కనుమూరి రఘురామ కృష్ణ రాజు వైసిపి నుంచి నర్సాపురం ఎంపి గా ఎన్నికయ్యారు. అయితే, నాయకత్వం మీద తిరుగుబాటు చేశారు. దీనితో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయించేందుకు వైసిసి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నది. ఈ గొడవ మధ్యలో రఘురామ ముఖ్యమంత్రి జగన్ అనేక సమస్యల మీద లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ పరంపరలో ఇదొకటి
ముఖ్యమంత్రి గారూ,
రాష్ట్రంలోని అర్హులైన పేద ప్రజలందరి సొంత ఇంటి కలను నెరవేర్చి 2023 నాటికి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వ సంకల్పం. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల కుటుంబాల కోసం 17,000 కాలనీలు నిర్మించాలని మీరు ప్లాన్ చేశారు. ముందుగా దీనికి రూ.56,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినా ఆ తర్వాత దాన్ని మీరు రూ.70,000 కోట్లకు పెంచారు.
ఈ విధంగా ఏర్పాటు చేయబోయే వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల కాలనీలలో పనులను మీరు వర్చువల్ విధానంలో జూన్ 3వ తేదీన ప్రారంభించారు. అదే విధంగా మీరు వచ్చే నెల 4వ తేదీన ప్రముఖ మీడియాలలో అద్భుతమైన ప్రకటనలు ఇచ్చి మరో కార్యక్రమం ద్వారా మళ్లీ మరి కొన్ని గృహాలకు శంకుస్థాపన చేయబోతున్నారని తెలిసింది.
ఇలా మీరు వర్చువల్ విధానంలో ఇప్పటికి నాలుగు సార్లు ఇలా చేసినట్లుగా నాకు గుర్తు. మీరు ఇన్ని సార్లు విడతల వారీగా శంకుస్థాపనలు చేయడం చూస్తుంటే నాకు యమలీల సినిమాలోని ఒక సీన్ లోని ఒక డైలాగ్ గుర్తుకు వస్తున్నది ‘‘మా చెల్లి పెళ్లి… జరగాలి మళ్లీ మళ్లీ’’.
అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను మీరు ఎందుకు పేదవారికి ఇచ్చేయడం లేదు అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడగదలచుకున్నాను. గత ప్రభుత్వం లబ్దిదారులను గుర్తించి వారికి ఇళ్లు నిర్మించి ఇస్తే మీరు గత 24 నెలలుగా వారికి ఇళ్లు అందచేయకుండా వారిని నిత్యం ఎందుకు వేధిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు.
మీకే పేరు రావాలని మీరు అనుకుంటున్నా కూడా గత ప్రభుత్వం ఆ ఇళ్లను నిర్మించింది కూడా ప్రజల డబ్బుతోనే అనే విషయం మీకు ఎందుకు అర్ధం కావడంలేదో తెలియడం లేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన తర్వాత మీరు ఇలా చేయడం సబబుగా అనిపించడం లేదు. మీరు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
గత ప్రభుత్వ హయాంలో రూ.50,000 కోట్లతో మొత్తం 25.57 లక్షల ఇళ్లను నిర్మించాలని తలపెట్టారు. పట్టణ ప్రాంతాలలో 6 లక్షల గృహాలు, గ్రామీణ ప్రాంతాలలో 19.57 లక్షల గృహాలను ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి పూర్తిగా సహకరించింది. నిర్మించిన ఇళ్లకు జియో ట్యాగింగ్ చేయడం, ఆధార్ తో లబ్దిదారులను అనుసంధానం చేయడం లాంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అప్పటిలో ఈ కార్యక్రమంలో తొలి స్థానంలో నిలిచింది.
ప్రజాధనంతో అమలు చేస్తున్న చాలా పథకాలకు మీరు మీ పేరు పెట్టుకుని అమలు చేస్తున్నట్లు గత ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లకు మీ పేరు పెట్టుకుని అయినా సరే వాటిని లబ్దిదారులకు కేటాయిస్తే పాపం… ఆ నిరుపేదలు మీ పేరు చెప్పుకుని సంతోషపడతారు.
ప్రజాధనం వినియోగించి మీ పేరుతో నిర్మిస్తున్న అన్ని కాలనీలు అందంగా ఉండాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని మీరు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి అధికారి క్షేత్ర స్థాయిలో పరిశీలించి కాలనీలు అందంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కూడా మీరు ఆదేశించారు. పార్కులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కూడా మీరు అధికారులకు స్పష్టం చేశారు.
ఇలా మీరు పార్కులు, రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ తదితరాలకు ఖర్చు చేసే ముందు ఇళ్లు ఎలా నిర్మించాలి? అవి ఉండేవారికి సౌకర్యవంతంగా, తగినంత స్థలంలో ఉన్నాయా లేదా అనే విషయాలను కూడా చూసి ఉంటే బాగుండేది. ఇంత పెద్ద పెద్ద మౌలిక సదుపాయాలతో అత్యంత చిన్న ఇళ్లను ఎలా నిర్మిస్తున్నారనే విషయం ఎంత తరచి చూసినా బోధపడటం లేదు.
మీ తండ్రిగారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇంత కన్నా మెరుగైన సౌకర్యాలతో మంచి ఇళ్లను నిర్మించి ఇస్తేనే వాటిలో ఇప్పటికీ చాలా ప్రాంతాలలో జనం నివసించడం లేదు. వాటిని వేరే పనులకు ప్రజలు వినియోగిస్తున్నారు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే ఇళ్ల నిర్మాణం బాగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతున్నది. మీరు మీ కాంట్రాక్టర్లను త్వర త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని వత్తిడి తీసుకువస్తున్నారు. దాంతో వారు హడావుడి పనులు చేస్తున్నారు. అంతే కాకుండా మీరు ఇళ్ల నిర్మాణానికి అత్యంత తక్కువ బడ్జెట్ ఇచ్చారు.
అందువల్ల మీ కాంట్రాక్టర్లు నాసిరకం నిర్మాణ సామాగ్రితో ఇళ్లను నిర్మిస్తున్నారు. థర్మోకోల్, జీఐ మెష్ (జాలీ) వాడి గోడలు నిర్మిస్తున్నందున వాటి నాణ్యత ఎట్టిపరిస్థితుల్లో బాగుండదు. ఇలాంటి చౌకబారు మెటీరియల్ తో ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల అవి ఎక్కువ కాలం మన్నే అవకాశం లేదు. పైగా మన కు 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి తరచూ తుపాన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిర్మాణాలు బలంగా ఉండకపోతే ఏం జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మీకు ఇంటి నిర్మాణ భారం ఎక్కువ అవుతుందని అనుకుంటే మీరు లాభితుల నుంచి వారి వాటా సొమ్ము అడిగి తీసుకోండి. వారు గృహనిర్మాణ రుణాలు తీసుకుని తమకు వీలున్నట్లు, తమకు కావాల్సినట్లు ఇళ్ల నిర్మాణాన్ని పటిష్టంగా చేసుకుంటారు. మీరు విద్యుత్, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రజలు వారికి అనువైన రీతిలో చక్కగా ఇళ్ల ను నిర్మించుకుంటారు. మంచి ఇంటిని నిర్మించుకోవడానికి ప్రజలు తమ వంతు వాటా ధనం ఇవ్వడానికి వెనుకాడరని నేను మీకు స్పష్టం చేస్తున్నాను.
ప్రజల అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని బెడ్ రూం వైశాల్యాన్ని మరి కొంచెం పెంచండి. మన పార్టీ ఎమ్మెల్యే ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి మనం నిర్మిస్తున్న ఇళ్ల బెడ్ రూంలు చూసి ఏమన్నారో మీకు తెలిసే ఉంటుంది.
మీ సౌకర్యం కోసం ఆయన అన్న మాటలు మళ్లీ చెబుతాను. మనం నిర్మించే ఇళ్ల బెడ్ రూం లు కొత్త జంట ఫస్ట్ నైట్ జరుపుకోవడానికి పనికి రావు అని ఆయన ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నారు. ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకుని ప్రజలకు మంచి విశాలమైన, నాణ్యమైన ఇల్లు నిర్మించి ఇస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి ఇళ్లే వారికి ఇచ్చేస్తే కచ్చితంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకభావనలతోనే ఉంటారు.
వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత గత ప్రభుత్వం కొన్ని మేలైన డిజైన్లను రూపొందించింది. మీరు కనీసం ఇప్పటికైనా వాటిని అనుసరిస్తే ప్రజలు కోరుకున్న విధంగా నాణ్యమైన ఇంటిని నిర్మించి ఇవ్వడానికి వీలుకలుగుతుంది. తద్వారా వారు కలకాలం ఆ ఇంటిలో ఉండే వీలుకలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 75 చదరపు గజాలు, పట్టణ ప్రాంతాలలో 50 చదరపు గజాల స్థలంలో మీరు కేవలం 375 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించి ఇస్తే అది ఎందుకూ పనికిరాదు.
ఈ పరిస్థితులన్నింటిని దృష్టిలో పెట్టుకుని నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. దయచేసి మీరు ఒక్క సారి ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ వాటిని ఎలా నిర్మిస్తున్నారో పరిశీలించండి.
మంచి నిర్మాణ సామాగ్రి తో మంచి మౌలిక సదుపాయాలతో ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు మీకు ఇబ్బంది అయితే ప్రజల నుంచి వారి వాటా ధనం తీసుకోండి అంతే కానీ అత్యంత చౌకబారు నిర్మాణ సామాగ్రి ఉపయోగించి కనిష్టమైన సౌకర్యాలతో, అరకొర మౌలిక సదుపాయాలతో ఇళ్లు నిర్మించి వారికి ఇవ్వవద్దు.
మీకు కావాల్సిన స్వల్పకాలిక ప్రయోజనాల కోసం వారి దీర్ఘకాలిక సంతోషాన్ని హరించివేయవద్దని నేను మీమ్మల్ని వినయపూర్వకంగా కోరుతున్నాను. ఇళ్లు లేని నిరుపేదలకు నాసిరకం ఇల్లు ఇచ్చి వారి డబ్బును, ఆరోగ్యాన్ని అన్నింటిని మించి వారి సంతోషాన్ని వారికి దూరం చేయవద్దని కోరుతున్నాను.
భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు,