(India Today పత్రిక వారు ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సులో “ఆధ్యాత్మికత ” అనే అంశంపై ప్రఖ్యాత హిందీ,ఉర్దూ కవి జావేద్ అఖ్తర్
చేసిన ప్రసంగం లో కొన్ని బాగాలు)
వ్యాసం సేకరణ మరియు
టైప్ సెట్టింగ్: మలసాని శ్రీనివాస్,కాకినాడ.
మహానుభావులు ఎందరో ఉన్న ఈ సభలో నేను ఉన్న
స్థానంలో కి రావాలని ఎవరూ కోరుకోరనుకుంటాను.
ఎందుకంటే శ్రీశ్రీ రవిశంకర్ లాంటి జనాకర్షణగల, శక్తిమంతులైన ఆధ్యాత్మిక గురువు మాట్లాడిన తర్వాత మాట్లాడబోవడం, అంటే సచిన్ టెండూల్కర్ అద్భుతంగా సెంచరీ చేసిన తర్వాత ఆడడానికి నాలాంటి వాడు రావడం లాంటిది.
కానీ,ఏదో ఒక బలహీన క్షణంలో ‘ఇ0డియా టు డే’ వారితో నేనేనిక్కడ మాట్లాడడానికి ఒప్పుకున్నాను.
సరే….మొట్టమొదటనే నేను స్పష్టం చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.
జావేద్ అఖ్తర్ అనే నా పేరుతో మైమరచిపోకండి. నేనిక్కడ ఏ రహస్యం విప్పబోవడం లేదు.
రచనలోనో, టెలివిజన్ మీదనో బహిరంగంగా నేను అనేకసార్లు చెప్పిన విషయమే మళ్ళీ చెపుతున్నాను. నేను నాస్తికుడిని. నాకు ఏ మతంలోనూ విశ్వాసం లేదు. అందువల్ల ఎటువంటిరకం ఆధ్యాత్మికతలోనూ నమ్మకం లేదు. ఎటువంటిదైనా సరే.
ఇంకో విషయం కూడా చెప్పాలి. నేనిక్కడ కూచున్న పెద్ద మనిషిని విమర్శించడానికో, విశ్లేషించడానికో, విరుచుకుపడడానికో కూడా.. నిలబడలేదు.
ఆయనకు, నాకు మధ్య ఆహ్లాదకరమైన, మర్యాదపూర్వకమైన సంబంధం ఉంది. ఆయన ఇతరులతో ఎంత సాదరంగా ఉంటారో చాలా సార్లు గమనించాను.
కానీ, నేను మాట్లాడదల్చుకున్నది ఒక భావం గురించి. ఒక వైఖరి గురించి. ఒక మానసిక స్థితి గురించి మాత్రమే. ఒక మనిషి గురించి కాదు.
ఈ సమావేశం ప్రారంభమైనప్పుడు నేనేమన్న పొరపాటు స్థలానికి వచ్చానా అని నాకు ఒక క్షణం అనుమానం వచ్చింది. ఎందుకంటే మనం కృష్ణుడో, గౌతముడో, కబీరో, వివేకనందుడో చెప్పిన తత్వ శాస్త్రం గురించి చర్చించడానికి ఇక్కడకి వచ్చినట్టయితే, నాకు మాట్లాడవలసింది ఏమీలేదు. నేనిప్పటికిప్పుడు కూచోవచ్చు.
భారతీయులలో ప్రతి ఒక్కరూ గర్వంగా భావించే ఉజ్వల గతం గురించి చర్చించడానికి నేనిక్కడికి రాలేదు. నేనిక్కడికి మన విషపూరితమైన వర్తమానం గురించి మాట్లాడడానికి వచ్చాను.
నన్నిక్కడ ఆధ్యాత్మికత గురించి మాట్లాడడానికి ఆహ్వానించారు. అయితే ఈ ఆధ్యాత్మికత అనే మాటతో మనం గందరగోళానికి గురికావద్దు. ఎందుకంటే, ఒకే పేరు గల ఇద్దరు మనుషులూ ఉండవచ్చు. ఆ ఇద్దరూ పూర్తిగా భిన్నమైన మనుషులూ కావచ్చు. రామచరిత మానస్ అనే గ్రంథాన్ని తులసిదాస్ రాశాడు. రామాయణం ఆధారంగా రామానందసాగర్ ఒక టెలివిజన్ చిత్రం తయారు చేశాడు. రెండిటికీ రామాయణమే మూలం. కానీ,తులసిదాస్ నూ, రామానందసాగర్ నూ సమానంగా చూడడం అంత ఉచితమని నేను అనుకోను.
రామచరిత మానస్ రాసినప్పుడు తులసిదాస్ పై సాంఘిక బహిష్కరణ విధించారు.
అంత పవిత్రమైన గ్రంథాన్ని అవధీ లాంటి మామూలు ప్రజల భాషలో రాసి అవమానిస్తాడా అని ఆయన మీద విరుచుకుపడ్డారు.
మతఛాందస వాదులు ఏ మాటలు మాట్లాడినా, ఏ రంగులో ఉన్నా, ఏ మతానికి చెందినా, ఏ సమూహానికి చెందినా అంతా ఒక్కలాగే ఉండడం చూసి నాకు ఆశ్చర్యం కలుగుతుంది.
1789లో షా అబ్దుల్ ఖాదర్ అనే ఒక పెద్ద మనిషి ఈ నగరం(ఢిల్లీ)లోనే మొట్టమొదటి సారి ఖురాన్ ను ఉర్దూలోకి అనువాదం చేశాడు.
ఆ కాలంలో అధికారం చెలాయిస్తున్న ఉలేమాలందరూ ఆయన మీద ఫత్వా విడుదల చేశారు.
పవిత్ర గ్రంథాన్ని అలగా జనం భాషలోకి అనువాదం చేయడం దైవ ద్రోహం అన్నారు.
రామచరిత మానస్ రాసి బహిష్కరణకు గురైన తర్వాత తులసీదాస్ నాలుగు పాదాల పద్యం ఒకటి రాశాడు.
“ధుత్ కహో అవధుత్ కహో రాజ్ పుత్ కహో కి జులావా కహు కోహూకి బేటీ సే బేటా నా బియాహబ్ కోహూకి జాత్ బిగాడ్ నా చాహు మాంగ్ కే ఖైబో మహజిద్ మే రైబో లేబేకో ఏక్ నా దేబే కా దోహు”
మరొక వైపు రామాయణ టెలివిజన్ సీరియల్ తయారు చేసి రామానంద్ సాగర్ కోట్ల రూపాయలు ఆర్జించాడు.
నేనేమీ ఆయనను చిన్నబుచ్చడం లేదు. కానీ, ఈ మొత్తంలో ఆయన అట్టడుగు స్థాయిలో ఉన్నాడని మాత్రం చెప్పక తప్పదు.
మరొక ఉదాహరణ చెప్తాను. బహుశా అది మరింత ప్రత్యక్షమైనదీ, మరింత ఉచితమైనదీ కావచ్చు.
గౌతముడు రాజాంతపురాన్ని వదిలి అడవిలోకి వెళ్ళింది సత్యాన్ని అన్వేషించడానికి. కానీ ఇవాల్టి రోజుల్లో మీరు చూస్తే ఈ ఆధునిక కాలపు గురువులు అడవుల్లో నుంచి బయటకు వచ్చి రాజప్రాసాదాలలో చేరిపోతున్నారు. వీళ్ళు పూర్తిగా ప్రతికూల దిశలో నడుస్తున్నారు. కనుక గౌతముడు గురించీ, వీళ్ళ గురించీ ఒకేలాగా మాట్లాడలేం.
అందువల్ల భారతీయులందరికీ ప్రియమైన, గౌరవనీయమైన పేర్ల వెనుక దాక్కొన విషయాలు మాట్లాడాలి. నన్నిక్కడ మాట్లాడమని ఆహ్వానించినపుడు నేను నాస్తికున్శి కదా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా హేతుబద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తాను కదా, అందుకే నన్నిక్కడకు పిలిచారా అనుకున్నాను. కానీ హఠాత్తుగా నాకు ఇంకో విషయం తట్టింది. ఆధునిక కాలపు గురువులకూ, నాకూ ఒక సమాన గుణం ఉంది.
నేను సినిమాల్లో పనిచేస్తాను. వాళ్ళకూ నాకూ ఉమ్మడి అంశం ఏమిటంటే మేమిద్దరమూ కూడా కలలు అమ్ముతాం.
ఇద్దరమూ కూడా భ్రమలను సృష్టిస్తాం.
ఇద్దరమూ విగ్రహాలను తయారు చేస్తాం.
ఒక చిన్న తేడా మాత్రం ఉంది. మూడు గంటలు గడవగానే మా కలలు అమ్మకం ఆపేసి శుభం అని కార్డు వేసి వాస్తవికతలోకి వెళ్ళిపోండి అని జనాన్ని పంపించేస్తాం.
అయితే
ఈ గురువులు మాత్రం అలా ఎప్పటికీ పంపరు.
కనుక ఇక్కడ ఇవాళ ప్రపంచపు సూపర్ మార్కెట్లో ఒక అమ్మకపు వస్తువుగా మారిపోయిన ఆథ్యాత్మికత గురించి మాట్లాడడానికే నేనిక్కడ నిలబడ్డానని స్పష్టం చేయదలిచాను.
ఇవాళ ప్రపంచంలో మూడు పెద్ద భారీ వ్యాపార వస్తువులు ఉన్నాయి. యుద్ధ ఆయుధాలు, మాదకద్రవ్యాలు, ఆధ్యాత్మికత. అయితే ఆయుధాలలోనూ, మాదకద్రవ్యాలలోనూ మీరు ఎంతో కొంత చేయాలి. ఏదో ఒకటి ఇవ్వాలి. తేడా ఏమంటే ఆథ్యాత్మికతలో మాత్రం మీరేమీ ఇవ్వనక్కరలేదు.
ఈ సూపర్ మార్కెట్ లో మీకు అడిగిన వెంటనే నిర్వాణం దొరుకుతుంది. మెయిల్ లో మీకు మోక్షం చేరుతుంది. ఆత్మ సాక్షాత్కారంలో క్రాష్ కోర్సు ఉంటుంది. నాలుగు సులభ పాఠాలలో విశ్వచైతన్యం అందుతుంది.
ఈ ఆధ్యాత్మిక గురువుల సూపర్ మార్కెట్ కు ప్రపంచ వ్యాప్తంగా గొలుసు దుకాణాలు ఉన్నాయి. ఆ దుకాణాలలో అశాంతి నిండిన ఉన్నత వర్గాలూ, సంపన్న వర్గాలూ ఆథ్యాత్మికత ఫాస్ట్ ఫుడ్ కొనుక్కుని తింటూనే ఉంటాయి. నేనిప్పుడు ఈ ఆథ్యాత్మికత గురించి మాట్లాడదలిచాను.
ప్లేటో సంభాషణల్లో ఆయన చాలా విలువైన విషయాలు ఎన్నో చెప్పాడు. వాటిలో ఒకటి ఏమంటే, ‘మీరు ఏదైనా చర్చ ప్రారంభించే ముందు మీరు వాడుతున్న పదాలు అర్థం ఏమిటో నిర్ణయించుకోండి’ అని.
మరి మనం కూడా ఇప్పుడు ఈ ఆథ్యాత్మికత అనే పదం అర్థం ఏమిటో నిర్ణయించుకుందాం.
ఆ పదానికి అన్ని మతాలనూ, కులాలనూ, ముఠాలనూ, జాతులనూ అధిగమించి సంపూర్ణంగా మానవజాతి పట్ల ప్రేమ అనే అర్థం ఉంటుందా? అలా ఉంటే నాకేమీ సమస్య లేదు. కాకపోతే, దాన్ని నేను ఆథ్యాత్మికతా అనే బదులు మానవత అంటాను.
లేదా, దానికి అర్థం మొక్కలనూ, చెట్లనూ, కొండలనూ, సముద్రాలనూ, నదులనూ, జంతువులనూ ప్రేమగా చూడడం అనా? అంటే, మానవేతర ప్రపంచం పట్ల దయ కలిగి ఉండడమనా? ఒకవేళ అదయినా నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే దాన్ని నేను ఆధ్యాత్మికత అనను.
పర్యావరణ స్పృహ అంటాను. లేదా, వివాహం, మాతృత్వం, పితృత్వం, లలిత కళలు, న్యాయవ్యవస్థ, భావప్రకటనా స్వేచ్ఛ వంటి సామాజిక సంస్థలను హృదయపూర్వకంగా గౌరవించడమే ఆథ్యాత్మికత అనే మాటకు అర్థమా?
అయ్యా, అప్పుడు కూడా నాకేమీ సమస్య లేదు.
అసలు నాకు అనంగీకారం తెలిపే అవకాశమే లేదు.
కానీ, నేను దాన్ని పౌర బాధ్యత అంటాను.
లేదూ ఆథ్యాత్మికత అంటే మీ లోకంలోకి మీరు వెళ్ళిపోయి, మీ సొంత జీవితపు అర్థం ఏమిటో అన్వేషించే ప్రయత్నం చేయడమా?
దానికి ఎవరు అడ్డు చెపుతారు?
కానీ దాన్ని నేను ఆత్మపరిశీలన, ఆత్మ పరీక్ష అనుకుంటాను.
లేదూ ఆధ్యాత్మికత అంటే యోగం అని అర్థం చెపుతున్నారా?
గౌరవనీయుడైన పతంజలి యోగ శాస్త్రానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి.
ఆయన యోగం, యమ, యతమ, ఆసన, ప్రాణాయామ వంటి వివరాలు ఎన్నో మనకందించాడు. వాటికి మనం ఇవ్వాళ ఏ పేరైన పెట్టుకోవచ్చు. కానీ ప్రాణాయామం చేస్తే చాలా బాగుంటుంది. దాన్ని నేను ఆరోగ్య పరిరక్షణ, శారీరక దృఢత్వం అంటాను.
ఇదంతా పదాల గారడీగా కనిపిస్తుందా?
ఒకవేళ ఇదే ఆథ్యాత్మికత అయితే ఇక చర్చకు అవకాశమేముంది?
నేను వాడిన పదలూ,అర్థాలూ అన్నీ కూడా సంపూర్ణంగా గౌరవించదగినవి. ఆమోదించదగినవి.వాటిలో అమూర్తమైనదేదీ లేదు. మన చూపులకు అందనిదేది లేదు.
మరి ఆథ్యాత్మికత అనే మాట పట్టుకుని ఎందుకంతగా వేళ్ళాడుతున్నారు? నేను చెప్పిన మాటలలో వ్యక్తం కాని ఏ భావాన్ని ఈ ఆథ్యాత్మికత అనే మాట సూచిస్తోంది? ఆలోచించండి. నేను చెప్పినవి కాకుండా ఇంకా ఏమైనా ఉందా? ఉన్నట్టయితే అది ఏమిటి?
ఆ మాట వాడినంత మాత్రాన నీకు వచ్చిన సమస్య ఏమిటి అని ఎవరైనా నన్ను ఎదురు ప్రశ్నించవచ్చు. ఆ మాటను మార్చమనీ, ఒదిలేయమనీ, పారేయ్యమనీ, దానికి కాలం చెల్లిందనీ అంటున్నాను.
ఎందుకు? నా అభ్యంతరం ఏమిటో చెపుతాను. ఆథ్యాత్మికత అంటే అర్థాలు నేను చెప్పినవే అయితే చర్చకు అవకాశమే లేదు. కానీ నన్ను ఇబ్బంది పెట్టే అంశం మరొకటి ఉంది. ఏ నిఘంటువు అయినా తెరిచి చూడండి.
ఆథ్యాత్మికత అనే మాట ఆత్మ అనే మాట నుంచి పుట్టింది.
మానవజాతికి ఈ భూగోళం గుండ్రంగా ఉందా, బల్లపరుపుగా ఉందా తెలియనప్పుడు మనుషులు తమను తాము రెండు అంశాల సమ్మేళనంగా ఊహించుకున్నారు.
ఒకటి శరీరం… మరొకటి ఆత్మ.
శరీరం అనేది తాత్కాలికమనీ, అది మరణిస్తుందనీ, కానీ ఆత్మ అనేది ఎన్నటికీ నాశనం లేనిదని ఊహించుకున్నారు.
మీ శరీరం లోపల మీకొక కాలేయం ఉంది. ఒక గుండె ఉంది. పేగుల చుట్ట ఉంది. ఒక మెదడు ఉంది. ఈ మెదడు అనేది శరీరంలో భాగం కనుక, మనస్సు అనేది మెదడు వల్ల తయారవుతున్నది కనుక, ఇవన్నీ తక్కువ జాతివే అని వాళ్ళనుకున్నారు.
శరీరంతో పాటు చివరికి మెదడు కూడా చచ్చిపోతుందని వాళ్ళు తెలుసుకున్నారు. కానీ, భయం లేదు.
మీరు ఎప్పటికీ చచ్చిపోరు. ఎందుకంటే,మీరంటే మీ ఆత్మ. ఆ ఆత్మ ఒక అత్యున్నత చైతన్యంతో ఎల్లకాలానికి నిలిచి ఉంటుంది. మీకు వచ్చే సమస్యలన్నీ మీ మనస్సు చెప్పే మాటలు వినడం వల్ల వస్తున్నాయి. మనస్సు చెప్పే మాటలను వినడం మానెయ్యండి.
ఆత్మ చెప్పే మాటలు వినండి.
ఆ అత్యున్నత చైతన్యానికి విశ్వ సత్యం అవగాహనలో ఉంటుంది….. ఇదీ కథ.
***
నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక దృష్టి ఉన్న, మత దృష్టి ఉన్న ప్రజల పట్ల నాకు చాలా గౌరవం ఉంది.
వాళ్ళు మంచి వాళ్ళు.
ఒక కారణం కూడా చెప్పాలి.
ప్రతి ఉద్వేగానికీ, ప్రతి అనుభూతికీ ఉన్నట్టుగానే దీనికి కూడా ఒక పరిమితి ఉంది.
ఎవరైనా ఒక అంశం చూడగలరు.
ఆ తర్వాత చూడలేరు. ఒక అంశం వరకు వినగలరు. ఆ తర్వాత ఏ శబ్దాన్నీ గ్రహించలేరు. ఒకానొక సమయం వరకు దుఃఖించగలరు.
క్రమంగా ఆ దుఃఖాన్ని అధిగమిస్తారు.
ఒకానొక స్థితి వరకే సంతోషాన్ని అనుభవించగలరు.
ఆ తర్వాత సంతోషం కూడా అయిపోతుంది.
సరిగ్గా అట్లాగే, ఎవరికైనా మంచితనానికి కూడా ఒక నిర్మితమైన శక్తే ఉంటుంది.
మీరు ఒక స్థాయి వరకే మంచివాళ్ళుగా ఉండగలరు.
మనిషిలో ఈ మంచితనపు సామర్థ్యం సగటున పది యూనిట్లు ఉంటుందనుకుంటే ఆ మంచితనపు సామర్థ్యం మొత్తాన్ని …..
అటు మసీదుకు వెళ్ళి రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేసే వారైనా,
ఇటు గుడికి వెళ్ళో,
లేదా
గురువు పాదాల దగ్గరో కూచూనే వాళ్లయినా …..
పూర్తిగా ఖర్చు పెట్టేస్తున్నారని నాకనిపిస్తుంది.
అదంతా కూడా అనుత్పాదమైన పద్ధతిలో ఖర్చు పెడుతున్నారనిపిస్తుంది.
( అంటే మానవుడికి ఉపయోగపడే వాటిని ఉత్పత్తి చేయని వ్యర్ధమైన రీతిలో ఖర్చు పెడుతున్నారు)
నేనెక్కడా ప్రార్థనలు చేయను.
నేను ఏ గురువు దగ్గరకీ వెళ్లను.
మసీదుకో, గుడికో, చర్చికో వెళ్లను.
అప్పుడు నా మంచితనపు సామర్థ్యాన్ని నేను ఏం చేస్తాను?
బహుశా ఆ మంచితనపు సామర్థ్యంతో నేను మరోకరికి సాయపడతాను.
మరొకరికి తిండి పెడతాను. మరొకరికి ఆశ్రయం ఇస్తాను.
మనుషులు తమలో ఉన్న మంచితనపు సామర్థ్యాన్ని.. పూజలో,
ప్రార్థనలో,
మత విగ్రహాలను ఆరాధించడంలో ,
ఆథ్యాత్మిక గురువులను కొలవడంలో…ఇలా
ఖర్చు పెట్టే బదులు,
ఆ మంచితనాన్ని మిగుల్చుకుని దాన్ని మరొకందుకు వాడితే వాళ్ళకు నా అభినందనలు.
( సి.నా.రె గారు అన్నట్లు
“పరుల మేలు కొరకు పాటు పడని నరుల బ్రతుకు దేనికని….
మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికనీ……..
…………………………….)
మతానికి చెందిన మనుషులు పట్ల… ఇటువంటి భావాలు ఉన్నప్పుడు…..
నాకు కాబీర్ మీదనో, గౌతముడి మీదనో
అంత గౌరవం ఎలా ఉందని మీరు అడగవచ్చు.
వాళ్ళను నేనెందుకు గౌరవిస్తానో చెపుతాను.
వాళ్ళందరూ మానవ నాగరికతా చరిత్రలో మానవత్వం వైపు మనుషుల ఆలోచనలను మల్లించడంలో గొప్ప దోహదం చేసినవాళ్ళు.
చరిత్రలో వేరు వేరు కాలాల్లో, వేరు వేరు పరిస్థితులలో వాళ్ళు జీవించారు.
వాళ్ళందరి మధ్య ఒకే ఉమ్మడి సూత్రం ఉంది.
వాళ్ళు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డారు.
“వాళ్ళు అట్టడుగు ప్రజల కోసం పోరాడారు. పాలకులు ఎవరైనా వారు చక్రవర్తులైనా, సామ్రాజ్యవాదులైనా వ్యతిరేకంగా పోరాడారు.”
కబీర్ ఫిరోజ్ తుగ్లక్ మతోన్మాద రాజ్య ఆధిపత్యాన్ని ఎదుర్కొని పోరాడాడు.
నాకు ఆశ్చర్యం కలిగించేదీ, నా అనుమానాలను నిజం చేసేది ఏమంటే
“ఇవాళ తమను తాము మతాధిపతులమని చెప్పుకునే వాళ్ళు, విశ్వసత్యం తమకు మాత్రమే గ్రహింపుకు వచ్చిందని అనేవాళ్ళు.. … ఒక్కరు కూడా అధికారానికి వ్యతిరేకంగా నిలబడడం లేదు.
పాలకవర్గాలకూ, సంపన్న వర్గాలకూ వ్యతిరేకంగా వీళ్లలో ఒక్కరు కూడా గొంతెత్తడం లేదు. వీళ్ళు ధర్మం చేస్తారు. నిజమే. కానీ,అధిపత్య వ్యవస్థా, అధికారంలో ఉన్నవారు అంగీకరించినంత వరకే ఆ ధర్మం సాగుతుంది. ఇవాళ్టికి దళితులకు ప్రవేశం లేని దేవాలయాలలోకి వారిని నడిపించుకు వెళ్ళగలిగిన ఆథ్యాత్మిక గురువులు ఎవరైనా ఉన్నారా ” అని నా ప్రశ్న.
“దురాక్రమణదారులకూ,బడా కాంట్రాక్టర్లకూ వ్యతిరేకంగా పోరాడుతున్న ఆదివాసుల హక్కుల కొరకు నిలబడే ఆథ్యాత్మిక గురువులు ఎవరైనా ఉన్నారా ”
అని నా ప్రశ్న.
“గుజరాత్ మారణకాండకు బలి అయిన వారికోసం మాట్లాడిన, బాధితుల సహాయ శిబిరానికి వెళ్ళిన గురువు ఎవరైనా ఉన్నారా ”
అని నా ప్రశ్న.
ధనికులకు ఉఛ్వాసనిశ్వాసలు బోధించినంత మాత్రాన సరిపోదు.
అవి కేవలం సంపన్నుల వినోద క్రీడ.
ఇది కుటిలవాదుల మేలి ముసుగు.
ఇది దుర్మార్గమైన వంచన.
ఈ దుర్మార్గమైన వంచనను మీరు ఏ నిఘంటువులో చూసినా ఆథ్యాత్మికత అని పిలవలేరు.
దానికి ఉన్నది ఒకే ఒక్క మాట( పర్యాయపదం) బూటకం.
ఉంటాను. మీకందరికీ నా అభినందనలు మరియు కృతజ్ఞతలు….
( The speech by Javed Akhtar on Spirituatlity is available at Speakingtree)
(జావేద్ నాటక రచయిత, హిందీ సినిమాకు వేల పాటలను, మాటలను అందించాడు. ఆయన బహు భాషా నటి, షబానా ఆజ్మీ భర్త,షబానా ఆజ్మీ ప్రముఖ ఉర్దూ కవి కైఫీ ఆజ్మీ కూతురు.)