లేవని ప్రకటించారు.  జూన్ 3 అర్ధరాత్రి 1.30కి సైన్యం స్క్వేర్ లోకి ప్రవేశించింది.

అప్పటికే విప్లవ ప్రతీఘాతక దాడులు జరిగాయని, ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తున్నారని సోషేలిస్టు రాజ్య పరిరక్షణకై వీటిని తిప్పికొట్టబోతున్నాం అని, ఎవ్వరూ అడ్డురావద్దనీ 3గంటల సేపు ప్రకటనలు చేసారు.

తెల్లవారుజాము 3గంటలకు తాము వెళ్ళిపోతున్నామని ఆందోళనకారుల ప్రతినిధి సైన్యానికి తెలియజేశారు. దాన్ని అధికారులు స్వాగతించారు. ఆ మేరకు 4.30కి ప్రకటించి, దారిచ్చారు.

తొంభై శాతం జనం క్రమపద్ధతిలో లైనుకట్టి 5 గంటలకల్లా స్క్వేర్ ని వదిలి వెళ్ళిపోయరు. మిగిలిన కొద్దిమందిని 5.30కి పోలీసులు పంపించివేశారు. ఉదయం 6గం. ల లోపు అంతా ఖాళీ అయిపోయింది;

ఈ క్రమంలో స్క్వేర్ లో ఎవ్వరూ చనిపోలేదు ( సిన్హువా కధనం 15.6.1989 ). నిజమే ‘అక్కడ స్క్వేర్ లో అలాంటి ఆధారాలేవీ లేవ’ని వాషింగ్టన్ పోస్టు, సిబిఎస్ విలేకరులు, “అక్కడ ఎలాటి ఊచకోతనీ చూడలేద”ని సంఘీభావంగా జనం మధ్యేవున్న తైవాన్ విలేకరి, “అక్కడ” రక్తపాతం జరుగలేదని 2011లో అమెరికా రాయబార కార్యాలయం పంపిన రహస్య కేబుల్స్ చెప్పాయి.

కాగా చైనాపార్టీ నాడు చెప్పినదే మౌలికంగా సరైనదని చెప్పకనే చెప్పిన ఒక పుస్తకం ఇటీవల విడుదలైంది. కాగా పుకార్లని ఉటంకిస్తూ, VOA, ఇతర మీడియా ‘స్క్వేర్ లో రక్తపాతం’ అంటూ వార్తలు వండి వడ్డించింది.

వీటన్నిటిని ఖండిస్తూ ప్రత్యక్ష సాక్షుల వాస్తవకధనాలతో ఇంటర్యూల వీడియో క్లిప్పుల ద్వారా చైనా మీడియా పదేపదే ప్రసారం చేసింది.

ప్రత్యక్ష సాక్షులేకాక అక్కడ ఉన్న తైవాన్ విలేఖరి కూడా తెలియజేశారు. అయినా కట్టుకథ‌లను రెండు, మూడు వారాలపాటు కొనసాగించారు. తప్పుడు సమాచారంతో దొరికిపోయాక చాలా ఆలస్యంగా కొన్ని సార్లు ‘ విచారం ‘ వ్యక్తం చేసింది.

కమ్యూనిస్టు దేశాలను, పార్టీలను కూలదోసి ” పాశ్చాత్య బూర్జువా ప్రజాస్వామ్య” వ్యవస్థలను స్థాపించే సామ్రాజ్యవాదుల అంతర్జాతీయ కుట్రలో భాగంగా విధ్యార్ధుల తిరుగుబాటుని వాడుకున్నారు.

నేటి అంతర్జాతీయ దేశీ వైరుధ్యాలలో ఇలాంటి సంఘటనలు ఏదో ఒకనాడు జరగటం తప్పదు అన్న అంచనా మాకుంది అని డెంగ్ చెప్పారు ( జూన్ 9,1989 ). ఆ సంఘటనలకు ముందూ,తర్వాత ఏడాదిలో దాదాపు 10 ( తూర్పు, మధ్య యూరపు ) దేశాల్లో పరిణామాలే దానికి తిరుగులేని సాక్ష్యం,  ఆ ప్రయత్నాలను చైనా చిత్తుచేసింది.

సామ్రాజ్యవాదులకు సవాలుగా నేటికి నిలబడి. పేదదేశాలకు సహయ సహకారాలందిస్తున్నది. పైన పేర్కొన్న దాడులని ఆర్గనైజు చేసిన అనేకమందిని జూన్ 3 నుంచి 14 మధ్యలో అరెస్టు చేసారు. వారిలో అత్యధికులు లంపెన్ లు, రౌడీలే కానీ విధ్యార్ధులు కాదు.  విదేశాలతో సంబంధాలున్న శక్తులను, వారి దుశ్చర్యలను చైనా టీవిలో చూపించారు.

పాశ్చాత్య మీడియాలో ప్రసారమైన అనేక వీడియోల్లో కూడా వారి దౌర్జన్యాలు కన్పడ్డాయని చైనా ఎత్తిచూపింది.  VOA బీజింగ్ చీఫ్ అలాన్ పెస్సిన్ తమ తప్పులను కొన్నింటిని అంగీకరించారని పాశ్చాత్య మీడియా ( ఉదా:UPI ) తర్వాత కాలంలో ప్రసారంచేసింది.  ( ఈ మీడియా కట్టుకధలను గురించి జిన్హువా 21.6.1989 ) ప్రత్యేక కథనాలు ప్రచురించింది.) విప్లవానుభవంగల పాతతరం నాయకత్వం దృఢంగా వ్యవహరించడంవల్ల అది సాధ్యమైంది.

నేటి దేశ,విదేశ పరిస్థితుల్లో ఎప్పుడో ఒకప్పుడు ఇది జరుగవలసివున్న ఘటనే అని డెంగ్ ఆరోజుల్లో వివరించారు. అదే స్ఫూర్తితో చైనాలో ‘ఎర్రజన్యువు’ని కాపాడుకోవాలని నేటి నేత జిన్ పింగ్ పిలుపునిచ్చారు.

చైనాపార్టీ వందేళ్ళ పండుగ సందర్భంగా చైనా ప్రజలు దానికి కంకణం కట్టుకున్నారు. అమెరికా సామ్రాజ్యవాదులకు వారి అనుచరులకు, వారి మీడియాకు ఇది రుచించదు. అందుకే చైనావ్యతిరేక దుష్పచారాన్ని ముమ్మరం చేశారు. భారతీయ మీడియాలో వారి కట్టుకథలే ప్రతిధ్వనిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త!

(యమ్. జయలక్ష్మి, విశ్రాంత బ్యాంకు అధికారిణి Email: jayalaxmim55@gmail.com)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *