పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

బోర్డు పరీక్షలను రద్దు చేయకుండా  నాన్చు డు దోరణి ప్రదర్శిస్తున్నందుకు నిన్న సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెన్త్ , ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది.

నిన్న ఈ విషయంలో సుప్రీంకోర్టు లో చర్చకు వచ్చింది. దేశంలో  20 రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను నిర్వహించాలనే పట్టుబట్టింది. సుమారు అయిదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షలను సురక్షితంగా నిర్వహిస్తామన్న ఆంధ్రప్రదేశ్ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు.

పరీక్షలవల్ల ఏ విద్యార్థికి హాని జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సమీక్షించారు. చివరకు పరీక్షలను రద్దుచేయాలనే నిర్ణయించారు.

ఈ విషయాన్ని  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్  వెల్లడించారు.

ఇది కూడా చదవండి

*ఇంటర్ పరీక్షల నిర్వహణ: ఆంధ్ర మీద సుప్రీంకోర్టు అసంతృప్తి

ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం లోపం లేదని, అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రయత్నించామని చెబుతూ  సుప్రీంకోర్టు సూచన మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రకటించారు.

విద్యార్థులు నష్ట పోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు లోగా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని, జులై 31 లోపే ఫలితాలు ప్రకటించాలని చెబుతున్నది. ఇది ఆచరణలో కష్టం. ఎందుకంటే, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు 45 రోజుల సమయం పడుతోంది.

అందువల్ల సుప్రీం చెప్పిన విధంగా వచ్చే నెల 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని భావిస్తున్నామని ఆయన చెప్పారు.

టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు ఎలా ఇవ్వాలన్న దానిపై విధివిధానాల రూపకల్పనకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇతర బోర్డు పరీక్షల రద్దుతో మన విద్యార్థులకు నష్టం జరగదని భావిస్తున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *