తరతరాలుగా నిర్లక్ష్యానికి గురై అత్యంత వెనుకబడిన రాయలసీమ సాగునీటి హక్కులను పరిరక్షించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
ఈ సందర్భంగా రాయలసీమలో బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల విధానం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు వివరాలతో ముఖ్యమంత్రి కి , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన , BJP, కాంగ్రెస్, CPI,CPIM పార్టీలకు లేఖలు పంపినట్లు దశరథరామిరెడ్డి చెప్పారు.
నదీజలాల పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బచావత్ ట్రిబ్యునల్ తీర్పు కాలపరిమితి 2000 సంవత్సరంలో ముగిసిందని , తదనంతరం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడి ఇప్పటికి 20 సంవత్సరాల ఐనా తుది తీర్పు ను నోటిఫై చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు నూతనంగా ఇంకొక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఈ కొత్త ట్రిబ్యునల్ తుది తీర్పు రావడానికి మరో 20 సంవత్సరాలు పడుతుందని దీనితో రాయలసీమ ఉనికికే ప్రమాదంలో పడుతుందని దశరథరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
రాయలసీమ సాగునీటి హక్కులకు తీవ్ర అంతరాయం కలుగజేసే కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం చేస్తున్న సందర్భంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ ప్రజానీకానికి బాసటగా నిలువాలని దశరథరామిరెడ్డి కోరారు.
రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణకై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను పక్కనపెట్టి భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఆయన కోరారు.
రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణ కొరకు అన్ని రాజకీయ పార్టీలు, రైతు,ప్రజా సంఘాలతో తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సాగునీటి రంగంలో దశాబ్దాలుగా తీవ్రంగా నష్టపోతున్న రాయలసీమ ప్రజానీకానికి అండగా నిలువాలని ప్రతిపక్షాలను దశరథరామిరెడ్డి కోరారు.