’ఒక దేశం ఒక రేషన్ కార్డు‘ (ONORC) విధానాన్ని జూలై 31 నాటికల్లా అమలుచేయాలని సుప్రీమ్ కోర్టు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది.
రేషన్ కార్డ్ పోర్టబిలిటి ద్వారా దేశంలో ఇ-పోస్ తో అనుసంధానమయిన ఏ రేషన్ షాపు నుంచయినా రేషన్ నుతీసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని చెబుతూ కోర్టు ఈ గడువు నిర్ణయించింది.
జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని ధర్మాసనం వలస కూలీలందరికి కూడా రేషన్ కార్డులివ్వాలని, వారింకా కష్టాలు ఎదుర్కొంటున్నందున వలస కూలీల కోసం సామూహిక కిచెన్ లను నడపాలని కూడా కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
వలస కూలీ సంక్షేమం కోసం మంగళవారం నాడు కోర్టు పలుఉత్తర్వులు జారీ చేసింది. వలస కూలీల రిజిస్ట్రేషన్ ను జూలై 31 లోపు పూర్తి చేయాలని,దీనికోసం ఒక పోర్టల్ ను తెరవాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.
సామాజిక ఉద్యమ కారులు హర్ష మాండెర్, అంజలీ భర ద్వాజ్, జగ్ దీప్ చొక్కడ్ తరఫున ప్రశాంత్ భూషన్ వేసిన పిటిషన్ మీద కోర్టు ఈ ఉత్తర్వులు వెలవరించింది. వలస కార్మికులు ఎక్కడ ఉన్నా వారికి ఆహార అభద్రత ఏర్పడకుండా ఉండేందుకురేషన్ అందేలా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని, వాళ్లు ఇళ్లకు చేరుకోవలసి వచ్చిననపుడు నామమాత్రం చార్జీలుండేలా చూడాలని ప్రశాంత్ భూషణ్ కోర్టును కోరారు.