ఎమర్జన్సీ నాడు-నేడు…

(దివికుమార్‌)

46 ఏళ్ల క్రితం నిన్నటి రోజున (25-6-1975) ఇందిరాగాంధీ  అత్యవసర పరిస్థితి విధించిన సంగతి అందరికీ తెలుసు. దానిని దృష్టిలో పెట్టుకొని, ఆరు సంవత్సరాల క్రితం ఎల్. కె. అద్వానీ 19-6-2015న చేసిన ప్రకటన  కొందరికైనా గుర్తు ఉండే  ఉంటుంది.

నేడు ఇందిరాగాంధీ తరహాలో ప్రత్యక్ష అత్యవసర పరిస్థితి కాకుండా, పరోక్ష రూపాలలో అత్యవసర పరిస్థితి సాగుతోందని మోడీ భక్త వరేణ్యులు  మినహా మిగతా వారందరికీ అర్థమవుతున్న విషయo!

పాలకులు నిర్మించుకుoటూ వస్తూన్న అనేక రాజ్య వ్యవస్థలను  లొంగదీసుకుని పాదాక్రాంతం చేసుకునే ప్రక్రియ చట్టబద్ధంగా సాగుతోంది. వాటి ద్వారా, మరీముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గుప్పెటలో ఉండే   NIA; CBI; ED ; IT.. ల ద్వారానూ, క్రింద నుండి పరివార్ దళాలను ప్రయోగిస్తూ ప్రతిపక్ష పార్టీల వారినీ, ప్రతిపక్ష  రాష్ట్ర ప్రభుత్వాలను లొంగ తీసుకోవడం  ఒక ఫాసిస్టు కళగా అభివృద్ధి పరచుకుని  అప్రకటిత అత్యవసరపరిస్థితిని నడిపిస్తున్న సంగతి  మనందరం ఎరిగినదే!

ఇక ప్రజా ఉద్యమాల సంగతి చెప్పేదేముంది ? ప్రశ్నించడమే నేరం!  నిజం మాట్లాడటమే ద్రోహం!!

బ్రిటిష్ వలసపాలకుల రాజద్రోహ చట్టం + రౌలట్ చట్టం కలగలిపి  నేడు  నిరసననే  యథేచ్ఛగా నలిపి వేయడం రూపంలో సాగుతున్నది, పరోక్ష అత్యవసర పరిస్థితి కాక మరేమిటి?

51 సంవత్సరాల క్రితం 1970లో మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు పాతను బతికించడానికి కొత్త చిట్కాలు వెతుకుతున్నారు. కొత్తను హతమార్చడానికి  పాత కత్తులు నూరుతున్నారు గదా!!

సామ్రాజ్యవాదుల చంకలో దూరి, అబద్ధాల ఫ్యాక్టరీ ప్రచారంపై ఆధారపడి, కార్పొరేట్ శక్తులను   బలిపించడమే కార్యక్రమంగా,  తమ వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాలపై అశ్వమేధయాగం తలపెట్టిన కేంద్ర పాలకుల ఆశలు దురాశలు కాక తప్పదు!

చార్లీ చాప్లిన్ గ్రేట్ డిక్టేటర్ సినిమాలో చూపించినట్టు ఆత్మవంచనాత్మక బుడగ పేలిపోకనూ తప్పదు !!

ఆరేళ్ల క్రితపు సమకాలీనం నేడు ఒకసారి చూడండి!!

అత్యవసర పరిస్థితి : విషాదాంత ప్రహసనాలు.

భారతీయ జనతాపార్టీ (భాజపా) వారిచేత అభినవ సర్దార్ పటేల్‌గా, సంఘ పరివారీయులచేత లోహపురుష్‌ (ఉక్కుమనిషి) గా ఒకనాడు విశేషంగా ప్రచారం పొందిన లాల్‌కిషన్‌ అద్వానీ, దేశంలో అత్యవసర పరిస్థితి ప్రమాదం పొంచివుంది సుమా అని హెచ్చరించటంపై బయటకు ఎక్కువమంది మాట్లాడకున్నా చాలామందిని లోలోపల ఉలిక్కిపడేట్లు చేసింది.

ప్రస్తుత సమయంలో రాజ్యాంగ చట్టపరమైన రక్షణలకు కట్టుబడని, ప్రజాస్వామ్యాన్ని అణచివేయగల శక్తులు బలంగా ఉన్నాయని అద్వానీ పేర్కొన్నారు. పౌరహక్కులు రద్దుకావనీ, మళ్ళీ దెబ్బతినబోవనీ తాను భావించటం లేదన్నారు. అలా చేయటం అంత తేలిక కాదనీ, అయితే మళ్ళీ అలా జరగదని తాను చెప్పలేననీ, ప్రాధమిక హక్కులు తిరిగి హరించవచ్చని అద్వానీ వ్యాఖ్యానించారు(ఈనాడు – 19 జూన్‌ 2015 ).

అద్వానీ ప్రకటన చంద్రబాబు – చంద్రశేఖరరావులనో, జయలలిత- మమతాబెనర్జీలనో దృష్టిలో పెట్టుకుని చేసినది కాదనీ, సాక్షాత్తూ దేశ ప్రధానిగా వున్న భా.జ.పా. నాయకుడు నరేంద్రమోడీని ఉద్దేశించి మాట్లాడినదేనని ప్రత్యేకంగా చెప్పనవనరంలేదు. అయితే ఇది  పాలకవర్గాలలో పెరిగిపోతున్న అంతర్గత సంక్షోభానికీ, వారి ముఠాల నడుమ వైరుధ్యాల తీవ్రతకూ అద్దం పడుతోంది.

40 ఏళ్ళ క్రితం,(25-06-1975) ఇందిరాగాంధీ, పాలకముఠాలలోని మరోవర్గానికి కూడా చట్టబద్ధ హక్కులు లేకుండా నిర్బంధాలూ, నిషేధాలూ ప్రకటించి అమలుపరిచినదే అత్యవసర పరిస్థితి. సాధారణ ప్రజలపై ప్రజా ఉద్యమాలపై ప్రకటిత, అప్రకటిత నిషేధాలూ, నిర్బంధాలూ ఏ కాలంలోనైనా వున్నాయి. వారికవి మొదలూ కాదు, చివరా కాదు.

అయితే పాలకవర్గాలకు కూడా ప్రాథమిక హక్కులు లేని స్థితిలో… వారిపై జైలుశిక్షలు, నిర్బంధాలూ సాగినాయి.  పనిలో పనిగా పీడిత ప్రజలపై వారి ఉద్యమాలపై చిత్రహింసలూ, బూటకపు ఎన్‌కౌంటర్లు బాగా పెచ్చరిల్లాయి.

ఇన్ని ఏళ్ళుగా మరీ ముఖ్యంగా సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు దేశాన్ని పరాధీన పరిచిన నాటి నుండి, ఏ రాజకీయపార్టీ పేరు పెట్టుకున్నా అవి కేంద్ర ప్రభుత్వాలా, రాష్ట్రాల ప్రభుత్వాలా అన్న తేడా లేకుండా దేశవనరులను, అడవిని, భూమిని, భూగర్భజలాలను బహుళజాతి సంపదలపరం – గావించటాన్ని నిరసించిన ప్రతిచోటా విస్థాపనకూ, కాలుష్య్యానికీ వ్యతిరేకంగా పోరాడినపుడల్లా అణచివేతలూ, నిర్బంధాలూ,బూటకపు ఎన్‌కౌంటర్లు సాగిస్తూనే వున్నారు. అప్రకటితమైన అత్యవసర పరిస్థితి లాంటిది సాగుతూనే వుంది.

ఇపుడు అద్వానీ చెబుతున్నదేమంటే అధికారంకై పోటీపడే పాలకముఠాల వారికి కూడా ప్రాథమికహక్కులు లేకుండా చేస్తే తాను ఆశ్చర్యపోనని అంటూ అలాంటి అత్యవసరపరిస్థితి ప్రమాదాన్ని గురించి దేశాన్నిహెచ్చరిస్తున్నాడు.

నిజానికి ఎన్నికల పేరుతో పాలకముఠాలన్నీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కళలో ఆరితేరాయి. అప్రజాస్వామిక ఎన్నికల సంస్కృతిని అత్యంత సహజమైనదిగా తీర్చిదిద్దాయి. ధనానికి కుల,  మతాల్నీ,  సారా గూండాయిజాల్నీ జతచేసి చట్టాన్ని మోసంచేసి గెలవటమే ప్రజాస్వామిక ప్రజ్ఞగా డబ్బా కొట్టుకుంటున్నాయి. ఓటర్లను ఎం. ఎల్‌.ఎలు లేక ఎం.పి లూ; వారిని రాజకీయపార్టీలు;  వారిని బహుళజాతి కంపెనీలు; భారత ప్రజాస్వామ్యాన్ని టోకుగా అమెరికా సామ్రాజ్యవాదమూ–కొనుగోలు, అమ్మకాలు సాగించటం సర్వసాధారణమైపోయింది.

మతాల మార్చిడి గురించి నేలా నింగీ ఏకంచేసి గగ్గోలుపెట్టేవారందరూ పార్టీల మార్పిడిని ప్రోత్సహిస్తూనే వున్నారు. కుదిరినవాడు మహాభారతంలో శకునిలాగా విజేతనంటున్నాడు! పరాజితుడు అయ్యో, కుయ్యో, మోసం ఘోరం అని అరుస్తున్నాడు!!

చంద్రబాబు, చంద్రశేఖర రావులు ఈ జూదగొండి విద్యలో ఒకరి గోతులొకరు తవ్వుకుని, కడుపులో కత్తులు దాచుకుంటూనే, ఆఖరి క్షణాల్లో రహస్యంగా ట్రూస్‌ (తూచ్‌) అనుకుంటున్నారు. ప్రతి చిన్న సందర్భాన్నీ తెలుగు ప్రజల నడుమ ప్రాంతీయ విద్వేషాలు పెంచటానికి మలుచుకుంటూ, తాము మాత్రం తమ తమ ప్రాంతాలవారి ప్రయోజనాల రక్షకులమన్న భుజకీర్తులు తగిలించుకుంటున్నారు. విదేశీ కార్పొరేట్‌ శక్తులకు వనరులను దోచిపెట్టటంలో దొందూ. దొందే! గా వ్యవహరిస్తున్నారు.

తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జె.సి. దివాకర్ రెడ్డి లాంటివారు పంచాయితీ నుండి పార్లమెంటు దాకా వేలూ, లక్షలూ , కోట్లూ పంచకుండా ఎవరు మాత్రం గెలుస్తున్నారు చెప్పమని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంతిమంగా కుళ్ళి కంపుకొడుతున్న యధాతధ స్థితిని ప్రజలందరూ ఆమోదించి దిగమింగేటట్లు చేస్తున్నారు.

టి.వి.ల ద్వారా వ్యాప్తిచెందిన క్రికెట్టు వేలంవెర్రిని వ్యాపారం చేసుకోవటానికి పాలక రాజకీయ ముఠాలన్నీ ఏకమైపోయాయి. 1500 కోట్ల రూ.ల దాకా నల్లధనం రూపంలో విదేశాలకు చేరవేసి, తానుకూడా అక్కడికి చేరిన మాజీ ఐ.పి.ఎల్‌. అధ్యక్షుడు లలిత్‌మోదీని కాపాడటంలో కాంగ్రెసు, భాజపా ప్రభుత్వాలూ కోర్టులూ, నాజూకు మాటలతో ఎలా సహాయపడ్డారో ఒకటొకటిగా బయటికొస్తోంది. నరేంద్రమోడీ మంత్రి వర్గంలో విదేశాంగ మంత్రిణి సుష్మాస్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజేల అవినీతి బట్టబయలైపోయింది. మానవవనరుల  శాఖామంత్రిణి స్మృతి ఇరానీ దొంగ సర్టిఫికెట్ల కేసులో దొరికిపోయినట్లే,  మహారాష్ట్రలో మరో బిజెపి మంత్రిణి 208 కోట్ల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భాజపాలోనే నరేంద్రమోడీ విధానాలపట్ల సీనియర్లు తీవ్ర అసంతృప్తితో వున్నారని పత్రికలు రాస్తున్నాయి. ఈలాంటి పరిస్థితులలో 2002 గుజరాత్‌ దురంతాల విషయంలో కానీ, తదనంతర కాలంలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ల కేసులలోగానీ నరేంద్రమోడీని కోర్టులు దోషిగా నిర్ణయిస్తే ఏం జరుగుతుంది?

నిష్కామకర్మయోగంతో నరేంద్రమోడీ అధికారం విడిచిపుచ్చి జైలుకు వెడతాడా? ఇందిరాగాంధీలా అత్యవసర పరిస్థితి ప్రకటిస్తాడా? అద్వానీ లెక్క ప్రకారమైతే రెండవదే సంభావ్యం!

160 సంవత్సరాల క్రితం, (1852) ఫ్రాన్స్‌ దేశాధ్యక్షుడైన లూయీ బోనపార్టీ గురించీ, చరిత్ర పునరావృతం కావటం గురించీ రాస్తూ కారల్‌మార్క్స్ Eighteenth Broumier of Lyee Bonaparte లో అన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం!

ప్రపంచ చరిత్రలో అధిక ప్రాముఖ్యం కలిగిన అన్ని ఘటనలూ పునస్సంభవిస్తూ వుంటాయనీ, వ్యక్తులు- పునరావిర్భవిస్తూ వుంటారనిపిస్తుందనీ,హెగెల్‌ ఒకమారు ఎక్కడోగాని అన్నాడు. అయితే  మొదటిసారి విషాదాంతంగానూ, రెండవసారి ప్రహసనంగానూ అని చేర్చటం ఆయన మరిచిపోయాడు. ఇందిరాగాంధీకి 1977 ఎన్నికల ఓటమితో అత్యవసర పరిస్థితి  అప్పుడే ఆమెకు విషాదాంతమైంది.

నరేంద్రమోడీ కూడా అలాంటి ప్రయత్నమే కనుక చేయతలపెడితే ప్రహసనం(ఫార్స్‌)గా ముగియక తప్పదు.

 

(25-6-2015 ప్రజాసాహితి జూలై సంచిక)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *