‘తెలంగాణ షర్మిల’ ఇంటి ముందు ‘ఆంధ్ర రైతుల’ ఆందోళన

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలకు తగ్గట్టు  భాష మార్చుకుంటున్న వైస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల కు ఆంధ్రా వాళ్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది.

వైఎస్ పేరుతో ఆమె జూలై 8న తెలంగాణ పార్టీ ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో ఆమె పచ్చి తెలంగాణ వాది అవతారమెత్తారు. ఇందులో భాగంగా ఆమె తెలంగాణ భాష, భావం నేర్చుకుంటున్నారు.

రాయలసీమ ఎత్తి పోతల పథకం గురించి తెలంగాణలో బాగా వ్యతిరేకత చెలరేగిన సంగతి తెలిసిందే.  దీనికి సంబంధించి ఆమె తన పుట్టినిల్లు రాయలసీమను కాదని రాజకీయాలకోసం తెలంగాణ భాష మాట్లాడుతున్నారని ఆంధ్రలో ఆగ్రహం ఎదురవుతున్నది.

ఇది ఈ రోజు ఆమె ఇంటి ముందర ప్రత్యక్షమయింది.

హైదరాబాద్  లోటస్‌ పాండ్‌లోని వైఎస్‌ షర్మిల ఇంటిని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలువురు రైతులు ముట్టడించారు. దీనితో  అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

కృష్ణా జలాల విషయంలో షర్మిల స్పష్టమైన వైఖరి తెలపాలంటూ  ఆమె నివాసం ముందు ఆందోళనకు దిగారు..

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంలో  తాను తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతానని, ఒక్క చుక్క నీళ్లను కూడా తెలంగాణ వదులుకోదని  షర్మిల ఇటీవల ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

 

 

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదిరిస్తామని ఆమె ట్వీట్‌ చేశారు.ఇది రాయలసీమ రైతుల్లో అగ్గి రాజేసింది. అక్కడ అసలే చాలా కాలంగా రైతులు నీళ్లకోసం, సిద్ధేశ్వరం అలుగు కోసం పోరాడుతున్నారు. ఇలాంటపుడు ఆమె ప్రకటన పుండుమీద కారం చల్లినట్లుయింది.

షర్మిల చేసిన ట్వీట్‌ రాయలసీమకు అన్యాయం చేసేలా ఉందంటూ ఈరోజు రైతులు ఆందోళనకు దిగారు.

అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొలికపూడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పరిరక్షణ సమితి సభ్యులతో షర్మిల మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *