జనగామ, ఆదివారం : జనగామ పట్టణానికి చెందిన నవతరం కవి ‘సర్వోన్నత్ భారతీయ సంవిధాన్’ అధ్యక్షులు డాక్టర్. మోహన కృష్ణ భార్గవ రచించిన చేనేత కవిత్వ గ్రంథాలను జనగామ జిల్లా గ్రంథాలయానికి బహూకరించారు.
తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కోడం కుమారస్వామి సమక్షంలో ఆదివారం జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తకాలను అధికారి ఈ. కృష్ణ కు అందజేసారు.
ఈ సందర్భంగా కోడం కుమారస్వామి మాట్లాడుతూ సాహిత్యంలో వస్తున్న కొత్త పుస్తకాలను జనగామ పాఠకులకు అందజేయడానికి రచయిత డాక్టర్ మోహనకృష్ణభార్గవ దాతృత్వాన్ని అభినందించారు.
జిల్లాలోని వివిధ కవులు, రచయితలు తమ సాహిత్యాన్ని పుస్తకాలుగా ముద్రించి, ప్రతి ఒక్కరు తమ పుస్తకం గ్రంథాలయాల్లో ఉండే విధంగా చూడాలి. అపుడే రాబోయే తరాలకు సాహిత్యం అందుబాటులో ఉంటుంది, జనగామ జిల్లాలోని సాహిత్య సాంస్కృతిక రాజకీయ సామాజిక పరిస్థితులని అధ్యయనం చేయడానికి సాహిత్యం దోహదకారిగా పనిచేస్తుందన్నారు.
జనగామ జిల్లాలో పుట్టిన బమ్మెర పోతన దిక్కార స్పూర్తిని నవతరం కవులు స్వీకరించాలని కోరారు, పాల్కురికి సోమనాథుడు చాపకూడు సిద్దాంతం ప్రపంచానికి అందించిన గొప్ప లౌకికమైన భావన అని కొనియాడారు.
కవులు పీడిత వర్గాల ప్రజలవైపు నిలబడి అట్టడుగు ప్రజల జీవితాన్ని అక్షరీకరించాలని పిలుపునిచ్చారు, మోహనకృష్ణభార్గవ మాట్లాడుతూ పోగుబంధం పుస్తకాలని అధ్యయనం చేసి తమ అభిప్రాయాలను ఆలోచనలను తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యోగులు నరహరి, నిర్మల గ్రంథాలయ కమిటీ సభ్యులు దినేష్, సర్వోన్నత్ భారతీయ సంవిధాన్ సభ్యులు వళిగొండ కృష్ణకుమార్, సాయితేజ భార్గవ, సంపత్‌కుమార్ భార్గవ తదితరులు పాల్గొన్నారు..