పోలవరం నిర్వాసితులను గాలికొదిలేస్తున్నారు: జగన్ నాడు-నేడు

ప్రాజక్టు ముంపు బాధితులు తక్కువ పరిహారానికి వప్పుకునే పరిస్థితులను ఎలా సృష్టిస్తున్నారో చూస్తే వొళ్లు జలదరిస్తుంది. ప్రభుత్వాలు ఇంత అమానుషంగా ఉంటాయా అనిపిస్తుంది.

 

పోలవరం  నిర్వాసితులు భవిషత్తులో  దుర్భర జీవితం ఎదుర్కోబోతున్నారు. ప్రజలు ఏమైనా సరే, వారికి పునరావాసం కల్పించకపోయినా సరే,  ప్రాజెక్ట్ పూర్తి చేయడమే  ముఖ్యంఅన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతున్నది. ప్రాజక్టు పూర్తయిందని పించుకోవడం వల్ల రాజకీయ ప్రయోజనం ఉంది. దీనికోసం పోలవరం మంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడం పక్కన పెట్టేశారు. వరద నీరు వస్తే, పునరావాసం కల్పించకపోయినా, ప్రజలు వూర్లొదలి పారిపోతారులే అనే ధోరణి అధికారుల్లో కనిపిస్తా ఉంది.

ఈ దోరణితో ప్రజలు తీవ్ర కష్టాల పాలవుతున్నారు.  ఈ వీడియోలో పోలవరం మండలం కొత్తూరు గ్రామం వారి ఆవేదన ఏమిటో చూడవచ్చు. వూరి దారి మూసేయడంతో కావడి ద్వారా వారు సామాన్లు మోసుకుపోతున్నారు.

 

ఇంకా, వర్షాలు పెద్ద స్ధాయిలో కురవలేదు. కానీ పోలవరం , వేలేరుపాడు, కుక్కునూరు మండలాల గ్రామాలకు బయట ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రోడ్డుకు అడ్డంగా, కొత్తూరు గ్రామం కాలవ దగ్గర అధికారులు మట్టి పోశారు. రాకపోకలు తెంచేసేందుకు ఈపని చేశారు.
బాధితులను ఇలా గాలికివదిలేయవచ్చా? బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైనట్లు?

జీఓ నెంబర్ 350, ఎందుకు అమలు చేయడం లేదు?
జీ. ఓ.ఆర్ టి. నెంబరు 641ఎందుకు అమలు చేయడం లేదు?

ముఖ్య మంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి కుకునూరు గ్రామంలో నిర్వాసితుల కు ఇచ్చిన హామీ మర్చిపోయారా?

జగన్ నాడు-నేడు

 

 

ఒకసారి ఈ వీడియో చూడండి. గతంలో జగన్ మోహన్ రెడ్డి  ప్రతిపక్ష నేత గా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అసెంబ్లీ లో చర్చ కు పెట్టారు. నిర్వాసితుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా, వారి సమస్య ల గురించి, చేస్తున్న ఆందోళన ల గురించి వివరించారు.
ఇంకా ఒక అడుగు ముందుకు వేసి,ప్రభుత్వం నిర్వాసిత గ్రామాలు సందర్శించాలి అని కోరారు. ఇపుడు జగన్ నాటి మాటలుఏమయ్యాయి?

నిర్వాసిత గ్రామాల సందర్శనలు ఇప్పుడు ఎందుకు లేవు?
నాడు మీరు చెప్పిన మాటలు నేడు నిలబెట్టు కోవాలి కదా!
అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం లేనపుడు ఒక మాట చెప్పేవారు కాదు నిర్వాసితుల కు కావాల్సింది.
భూసేకరణ అధికారులు/ రెవెన్యూ అధికారులు చట్ట పరమైన చర్యలు చేపట్టి ప్రజల హక్కుల ను కాపాడే విధంగా చేయడం మంచిదని బాబ్జి అన్నారు.
“మీరు అసెంబ్లీలో ప్రస్తావించిన అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, అప్పటి నుండి ఇప్పటి దాకా అలాగే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మీరు కొంచెం ఆలోచించి, వరద ప్రాంతాల్లో రిలీఫ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. రాయి మారింది తప్పా.. దెబ్బా నొప్పి ఒకేలా ఉన్నాయి. నిర్వాసితుల గోడు గోదారి పాలు అవుతున్నది.
వారి వేదన… అరణ్య రోదన గా మారుతుంది. దయ ఉంచి ఒక్క సారి ఆలకించండి,” బాబ్జీ కోరుతున్నారు.

నిర్వాసితుల విషయం లో మాట తప్పారా, మడమ తిప్పారా?
రాష్ట్రం లో రెండు లక్షల ఎకరాలు అటవీ పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు. మరి పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల గిరిజనులకు పునరావాస ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదు?

చట్టం అందరికీ సమానం కానీ, ఇక్కడ గిరిజన నిర్వాసితులు ఎన్నో సార్లు (ఆర్ ఓ.ఎఫ్.ఆర్ చట్టం 2006ప్రకారం) దరఖాస్తులు చేసుకున్న పట్టాలు ఇవ్వలేదు?

గిరిజన నిర్వాసితుల కు అదనంగారూ; 75000./. ఇవ్వాలని జీ. ఓ. ఇచ్చారు. ఆ డబ్బులు లెక్కలు నిర్వాసితుల కు అధికారులు చెప్పారా?

చట్ట ప్రకారం 25 రకాల సౌకర్యాలు ఎందుకు కల్పించ లేదు?

ఇప్పుడు 41.15 కాంటూరు లో కొన్ని గ్రామాలే మునుగుతాయి అంటున్నారు. కానీ, ప్రజలు 1986 లో అంచనావేసిన వాటి కంటే ఎక్కువ గ్రామాలు ముంపుకు గురవుతాయి అని అంటున్నారు. ఇవేమీ అధికారులకు ఎందుకు పట్టవు?

కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయి. హై కోర్టు లో కేసు వేశారు. నలుగురు అధికారులను విచారణకు ఆదేశించారు. అది ఏమైంది?

భూసేకరణ అధికారులు/రెవెన్యూ అధికారులు సస్పెండ్ అయ్యారు.

1) కొవ్వూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) డి. పుష్ప మణి ఏ.సి.బి.వలలో పడ్డారు.
2) నల్లజర్ల కుడికాలువ యూనిట్ కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ( భూసేకరణ) సమజ ఏ. సి. బి, వలలో పడ్డారు.
3) ఏలూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) అవినీతి ఆరోపణలు వచ్చాయి, సస్పెండ్ అయ్యారు.
4) జీలుగుమిల్లి ఎమ్. ఆర్. ఓసి. హెచ్. విద్యాపతి రికార్డులు తారు మారు (ఆన్లైన్ లో) సస్పెండ్ అయ్యారు. అంతే కాదు, 8 సంవత్సరాలు సర్వీస్ డిమోషన్ అయ్యింది.
5) ఐ. టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి/కుకునూరు సబ్ కలెక్టర్ ఆర్.వి సూర్యనారాయణ అవినీతి గురించి మీకు తెలుసు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు.
6) కోట రామచంద్రాపురం లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన వారు, ఓ.ఎస్.డి, సర్వే సిబ్బంది లంచగొండి ఆరోపణ లపైనే కదా వారిని విధులు నుండి తొలగించింది. ఈ విషయాలు అన్నీ పత్రికల్లో వార్తలు వచ్చాయి కదా!

వీటి గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తీసుకోవాలి. అంతే కానీ, ప్రజలను ఏదో విధంగా బయటకు పంపించే చర్యలు నిలుపుదల చేయాలి అని ఇక్కడ గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాది బాబ్జీ కోరుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వివిధ రకాల ప్రాజెక్ట్ ల నిర్మాణాల వలన నిర్వాసితులు/భాదితులు గా మారుతున్న వారి కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తో పాటు ఇంటి నిర్మాణానికి నిధులు పెంపుదల కోసం ఒక జీ. ఓ. ఆర్. టి. నెంబర్; 641తేది; 14/09/2016న తెచ్చింది.
ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులు కోసం ఉన్న వాటర్ రిసోర్స్ డిపార్ట్ మెంట్ (ఆర్ అండ్ ఆర్) భూసేకరణ చట్టం _2013 ప్రకారం ఇచ్చింది.
దీని ప్రకారం;
1; గ్రామీణ ప్రాంతాల వారికి, ఇంటి స్థలం; 275చదరపు గజాలు. నిర్మాణ ఖర్చు; రూ.3.55 లక్షలు.(గిరిజనులు కాని వారికి)
2; పై దానికి అదనంగా 30./. పెంచి గిరిజన నిర్వాసితులకు(షెడ్యూల్ ఏరియా లో) రూ;4.55 లక్షల రూపాయలు.

పైన చెప్పిన జీ. ఓ. ఆర్. టి. నెంబర్ ఆ విధంగా స్పష్టం చేస్తుంటే, ఇప్పుడు గ్రామాల లో ఇచ్చిన అఫిడవిట్ లలో కేవలం రూ. 2.85 లక్షలే అనడం ప్రజలను మోసం చేయడం కాదా అని బాబ్జీ ప్రశ్నించారు.

కుకునూరు మండలంలో ఉన్న ముంపుగ్రామాలలో నిర్వాసితుల నుండి అఫిడవిట్ రూపంలో సంతకాలు తీసుకుంటున్నారని తెలిసింది. ఇది చాలా అన్యాయం.

మొత్తం ఇంటి నిర్మాణానికి నిధులు; రూ; 2.85లక్షలకు కుదించే ప్రయత్నం జరుగుతూ ఉంది.  ఇల్లు వద్దనుకుంటే ఒక ఈ డబ్బుని  లక్ష రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సొమ్ముతోపాటు కలిపి నిర్వాసితుల బ్యాంక్ అకౌంట్ లో వేయడానికి ఇప్పుడు రెవెన్యూ అధికారులు, సచివాలయం వాలంటీర్లు సర్వే కోసం నడుం కట్టారు.

అసలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల ప్రభుత్వ అధికారులు ఎందుకు అంత ఉదాసీన వైఖరి కలిగి ఉన్నారో అర్థం కావడం లేదు. ఒకవైపు ప్రభుత్వం జీ. ఓ. లు ఇస్తుంది. మరొక వైపు దానిని అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

2019 ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పునరావాస హక్కులను పెంచుతూ ఈ జొవో విడుదల చేసింది. దీని ప్రకారం రు. 5 లక్షల దాకా బాధితులకు పరిహారం చెల్లించడంత పాటు షెడ్యూల్ ఏరియా లో నివసించే ఎస్ సి , ఎస్టీ కుటుంబాలకు 25 శాతం అదనపు నిధులందించాలి.

ఈ జివొ ను అమలుచేయకపోవడమంటే ప్రజలకు తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బాబ్జీ అన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *