ఉన్నట్లుండి ఆంధ్ర, తెలంగాణల మధ్య జలయుద్ధం మొదలయింది. నువ్వు దొగ్గంటే, కాదు నువ్వే దొంగ అని రెండు రాష్ట్రాలు అరుచుకుంటున్నాయి. ఆంధ్ర కడుతున్న ప్రాజక్టులన్నీ అక్రమం అని తెలంగాణ అంటే, తెలంగాణలో కడుతున్న ప్రాజక్టుల్లో వేటీకి అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని, అవేవి సక్రమం కాదు అని ఆంధ్రా వాదిస్తున్నది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్టు వస్తే, నాలుగు జిల్లాలు ఎడారి అని తెలంగాణ అపుడే అనడం మొదలుపెట్టింది. ఈ మెరుపుదాడి ఆంధ్రలో కలవరం సృష్టిస్తున్నది. “రాయలసీమ లిప్ట్ ఇప్పటిదికాదు, అది కడుతున్న ట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెలుసు. దానిని ప్లాన్ చేశాక కూడా వారు శుభకాంక్షలు చెప్పకున్నారు, ఇఫ్తార్ విందు ఆరగించారు. కాళేశ్వరం ప్రారంభోత్సంలో కలుసుకున్నారు. ఇపుడు మళ్లీ గొడవేంది?,” అని ఆంధ్రలో , ముఖ్యంగా నీళ్లకోసం నానా కష్టాలు పడుతున్న రాయలసీమలో ప్రజలు ఆశ్చర్య పోతున్నారు.
వచ్చే నెలలలో ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోబోతున్నదని వేరే చెపాల్సిన పనిలేదు. ఆంధ్ర కంటే తెలంగాణ ప్రభుత్వం రెచ్చిపోయే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రభుత్వాన్ని, జగన్ ని, ఉమ్మడి ప్రదేశ్ పాలకులను, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విధానాలను, చంద్రబాబు విధానాలను తీవ్రాతితీవ్రంగా చీల్చి చెండాడే అవకాశం కనిపిస్తూ ఉంది.
ఇదెందుకు మొదలయిందో కనుగొనేందుకు పెద్ద రాజకీయ విజ్ఞానం అవసరం లేదు. కర్నూలు జిల్లాలో కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్టు మీద ఉన్నట్లుండి తెలంగాణ భగ్గుమనడంలో చిదంబర రహస్యమేమీ లేదు. చిన్న ఉప ఎన్నిక వ్యూహం, హుజూరా బాద్ ఉప ఎన్నిక వ్యూహం ఉందని ఆంధ్రలో చర్చ మొదలయింది. ఇదంతా ఈటెల ఎఫెక్ట్ (Eatela Effect) అని పరిశీలకులు చెబుతున్నారు.
జగన్ జలదోపిడి మొన్న ఆర్థరాత్రే కనుగొన్నట్లు కెసిఆర్ ప్రభ
త్వం దొంగ..దొంగ అని అరుస్తూ ఉంది. వారం రోజుల కిందట క్యాబినెట్ లో జగన్ ప్రభుత్వం కడుతున్న ప్రాజక్టులను అక్రమం అని తీర్మానించడంతో ఈ రభస మొదలయింది. ఈ రభస హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగమే.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారాన్నిపవర్ ఫుల్ ఆంధ్ర వ్యతిరేక సెంటిమెంట్ తో కెసిఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్ ప్రాజక్టుల మీద తెలంగాణాలో చాలా ఉద్రిక్తత ఏర్పడుతుంది. జగన్ దిష్టి బొమ్మలు తగల బెట్టవచ్చు. ప్రదర్శనలు జరగవచ్చు. కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లవచ్చు. ఈ ప్రాజక్టులు ఆపేయండిని కృష్ణబోర్డు విజ్ఞప్తి చేయవచ్చు. కోర్టులో పిటిషన్లు వేయవచ్చు. టివిల్లో పెద్ద ఎత్తున చర్చలు జరపవచ్చు. హుజూరాబాద్ నోటిఫికేఫన్ నాటికి జలవివాదం ముదరవచ్చు. తెలంగాణ లో సహజంగానే జలవివాదం ఈజీగా రగులుకుటుంది.
అపుడే వ్యక్తి గత విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ బాధ్యతలను మంత్రులకు అప్పగించేశారు. మంత్రులు మెల్లిగా స్వరం పెంచుతున్నారు. ఆంధ్రాని కవ్విస్తున్నారు.
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి నిన్న బాగా ఆవేశవపడ్డారు. ఆంధ్రతో జలయుద్ధం తప్పదు అని నిక్కచ్చిగా ప్రటించారు. ఈ ప్రకటనకి కృష్ణా ప్రాజక్టులు తయారవుతున్న పాత మహబూబ్ నగర్ జిల్లాను ఆయన ఎంచుకున్నారు. ఇక్కడి దివిటిపల్లిలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడుతూ ఉందని, దీనితో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల గొంతెండిపోతుందని హెచ్చరించారు.
ఇంకా నాలుగడుగులు ముందుకు పోయి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘నీటి దొంగ’ అని చప్పట్ల మధ్య విమర్శించారు. “వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్న ‘నీటి దొంగ’ అయితే, ఇప్పటి ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి నీటి గజదొంగ,’అన్నారు. జగన్ మోహన్ రెడ్డి మారిన మనిషి అనుకున్నాం,కాని ఆయన తెలంగాణ నీళ్లుకొల్లగొడుతున్నారు. ‘ఆంధ్ర నాయకుల వల్ల ఎప్పటికీ తెలంగాణ కు ముప్పే’అని ప్రకటించారు.
తెలంగాణలో మొదలయిన ఈ అకస్మిక ‘జగన్ జలదోపిడి’ క్యాంపెయిన్ కు సమాధానమిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈ నెల 30 న సమావేశమవుతూ ఉంది.
తన మీద, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద వ్యక్తిగతంగా దూషణలు మొదలు పెట్టినందున జగన్ ఈ వ్యవహారంలో మౌనంగా ఉంటారనుకోలేం. కచ్చితంగా ఆయన కూడా రెచ్చిపోవచ్చు. ఆంధ్రమంత్రులను సహజంగా వాగ్యుద్ధానికి ఉసికొల్పవచ్చు. టిఆర్ ఎస్ కు కావలసింది కూడా అదే.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిన్ననో మొన్ననో జగన్ శంకుస్థాపన చేయలేదు. ఒక ఏడాది కాలంగా అది సాగుతూనే ఉండి ఉండాలి. కాకపోతే, ఇపుడు ఈటెల ఎఫెక్ట్ (Eatela Effect) వల్ల ఆంధ్రాని గిల్లుకొని కయ్యానికి కవ్వించాల్సి వస్తున్నది. ఆంధ్రానికి గిల్లుకునేందుకు రాయలసీమ లిఫ్ట్ బ్రహ్మాస్త్రం. ఎందుకంటే, రాయలసీమలో కృష్ణా జాలాలనే మాట వినబడితే సీమలో ఆవేశం పొంగుతుంది. అందువల్ల ఇష్యూని చర్చలో కంటిన్యూచేయవచ్చు.
ఈటెల ఎఫెక్ట్
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపిలో చేరిన మూడు నాలుగు రోజులకే తెలంగాణ క్యాబినెట్ ఆంధ్ర మీద ‘జలదోపిడి’ అస్త్రం ప్రయోగించింది. ఆంధ్ర ప్రాజక్టులను ఆపేయాలంది. ఆపేయకుంటే ఊరుకోం అంది. ఎందుకింత ఆగ్రహం?
ఇది కూడా చదవండి
*కెసిఆర్ – జగన్ కు ఇప్పుడే ఎందుకు బెడిసింది?
*జగన్ సర్కారు పై మండి పడ్డ తెలంగాణా కేబినెట్
ఇది హూజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని హైజాక్ చేసేందుకే అనిపిస్తుంది. అభివద్ధి, రైతుబంధులే ఉప ఎన్నికల్లో గెలిపిస్తాయన్న గ్యారంటీ లేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపుతో అది రుజువయింది. కాబట్టి ఉప ఎన్నిక రూలింగ్ పార్టీకే అనుకూలిస్తుందనుకోవడానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. నాగార్జున సాగర్ లో బిజెపి అభ్యర్థి బాగా బలహీనం. అయినా సరే, ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా రంగంలోకి దూకి, కరోనా ను లెక్క చేయకుండా క్యాంపెయిన్ చేసి, రెండు బహిరంగ సభల్లో మాట్లాడి హంగామా చేసి గెలవాల్సి వచ్చింది. ఇపుడు హుజూరాబాద్ కచ్చితంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలాగా ఉండదు. ఈటెల ను మూడుసార్లు అత్యధిక మెజారిటీతో గెలిపించిన హుజూరాబాద్ ను లాక్కోవడం అంత సులభం కాదు. ఎందుకంటే ఈటెల , నాగర్జున సాగర్ లోనిలబడిన బిజెపి అభ్యర్థి పి రవికుమార్ వంటి సాదాసీదా అభ్యర్జి కాదు. బిజెపి నేత గా మారిన ఈటెలకు అక్కడ సొంతబలం ఉంది. కులం ఉంది. అనుచర వర్గం ఉంది. ముఖ్యంగా సమృద్ధిగా ధనం కూడా ఉంది. నాయకత్వ లక్షణలున్నాయి. కెసిఆర్ లాగా మాటల తూటాల పేల్చగలశక్తి ఉంది. రాజకీయానుభవం ఉంది.కెసిఆర్ వూహాలను దగ్గిర నుంచి చూశారు కాబట్టి అప్రమత్తంగా ఉండగలరు. అందువల్ల హుజూరాబాద్ ఉప ఎన్నిక టిఆర్ ఎస్ కు చెమటలు పట్టిస్తుంది.
ఈ ఎన్నిక ఈటెల కు కీలకమయిందే. అది ఆయన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అదే విధంగా కెసిఆర్ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ప్రాబల్యమేమిటో చెబుతుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే, ఈటెల కోలుకోవడం కష్టం. అదే విధంగా హుజూరాబాద్ లో ఓడిపోతే, టిఆర్ ఎస్ నైతికంగా ఓడిపోతుంది.బిజెపి మళ్లీ రెచ్చిపోతుంది.
ఈ ప్రమాదం ఉంది కాబట్టే కెసిఆర్ ఇప్పటి నుంచే ఉప ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అది కూడా ఆంధ్రాని కయ్యానికి కవ్విస్తూ ప్రచారం మొదలుపెట్టారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆంధ్రా వ్యతిరేక సెంటిమెంట్ తో ఉద్రిక్తత సృష్టించి, ఆంధ్రోళ్ల జలదోపిడి నుంచి తెలంగాణను కాపాడాలంటే టిఆర్ ఎస్ ను గెలిపించి తీరాలనే వాతావరణ సృష్టించేందుకు కృషి చేస్తున్నారనే విమర్శ ఆంధ్రలో మొదలయింది.
ఈ సెంటిమెంట్ మంటల నుంచి నుంచి ఉప ఎన్నికల ప్రచారాన్ని ‘కెసిఆర్ కుటుంబ పాలన, అక్రమాలు, అవమానాలు, తెలంగాణ ఆత్మగౌరవం, నిరుద్యోగం’ వైపు మళ్లించి ఈటెల తన వైపు తిప్పుకోగలరా? ఈ సెంటిమెంట్ లో పడిపోయి, ఈటెల తనని తాను బలహీనపర్చుకుంటారా?
జలయుద్ధాన్ని ఎన్నికల తర్వాత కూడా కొనసాగించవచ్చు. అయితే, ఈటెలను దీనిని నుంచి తప్పించుకోగలరా?
అలాకాని, పక్షంలో ‘ఈటెల ఎఫెక్ట్’ టిఆర్ ఎస్ విజయానికి బాట వేస్తుంది. టిఆర్ ఎస్ ట్రాప్ లో పడకుండా దీనిని ఈటెల ఎలా తప్పికొడతారో చూడాలి.