డెల్టా ప్లస్ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్

డెల్టా వేరియంట్ (ఇండియాలో కనిపించిన కరోనావైరస్ వేరియాంట్ B.1.617.2)వారసురాలయిన డెల్టాప్లస్ వేరియాంట్ కరోనా కేసులు  పెరగడం మొదలయింది.  నిన్నటి దాకా 22  మాత్రమే ఉన్న ఈ పాజిటివ్ కేసులు బుధవారం నాటికి 40కి చేరుకున్నాయి. డెల్టాప్లస్ వేరియాంట్ (AY.1) ని భారత ప్రభుత్వం నిన్న రాత్రి ఆందోళన కలిగించే వేరియాంట్ (variant of concern: VoC)అని ప్రకటించింది. ఈ కేసులు మహారాష్ట్ర, కేరళ, మధ్య ప్రదేశ్ లలో కనిపించాయి. ఈ వేరియాంట్ కరోనావైరస్ కు వేగంగా వ్యాప్తి చెందే స్వభావం ఉందని, మనిషి ఉపిరితిత్తుల కణాలకు గట్టిగా అతుక్కునే శక్తి ఉందని, ఇపుడు వేస్తున్న వ్యాక్సిన్ లు సృష్టించే యాంటిబాడీలను తప్పించుకునే శక్తి  ఇది సంతరించుకుందని నిపుణులు అనుమానిస్తున్నారు. భారత ప్రభుత్వం నుంచి ఇది వేరియాంట్ ఆఫ్ కన్సర్న్ అని ప్రకటన వచ్చిన 12 గంటలలోనే వీటి సంఖ్య 40కి చేరుకుంది. ఈ విషయాన్ని ఎఎన్ ఐ వార్త సంస్థ ట్వీట్ చేసింది.

 

 


ఈ వేరియాంట్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని  కేంద్రం మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కేరళ ప్రభుత్వాలను సూచనలిచ్చింది.

నిజానికి మధ్యాహ్నమే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డెల్టాప్లస్ వేరియాంట్ ని కేవలం ఆసక్తిజనకమయిన వేరియాంట్ (Variant of Interest:VoI) అని మాత్రమే చెప్పారు. అయితే, రాత్రికల్లా ఇది మారిపోయి ఆందోళన కలిగించే వేరియాంట్ గా మారింది.

ఒక వైపు రాష్ట్రాలన్నీ లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారు. తెలంగాణ ఏకంగా లాక్ డౌన్ ను ఎత్తేసింది. దేశంలో లాక్డౌన్ ను పూర్తిగా ఎత్తేసిన రాష్ట్రం ఇదే. ఇలా మనుషుల కదలికల మీద ఉన్న ఆంక్షలను సడలిస్తున్నపుడు కేంద్రం డెల్టా ప్లస్ ను VoC గా ప్రకటించడం విశేషం.

దేశంలో ప్రజలందరికి ఇదొక హెచ్చరిక లాంటిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *