సరిహద్దు సమస్య ఉన్నా ఇండియా చైనా ల మధ్య స్నేహం సాధ్యమే: డాక్టర్ జతిన్ కుమార్

(డాక్టర్ జతిన్ కుమార్)
భారత్ చైనా దేశాలు హిమాలయ పర్వతాలకు అటు ఇటు విస్తరించి ఉన్నాయి. హిమాలయ పర్వత శ్రేణులు ఇద్దరిని  ముడి వేస్తున్నాయని కొందరు భావిస్తే రెండు దేశాల మధ్య అవి గోడలని మరి కొందరు భావిస్తున్నారు.
ఏమైనా ఎత్తైన పర్వతాలను మించిన అనేక అంశాలు ఈ రెండు దేశాల మధ్య ప్రజల మధ్య లోతైన అవగాహన లేకుండా చేస్తున్నాయి .
1947 లో భారతదేశం 1949 లో చైనా చరిత్రాత్మకమైన మలుపులతో కొత్త ప్రస్థానం మొదలు పెట్టాయి.
1950లో దౌత్యసంబంధాలు ఏర్పరచుకున్నాయి. వాటి ప్రాతిపదికగా తమ సంబంధాలు నెలకొల్పు కోవాలని అభివృద్ధి పరుచుకోవాలని కాంక్షించినా, సరిహద్దుల విషయంలో ఇద్దరికీ వేరువేరు అవగాహనలు ఉన్నాయి.
సరిహద్దులనేవి సంపూర్ణంగా వివాదరహితంగా నిర్ధారించబడలేదు. ప్రధానంగా ఇండియా తమ పూర్వ వలసవాద ప్రభువుల వాదననే కొనసాగించటం వల్లా,  అంతేకాకుండా ఏకపక్షంగా సరిహద్దులను తనకు తానే నిర్ధారించుకొని సైనిక శిబిరాలు ఏర్పాటు చేయటం వల్ల, ఆభూగాలను తన ఆధీనంలోకి తెచ్చుకునే సైనిక చర్యలకు దిగడంతో 62 లో భారత చైనాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరిగింది.
చైనా భారత దళాలను ఓడించి గట్టి ఎదురు దెబ్బ తీసింది. రెండు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది జరిగిన దశాబ్దాల తర్వాత  చిన్న మార్పులు చేసుకుని రెండు దేశాల అభివృద్ధి క్రమంలో పయనిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 90 నుంచి క్రమక్రమంగా రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి పుంజుకున్నాయి.
సరిహద్దుసమస్యలు  పరిష్కారం కాకున్న సత్సంబంధాలు నెలకొన్నాయి. అవి  శీఘ్ర గతిన అభివృద్ధి చెందుతూ వచ్చాయి వాస్తవంగా తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను స్థిరీకరించుకుని శాంతియుతంగా సహజీవనం చేసే ప్రయత్నాలు చేశాయి. ఆ మేరకు ఒప్పందాలు చేసుకున్నాయి. పలు మార్లు సరిహద్దు చర్చలు జరిపాయి.
వాటి అభివృద్ధి లక్ష్యాలు ఆర్థిక ప్రయోజనాల రీత్యా రెండు దేశాల మధ్య ఒక స్థాయిలో స్నేహం ఆరంభమైంది. రెండుదేశాల ఆగ్రనేతల మధ్య  మధ్య అనేక సార్లు స్నేహపూర్వక సంభాషణలు జరిగాయి . ఇరుదేశాలు ఒకరికొకరు తోడ్పడుతూ ప్రపంచశాంతి అభ్యుదయానికి కట్టుబడి ఉండాలని ప్రకటించాయి.
ఈ ఆసక్తి కారణంగా అంతర్జాతీయంగా ఒకే వేదికను పంచుకున్న అనేక శిఖరాగ్ర సమావేశాల్లో రెండు దేశాలు ఉమ్మడి లక్ష్యాలను ప్రకటించాయి.ఆసియా మౌలిక వనరుల అభివృద్ధి బ్యాంక్ భాగస్వామ్యం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు కూడా కాస్త బలపడ్డాయి. ఈ ప్రయాణం అంతా అనేక ఎగుడుదిగుడులతో. సమస్యలతో కొనసాగింది.అయితే,  పరిష్కరించుకోవాల్సిన సమస్యలలో అగ్రస్థానంలో ఉన్న సరిహద్దు వివాదం  మాత్రం పరిష్కారం కాలేదు.
శాంతి ఒప్పందాలు ఉన్నా సరిహద్దు సమస్య మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. సమస్య దీర్ఘకాలం కొనసాగితే అది అనివార్యంగా మొండి వాదనలకు దారితీస్తుంది. ఘర్షణలు  తరచు జరుగుతూ సమస్య పరిష్కారంలో ఇబ్బందికి దారితీస్తాయి. పరిష్కారం హేతువుతో కాక ప్రతిష్టతో ముడిపడిపోతుంది.
2017 లో జరిగిన డోక్లాం సంఘటన కానీ ఇటీవలి కాలంలో గాల్వాన్ లోయలో జరిగిన ప్రాణ నష్టాలు కాని రెండు దేశాల మధ్య ఏర్పడిన స్నేహపూర్వక  వాతావరణాన్ని భగ్నం చేశాయి.
సరిహద్దు సమస్యను భూతద్దంలోనుంచి చూస్తున్నారు. వహారం యుద్ధం వైపు నడుస్తోంది.దేశభక్తి ఆవేశంగా చొచ్చుకు వచ్చింది.
అయితే,  ఈ ఉద్రికత్త ఇలాగే కొనసాగితే,  సమస్యను పరిష్కారం అసాధ్యం కాకపోయినా చాలా కష్టతరం అవుతుంది. అది  ద్వైపాక్షిక సంబంధాలను అడ్డుకునే పెద్ద అవాంతరంగా మారుతుంది.
పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా బడుగు బలహీన దేశాలకు మిత్రుడిగా వారి ప్రయోజనాల కోసం నిలబడే పెద్ద శక్తిగా గుర్తింపు తెచ్చుకుంది. అభివృద్ధి చెందుతున్న దేశంగా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా భారతదేశం కూడా ప్రపంచ సంస్థలో తన వాణిని బలంగా వినిపించాలని భావిస్తోంది. తాను ఒక అగ్ర రాజ్యంగా గుర్తింపు పొందాలని తహతహలాడుతోంది. అయితే ఈ స్థానం పొందటానికి భారత్ అమెరికా అగ్రరాజ్యం అండదండలు కోరుకుంటోంది. అమెరికా దేశ సామ్రాజ్యవాద ప్రపంచ వ్యూహానికి అనుగుణంగా తన  వ్యూహాలను మార్చుకుంటోంది. అమెరికాకు ప్రధాన భాగస్వామి ఇండియా అన్నంతగా వారి ప్రయోజనాలకు తోడ్పడుతూ తానూ ఒక ప్రాంతీయ ఆధిపత్య శక్తిగా మారే లక్ష్యానికి వారి వత్తాసు పొందుతోంది.
అనేక సందర్భాలలో చైనా వ్యతిరేక శక్తిగా నిలబేందుకు, ఆదేశాన్ని ఏకాకిగా చేసే అమెరికా ప్రయత్నాలకు భారత్ కూడా కట్టుబడి ఉండటానికి దారితీస్నట్లు అనిపిస్తుంది.
చైనా కూడా దాని వ్యూహాత్మక విజయాల కోసం భారత్ తో విబేధిస్తున్నది.  భద్రతా సమితిలో భారత్ స్థానం పొందాలని ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ వ్యూహాల లో వచ్చిన పలు మార్పుల దృష్ట్యా ఐక్య రాజ్య సమితి భద్రతా సమితిలను సమూలమైన మార్పులు తో పునర్వ్యవస్థీకరించాల్సి వస్తుందేమో నని  చైనా భావిస్తోంది.
ఇందులో భాగంగా భారత్ స్థానాన్ని నిర్ణయించాలి కానీ దాన్ని విడదీసి ప్రత్యేక స్వతంత్ర సమస్యగా చూడవద్దని చైనా అంటోంది. అమెరికా నిర్దేశించిన ఇండో పసిఫిక్ వ్యూహంలో ఇండియా భాగస్వామ్యం విబేధాలకు మరొక ఉదాహరణ. తనని చైనా మొత్తంగా వ్యతిరేకిస్తోందని భారత ప్రభుత్వం చెబుతున్నది.
పాక్ తో చైనా కున్న మైత్రి ఇరుదేశాల మధ్య సంబంధాలకు అడ్డంకి అని భారత ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది.  చుట్టూర ఉన్న శ్రీలంక, నేపాల్, బర్మా బంగ్లాదేశ్ లతో చైనా మంచి సంబంధాలు కలిగి ఉండటం తనకు ప్రమాదకరమని ఇండియా భావిస్తోంది . ఈ దేశాలు ఇద్దరికీ ఇరుగుపొరుగు దేశాలే కదా. ఇద్దరూ సఖ్యతతో కలిసి మెలిసి వ్యవహరించాల్సి ఉంటుంది.  చైనా  ప్రవేశపెట్టిన  బెల్ట్ అండ్ రోడ్  ఇన్సియేటివ్  లో పాల్గొనడం ద్వారా అందరితో మంచి సంబంధాలు నెలకొనే అవకాశం ఇండియాకు ఉండేది. ఆ ప్రతిపాదనతో చైనా స్థానం బలపడుతుందని ఇండియా దానికి దూరంగా ఉండటమే కాదు దానికి ప్రత్యామ్నాయ చైనా వ్యతిరేక పథకాలను రచయిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ పట్ల కూడా భారతదేశం పూర్తి వ్యతిరేకతను కలిగి ఉంది.ఇలా ఇరు దేశాల మధ్య అనేక వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ధోరణులు రెండు దేశాల మధ్య స్నేహ సహకార సంబంధాలను నిరోధిస్తాయి బలహీన పరుస్తాయి.
వాణిజ్యంలో ఉన్న అసమతుల్యతను ( మనకు చైనా వారి ఎగుమతులు ఎక్కువ, భారత్ నుంచి  వారికి దిగుమతులు తక్కువ ) కూడా పెద్ద వివాదంగా మారుస్తున్నారు.
ఏ దేశాలు ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నాయి, ఎటు నిలబడుతున్నాయి అన్న అంశాలు కూడా ఈ వాణిజ్య సంబంధాల పై ప్రభావం చూపుతాయి.
 చైనాతో  వాణిజ్య వ్యాపార సంబంధాలు తగ్గించుకోవటం, సాంకేతిక విజ్ఞాన ఆదాన ప్రదానాలు నుండి అనేక సాఫ్ట్వేర్ యాప్ నుంచి భారత్లో నిషేధించడం జరిగింది.
భద్రతా సమస్యల కారణంగా ఇవి నిషేధించామని  చెబుతున్నారు. అదే సందర్భంలో చైనావారు బౌద్ధం నుండి యోగా వరకు తాముప్రో త్సహిస్తున్నామని,  ఠాగూర్ రచనలు  నుంచి నేటి దంగల్ వంటి సినిమా ప్రచారం వరకు తాము సానుకూలంగా వ్యహరిస్తున్నామని, వాటి  జనాదరణ  చైనా సంస్కృతికి లేక భద్రతకు అవరోధంగా చైనా ఎన్నడూ భావించలేదని అంటున్నారు.  భారత్ కూడా  ఇలాంటి సానుకూల ధోరణి ప్రదర్శించాలని వారు కోరుకుంటున్నారు.
ఇరు దేశాల మధ్య సఖ్యత ఎలా సాధ్యం?
ఒక వంక సరిహద్దు ఘర్షణలు జరుగుతున్నా బ్రిగేడియర్ స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి.మొన్న  చైనా విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రి ఫోన్లో సంభాషించారు ఇరు దేశాల రక్షణ  మంత్రులు మాస్కోలో షాంగై సహకార సంస్థ సమావేశ సందర్భంలో విడిగా సమావేశమై సమస్యలను చర్చించారు.వీటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవలసిన అవసరం గురించి చర్చించారు. ఇలాంటి వైఖరి ఉంటే సమస్యలను పరిష్కరించుకోవడం కష్టమేం కాదు.
శతాబ్దాల సాంస్కతిక సంబధాలు కలిగిన ఇరు దేాశాలు ప్రత్యర్థులుగా చూసుకోవడం మానివేయాలి. వ్యూహాత్మకంగా కూడా ప్రత్యర్థులుగా నిలబడరాదు. పాశ్చాత్య సామ్రాజ్యవాద వ్యూహాలకు వ్యతిరేకంగా, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రతినిధులతో కలిసి ముందుకు సాగాలి . అమెరికాకు సేవ చేసే వైఖరిని మానుకుని పరస్పర స్నేహపూర్వకంగా వ్యవహరించాలి.  భారత్  చైనా లు తమ మధ్య  సరిహద్దు వివాదాలను సామరస్యంగా సంభాషణల ద్వారా, ఇచ్చిపుచ్చుకునే సర్దుబాటు వైఖరితో పరిష్కరించుకోవాలి. యుద్దానికి దారి తీయకుండా చూసుకోవాలనే విజ్ఞతకు కట్టుబడితే,  రెండు దేశాల మధ్య  ఉద్రేకాలను తగ్గించవచ్చు. ఉద్రికత్తను చల్ల పరచవచ్చు.
చర్య ప్రతిచర్య ఇరువురికి నష్టదాయకమైనందు ఇలాంటి ధోరణి అసవరం లేదు. ఒక వ్యూహాత్మక శాంతియుత అవగాహన పునాదిగా సత్సంబంధాలు నెలకొల్పే విధానాలు ఆచరించాలి.
ఇపుడున్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో వెంటనే ఇది సాధ్యం కాకపోవచ్చు. అయితే, పరస్పరఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు.  ప్రపంచ జనాభాలో చైనా భారతదేశాల జనాభా మూడోవంతు పైనే ఉంది. భారత్ చైనాలు కలిసి నడిస్తేనే ఒక శాంతియుత సామరస్యపూర్వక ప్రపంచం ఏర్పడుతుంది. ఆధిపత్య శక్తుల చేతిలో ఆటబొమ్మలుగా మారరాదు.నిజమైన స్వతంత్ర  శక్తిగా  భారత్ నిరూపించుకోవాలి
(డా.ఎస్. జతిన్ కుమార్  భారత చైనా మిత్ర మండలి జాతీయ కార్యవర్గ సభ్యుడు.ఈ వ్యాసం, శాండుంగ్ యూనివర్సిటీ
ఇంటర్నేషనల్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ డీన్, జాంగ్ యూన్లింగ్ గ్లోబల్ టైమ్స్ పత్రికలో 15.06.20 న ప్రచురించిన ఒక వ్యాసం చదివాక స్పందనగా రాసింది.)

(The Views expressed in this article are those of the author. They do not necessarily reflect the views of  Trending Telugu News)