సంచలన వార్తలు, సంచలన ఫేక్ వార్తలు మన చుట్టూర ఎక్కువవుతున్నాయి. మీడియాలో డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఎక్స్ ఫర్టులు ఎక్కువైపోయి అన్నివైపుల నుంచి అమాయకులు మీద దాడి చేస్తున్నారు. ఆ మధ్య ఒక డాక్టర్ కరోనా రోగులకు ఒక సలహా ఇచ్చారు: మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి ప్రశాంతంగా ఆరేడు గంటలు నిద్రపో, ఇమ్యూనిటీ పెరుగుతుంది,’ అని. ఈ మధ్య ఎలెకట్రానిక్ మీడియాకు తోడుగా ఫేక్ వార్తల డిజిటల్ చానెళ్లు, యుట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్లు వచ్చి మనుషుల్ని చంపేస్తున్నాయి. సమాజంలోనే కాదు, వ్యక్తిగతంలో మనిషిలో కూడా ఉద్రికత్త, ఆందోళన, భయం పెంచుతున్నాయ్. లెక్క దీస్తే, కరోనా కంటే ఈ టివిలు, సోషల్ మీడియా సృష్టించిన ఉద్రిక్తతల వల్ల చనిపోయినోళ్లే ఎక్కువని తేలుతుంది. ఈ దరిద్రపు పరిస్థితిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ సమావేశంలో మాట్లాడుతూ ముక్కల్లో చక్కటి కథ చెప్పారు. చానెళ్ల మీద ఆయన చెప్పింది నూటికి నూరు పాళ్లు కరెక్టు కాకపోయినా, అందులో వ్యతిరేకించేందుకు ఏమీ కనిపించదు. న్యూస్ చానెళ్ల మీద ఆయన చెప్పిన కథ చదవండి.
‘ఒకడు బ్లాక్ ఫంగస్ అని.. ఇంకోడు ఎల్లో ఫంగస్ అని.. ఇంకోడు వైట్ ఫంగస్ అని చెప్పి చావగొడతరు. ఫంగస్ ఉన్నదో సచ్చిందో కానీ.. సదివి జనం చస్తాండ్రు. మనుషుల సుపీరియర్ థింకింగ్‌ను ఇన్‌ఫీరియర్ చేస్తే కలిగే నష్టాల మీద ఒకాయన పెద్ద బుక్కే రాస్తే నేను చదివిన. దాంట్లో ఓ రాజుగారి కథ రాసిండు.
ఓ రాజ్యంలో ఎనకట గత్తర్ వచ్చి అనేకమంది చచ్చిపోతాండ్రు. ఆ రాజు వైద్యులు ప్రజలను కాపాడుకోవడానికి తిప్పలు పడ్డరు. కానీ సంజయితలేదు. మరి ఎట్లా? గక్కడ దానికి వ్యతిరేకమైన మాంత్రికుడొకడున్నడు సర్.. వాణ్ణి తీసుకొస్తే తరిమేస్తడు సర్.. అని రాజుకు చెప్పిన్రు. వాణ్ణి బతిమాలి బామాలి తోలుకొచ్చిన్రు.. వాడు ఆ రాజ్యం పొలిమేర దాటి వస్తాండు. వీడు వస్తున్నడంటేనే మహమ్మారికి భయం. వీడు ఎంటరయితున్నడు.. అది బయటకు పోతున్నది. ఇద్దరూ ఎదురుపడిన్రు. వీడు.. ‘అనవసరంగా ఐదు వందల మందిని చంపితివి గదే నీ పాడుగాను..’ అన్నడు. అంటే ఆ మహమ్మారి.. ‘అన్నానేను చంపింది యాభై మందినే. 450 మంది దగడుకే చచ్చిపోయిండ్రు’ అని చెప్పిందట.
గత్తర అంటే అర్థం: విక్షనరీ ప్రకారం అర్థ వివరణ
ఉపద్రవము(వాడు చాలా గత్తర పడ్డాడు.) చిందరవందర, అల్లరి
1. కలరావంటి అంటువ్యాధి; ఉపద్రవము. [అనంతపురం; వరంగల్లు; మహబూబ్‌నగర్; నెల్లూరు,మెట్ట; విశాఖపట్టణము]
2. గలబా. [నెల్లూరు] =ఇక్కడ గత్తరగా ఉన్నది.
3. తీరికలేని సమయము. [నెల్లూరు,పొదిలి] = ఈ గత్తరలలోకాదు మరలరా.
4. అదృశ్యం.
ఇండియన్ లాంగ్వేజెస్ ఆన్ లైన్ డిక్షనరీ ప్రకారం
gattara. [Tel.] n. Disorder, disturbance, hubbub. గల్లంతు. Danger ఉపద్రవము. A euphemism for Cholera వాంతిభేది. గత్తరకాడు a noisy man. గత్తరపడ్డ gattara-padda. adj. Confused, troubled.
ఇంత దుష్ప్రచారం చేయడం ఈ టీవీల వాళ్లకు అవసరమా? దాంతో ఏం సాధిస్తరు వీళ్లు? మనకు సమాజం పట్ల బాధ్యత ఉండాలె. ఇప్పుడు చిన్న పొల్లగాళ్లకు వస్తదంటున్నరు. వాళ్లు పంటలేరు. ముందే బడి బందై పిచ్చి పిచ్చి చేస్తన్నరు ఇండ్లపంటి. బడికి పోయొచ్చిండంటే వాడికి దోస్తుంటడు, టీచర్ ఉంటడు.. క్లాసులుంటయి.. ఆడుకుంటడు.. పొద్దు గడుస్తది.
మొత్తానికే బందైతే వాళ్లకు ఏంచేయాల్నో అర్థంకాదు. ఇల్లంత అంగడంగడి చేస్తాన్రు. గిట్ల ఉన్నది కథ. ఇప్పుడు వాళ్లకొస్తదని పెట్టిన్రు. నీకు ఫోన్‌చేసి చెప్పినాది.. ఈ తాప వచ్చి నేను పిల్లలకు పడతానని? ఎవరు చెప్పిన్రు నాకర్థం కాదు. ఇది మంచిది కాదు.
ఇలాంటి విషయాల్లో టీవీల తీరు మారాలి. ఇటీవల చీఫ్ జస్టిస్ రమణను కలిసిన. కరోనా గురించి మాట్లాడుతుంటే ఆయన చెప్పిండు. వాళ్లకు తెలిసిన పిలగానికి కరోనా వచ్చిందని హాస్పిటల్‌లో చేరిండట.
ఏవేవో చెప్పి స్టెరాయిడ్లు ఇచ్చిండ్లట. ఆ పిలగాడు ఇంతదొడ్డు అయిండట. ఎందుకు ఇట్ల చేసుడు? నాకు కరోనా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లిన. జరం తగ్గించడానికి డోలో గోలి, ఒంటికి పడే యాంటిబయాటిక్ గోలి వేసుకోమన్నడు. వారానికోటి డీ విటమిన్ గోలి అని చెప్పిండ్లు. వారంలనే నాకు తగ్గవైంది. దీనికి గన్ని కతలు, భయోత్పాతాలు. ఎవరి ఉపయోగం కోసం టీవీలు ఇట్ల చేసుడు? ప్రజల బతుకులతో ఆడుకునేందుకు సంచలనాలు వద్దు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పాలి. టీవీలలో చూసి జనం బెదిరిపోవుడు ఏంది? ఇప్పటికైనా మారాలి.