బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ కి పి.జె.ఆర్ పేరు: ముఖ్యమంత్రికి విఙప్తి

 

(జి.నిరంజన్)

పూర్వ ఖైరతాబాద్ నియోజకవర్గము నుండి అసెంబ్లీకి 5 సార్లు ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకే కాక యావత్ తెలంగాణా ప్రజల కోసము అహర్నిశలు కృషి చేసిన తెలంగాణా ముద్దుబిడ్డ, మాజీ సి.ఎల్.పి నాయకులు స్వర్గీయ శ్రీ పి.జనార్ధనరెడ్డి గారి స్మారకార్థము హైదరాబాద్ బాలానగర్ లో కొత్తగా నిర్మించిన ” బాలానగర్ ప్లయ్ ఓవర్ బ్రిడ్జ్ కు పి.జె.ఆర్ ప్లయ్ ఓవర్ బ్రిడ్జ్” గా పేరు పెట్టాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు కు ఒక లేఖ ద్వారా విఙప్తి చేయడమైనది.

ఈ నియోజకవర్గ ప్రాంతాల అభివృద్దికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, కార్మిక వర్గాలకు అండగా నిలుస్తూ , రాత్రింబగళ్లు కృషి చేసిన ఆయన అందరి హృదయాల్లో, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకున్నారని సి.ఎమ్ దృష్టికి తేవడము జరిగింది.

మంత్రిగా ఆ పదవికే వన్నె తెచ్చిన పి.జె.ఆర్, సి.ఎల్.పి. నాయకుడిగా ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలు ఇప్పటికీ ఎవరూ మరువలేరు. సి.ఎల్.పి నాయకుడు అనే పదానికి, ఆ పదవికి ప్రాశస్త్యం దక్కించింది ఆయనే.

తాను అసువులు బాసే వరకు తెలంగాణా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై తన గళాన్ని విన్పించారు. పోరాటాలు చేశారు.

2004 లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారము లోనికి వచ్చిన తర్వాత తెలంగాణా గళాన్ని వినిపించే ఆయనను రాష్ట్ర మంత్రివర్గములోకి తీసుకోక పోవడము ప్రజలను ఆశ్చర్య పరిచినది. ఆయినా పి.జె.ఆర్ వెనక్కు తగ్గలేదు. ప్రజాసమస్యలపై, తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాలపై తన పోరాటాన్ని ఆపలేదని వివరించారు.

610 జి.ఓ అమలు పై, పోతిరెడ్డిపాడు అంశముపై, హైదరాబాద్ కు క్రిష్ణా జలాలు తీసుకు రావడముపై ఆయన అసెంబ్లీలోనా, బయటా ఆయన చేసిన
పోరాటము మరువలేనిది.
.
ఆయన ఇంత త్వరగా మన మధ్యలో నుండి పోయే వారు కాదు. కాని ఆయనను తీవ్రమైన మనోవ్యధకు గురి చేయడము వలననే అసువులు బాశారు.

బాలానగర్ ప్రాంతము కూడా ఆయన హయాంలోనే అభివృద్ది చెందింది. 1998 లోనే పి.జె.ఆర్ బాలానగర్ ప్లయ్ ఓవర్ బ్రిడ్జ్ కు ప్రపోజల్ కూడా పెట్టడం జరిగినది. అది ఇప్పుడు సాకారమవుతుంది. ఈ ప్రాంతముతో ఆయనకున్న అనుబందము తెలియనిది కాదు. ఈ ప్రాంతమంతా ఆయన అనుయాయులమయము.ఆయన అనుయాయులు ఒక్క పార్టీలోనే కాదు. అన్ని పార్టీలలో ఉన్నారు.తెలంగాణా మట్టిబిడ్డకు నివాళులర్పించేందుకు ఇదొక సదవకాశము. వివక్షతకు గురైన తెలంగాణా బిడ్డను, పోరాటయోధుడిని సదా స్మరించుకోవడానికి, బాలానగర్ ప్లయ్ ఓవర్ బ్రిడ్జ్ కు ” పి.జె.ఆర్ ప్లయ్ ఓవర్ బ్రిడ్జ్ ” గా నామకరణం చేయాలని సి.ఎం కు ఆ లేఖలో విఙప్తి చేయడమైనది.

(జి.నిరంజన్, ఎఐసిసి సభ్యులు, అధికార ప్రతినిధి, తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *