నికార్సయిన కామెడీకి డ్రెస్సు, అడ్రస్సు ముళ్ళపూడి

(సిఎస్ సలీమ్ బాషా)

 

” భార్య భర్తలు సమానమే గాని. భర్త కొంచెం ఎక్కువ సమానం”- ఇట్లాంటి మాటలు, డైలాగులు ఆయన భాషలో చెప్పాలంటే ” రాతలు”, రాయగలిగిన ఏకైక వ్యక్తి నికార్సయిన కామెడీకి డ్రెస్సు, అడ్రస్సు అయిన “ముళ్ళపూడి” వెంకటరమణ ((28 జూన్ 1931 – 24 ఫిబ్రవరి 2011) గారు మాత్రమే.

“అంత కంగారులోను “మందోబస్తు” చేసుకునాం కాని
మధ్యాహ్నం “విందోబస్తు” చూసుకోలేదు…” అన్నది రమణ గారి పదాల “కాయినేజ్” కి ఒక ఉదాహరణ మాత్రమ్రే

“సినిమాని వెక్కిరించటానికి తప్ప డై-లాగులూ చొక్కాలూ కుట్టడానికి నేను పనికిరాను మొర్రో అని పారిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని ఆపారు డీ బీ ఎన్.  సిసినిమాకి నువ్వు పనికి రావడమే కాదు ఇందులోనే పైకి వస్తావు నువ్వు ఫెయిల్ అయితే డీ బీ ఎన్ జడ్జిమెంట్ కే ఇన్సల్ట్ అంచేత నే చెప్పినట్టు విను చచ్చినట్టు పనికిరా- పైకి రా అని శాసించి దీవించిన నారాయణ గారిని
స్మరించి నమస్కరిస్తూ “

వారి ఇంకోతికొమ్మచ్చి పుస్తకంలో నిర్మాత డీ బీ ఎన్ గారి గురించి ముళ్ళపూడి రాసిన మాటలివి. ఇలా చెప్తూ పోతే చాలా ఉంటాయి

తెలుగులో సినిమా రివ్యూల్లో కూడా రమణను మించిన వారు లేరు.

సున్నితమైన వివరణ గాని, సునిశితమైన విశ్లేషణ గాని రమణ కే చెల్లు. మచ్చుకి.. ఒక సినిమాకి రివ్యూ(బహుశా “తోడి కోడళ్ళు” అనుకుంటా) రాస్తూ..”ఎందుకైనా, నినాదించేముందు కాస్త నిదానించి మరీ అందుకు పూనుకోవడం వాంచనీయం” అని రాయగలిగే చమక్కు ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య!

మరో సినిమా “అక్కా చెళ్ళెల్లు ” కు రివ్యూ రాస్తూ.. ” పడితే పడ్డవాళ్ళ పళ్ళు రాల్తాయ్. పొరబడితే పక్క వాళ్ళవీ రాల్తాయ్. అయితే చెడ్డ వాళ్ళకి మత్రమే పై సదుపాయం జరుగుతుందని(పొర) పడ్డ వాళ్ళు నిక్షేపంలా ఉంటారని సినిమా నీతి…. కథలలో సుధలలాగా చెప్పుకోదగ్గ
డబ్బు, చెల్లే అధికారాలు ఉన్న వాళ్ళు పొరబాటున పొరబడిన ఎంత పెద్ద సినిమా కథలు సంభవిస్తాయో చెప్పలేము” రమణ గారి సినిమా రివ్యూల గురించి ఎంత చెప్పినా తక్కువే ముళ్ళపూడి రాస్తే, ఆయన చిరకాల మిత్రుడు బాపు తీసేవాడు. కలంతో రమణ అడుకున్నట్లు వేరెవరూ ఆడుకోలేదు, కోలేరు కూడాను. ఆయన రాసిన కోతి కొమ్మచ్చి, ఇంకోతికొమ్మచ్చి,ముక్కోతి కొమ్మచ్చి ప్రతి తెలుగు వారింట ఉండదగ్గ పుస్తకాలు. అవి ఒక్క సారి చదివి పక్కన పెట్టేవి కాదు. బోర్ కొట్టినప్పుడల్లా చదూకొని ఎంజాయ్ చెయ్యొచ్హు.

ఆయన సృష్టించిన “బుడుగు” ఎంత పెద్దవాడయ్యాడో అందరికీ తెలుసు. కథలు రాసినా, కాకరకాయలు రాసినా ఆయనకాయనే సాటి. (వాటి గురించి చెప్పాలంటే ఒక నవల రాయవలసి వస్తుంది) ఇక సినిమా స్క్రిప్ట్ అయితే.. అలా అలా సాగిపోతుంది. తీసినవి రాసినవి పుంజీడు సినిమాలే అయినా, నికరమైనవి, నికార్సైనవితెలుగు సినిమాల్లో డైలాగులకి అసలు సిసలైన తెలుగు హాస్యాన్ని పట్టించి, హ్యూమరసం లో వేయించి, వేడి వేడి పకోడీల్లాగ తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై వడ్డించిన ముళ్ళపూడి వెంకటరమణ జయంతి జూన్ 28.

(సలీమ్ బాషా, లాఫ్ థెరపిస్టు, రచయిత, హోమియో వైద్యుడు,వ్యక్తిత్వ వికాస నిపుణుడు. కర్నూలు. ఫోన్ నెం.9393737937)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *