న్యూఢిల్లీ: మొత్తానికి కాంగ్రెస్ హై కమాండ్ టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక సస్పెన్స్ తొలగించింది.
చాలా కాలంగా రేవంత్ రెడ్డి నియామకం నానుతూ వస్తున్నది. బిసిలు తమకు కావాలని వాదిస్తూ వస్తే, పార్టీ సీనియర్లు తమనే నియమించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవైపు నుంచి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరొక వైపు నుంచి పిసిసి పదవి కాంక్షిస్తూ వచ్చారు. మొత్తానికి టిపిసిసకి రెడ్డే అధ్యక్షుడు కావాలని, కెసిఆర్ తో ఏ మాత్రం సాఫ్ట్ కార్నర్ లేని నాయకుడు పార్టీని నాయకత్వం వహించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తూ ఉందని రేవంత్ నియామకంతో అర్థమయింది. రేవంత్ కెసిఆర్ రాజీలేని పోరాటం చేస్తాడనే పార్టీ విశ్వసిస్తూ ఉంది.
అయితే, ఈ సారి పార్టీ విధేయత, సీనియారిటి అనే అంశాలను కాకుండా కెసిఆర్ కు ధీటైన వాయిసు ఉండాలని పార్టీ భావించింది. దీనికితోడు, పార్టీ నాయకుల్లో ఎక్కువమందిని రేవంత్ తన వైపు తిప్పుకోవడంలో విజయవంతయ్యారు. వీళ్లంతా పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్లి రేవంత్ తరఫున క్యాంపెయిన్ చేశారు. లేఖలు రాశారు. ఇపుడున్న పరిస్థితుల్లో కెసిఆర్ ను మాటల్లో చేతల్లో, ధనబలంలో ఎదుర్కోగల శక్తి రేవంత్ కే ఉందని పార్టీ ప్రతినిధులు అభిప్రాయం సేకరించినపుడు వ్యక్తమయిందని తెలిసింది.
Finally Congress Party took one SUPER FANTASTIC DECISION by making LION REVANTH RÊDDY the PRESIDENT ..ALL THE TIGERS WILL NOW BE SCARED OF THE LION @revanth_anumula
— Ram Gopal Varma (@RGVzoomin) June 26, 2021
రేవంత్ తెలుగుదేశం నుంచి వచ్చాడని, పార్టీలో కొత్త గా చేరినవారిని ప్రమోట్ చేస్తే నష్టమని చాలా మంది సీనియర్లు వాదించినా, పార్టీ బతుకుదెరుకు ఇపుడు చాలా ముఖ్యమని, కెసిఆర్ పెత్తందారి వ్యవస్థను ఎదర్కొవాలంటే రేవంత్ అవసరమని పార్టీ భావించింది. అందుకే ఎవరెన్ని బెదిరింపులు జారీ చేసినా, హెచ్చరికలు చేసినా ఖాతరు చేయకుండా ఈ రోజు పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రేవంత్ రెడ్డి పేరును ప్రకటించారు.
ఇదే విధంగా సామాజిక న్యాయం అనే ప్రయోగానికి కూడా ఇది అనువైన సమయం కాదని కూడా పార్టీ గ్రహించింది. రేవంత్ రెడ్డికి యూత్ లో మంచి క్రేజ్ ఉందని, సంస్థాగతంగా ఆయనకు పార్టీని నడిపిన అనుభవం ఉందని హైకమాండ్ సంతృప్తి చెందింది. అందుకే చివరి క్షణం వరకు రేవంత్ కు వ్యతిరేకంగా పితూరీలు వచ్చినా ఖాతరు చేయలేదు. టి పి సి సి చీఫ్ గా మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి ని నియమించింది.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా మరో ఐదుగురు అజారుద్దీన్ గీతా రెడ్డి జగ్గారెడ్డి అంజన్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ లను నియమించారు. పది మంది సీనియర్ వైస్ ప్రెసిడెంట్లను నియమించారు.
మాజీ ఎంపి మధుయాస్కి గౌడ్ ను క్యాంపెయిన్ కమిటీ ఛెయిర్మన్ గా సయ్యద్ అజ్మతుల్లా హుసేని ని కన్వీనర్ గా నియమించారు.
ఇక ఎన్నికల మనేజ్ మెంట్ కమిటీకి చెయిర్మన్ గా మాజీ ఉప ఉముఖ్యమంత్రి దామోదర సి.రాజనరసింహ నియమితుడయితే, ఎఐసిసి ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ చెయిర్మన్ మహేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు.
కొత్తగా నియామకం అయిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొద్ది సేపటి కిందట సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ.మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ లను వారి ఇంటికి వెళ్లి కలిసారు.