తెలంగాణ జాతిపిత జయశంకరే… ఎందుకంటే…

(వడ్డేపల్లి మల్లేశం)

మూడు తరాల ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ఆయన వారధి. తెలంగాణ చివరి అంకం 2001 సంవత్సరంలో రాజకీయ పార్టీ ఏర్పడటంలో సైద్ధాంతిక భూమిక ఏర్పరిచింది ఆయనే. ఆయనలేని తెలంగాణ ఉద్యమాన్ని వూహించలేం.

తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలో అందరికి అర్థమయ్యే భావజాలం రూపొందించిన మేధావి ఆయన.తెలంగాణ ఉద్యమంలో  ప్రతి ఇల్లూ, ప్రతి వ్యక్తి పాల్గొనడమేకాదు, వీధివిధినా, తెలంగాణ జండా ఎగిరేందుకు, తెలంగాణ నినాదం ప్రతి ధ్వనించేందుకు  ఆయన సామాన్యజన భావజాలమే పునాధి. అందుకే రాజకీయనాయకుడు కాకపోయినా, తెలంగాణలో  ఇంటింటికి తెలిసిన పేరు ప్రొఫెసర్ జయశంకర్.

తెలంగాణ రాజకీయ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుండి నుండి ఉద్యామానికి  మూలస్తంభంగా పనిచేసినా తాను కలగన్న ప్రత్యేక  తెలంగాణను చూడకుండానే ఆయన కనుమూశారు.  అయినప్పటికి   తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆయనే.  తెలంగాణ జాతిపిత ఆయనే అని ప్రజలు నమ్ముతున్నారు. నేటికీ కీర్తించబడుతున్నారు.

1952 నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం నుండి 1969 లో తొలి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని 2011 వరకు తెలంగాణ లోటుపాట్లను తెలంగాణకు జరుగుతున్న అవమానాలను తెలంగాణ నష్టపోతున్న విధానాన్ని అనేక సంస్థలను కలుపుకొని పోయే పద్ధతిలో సిద్ధాంతపరమైన పూర్తి అవగాహన కలిగి ఉన్నారు ప్రొఫెసర్ జయ శంకర్.

అవకాశమున్న అన్నిచోట్ల తెలంగాణ ఆవశ్యకతను విప్పి చెప్పి ఆంధ్రా ప్రాంతంలో కూడా జనాన్ని ఒప్పించి చనిపోయే వరకు ఆయన తెలంగాణ  గురించే కలలు కన్నారు. కలలను నిజం చేసేందుకు కృషి చేశారు.

జేఏసీ ఏర్పాటు, విద్యావంతుల వేదిక ల ద్వారా అనేక సభలు సమావేశాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి తాను సూత్రీకరించిన తెలంగాణ సిద్ధాంతాన్ని ఆచరించి చూపినాడు. కనుక జయశంకర్  తెలంగాణ సిద్ధాంతకర్త అయ్యారు.

వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో మహాలక్ష్మి, లక్ష్మీ కాంతారావు గారలకు1 934 ఆగస్టు 6వ తేదీన జన్మించినారు. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలో జరగగా ఉన్నత విద్య బెనారస్ అలీగడ్ విశ్వవిద్యాలయాలలో పూర్తిచేసుకుని డాక్టరేట్ పట్టాను ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా పొందారు. 1960లో ఉపాధ్యాయుడుగా నియామకమైన వీరు లెక్చరర్ గా ప్రిన్సిపాల్ గా వివిధ హోదాలలో పనిచేసి 79 నుండి 81 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా, 1991 నుంచి 94 వరకు అదే విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందినారు. ఉద్యోగం చేస్తూ కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అవమానాలను ఎప్పటికప్పుడు ఉద్యమానికి అందించేవారు.

జయశంకర్  ఉద్యమ భావజాలం

పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా తెలంగాణది అన్న కాళోజీ మాటలను నిజం చేస్తూ ఆద్యంతము తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే బ్రతికిన జయశంకర్  సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన
ప్రజాస్వామికవాది.

కనుకనే జూన్ 2011 21వ తేదీన తెలంగాణ కళ్లారా చూడకుండా అర్ధాంతరంగా అసువులు బాసినా వారి స్ఫూర్తితోనే తెలంగాణ స్వరాష్ట్ర మై గెలిచి నిలిచింది. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమని నమ్మిన జయశంకర్  ఆర్ ఎస్ ఎస్ నుండి ఆర్ ఎస్ యు వరకు అన్ని రకాల సంస్థలు సంఘాలతో కలిసి పని చేసి అందరిలో స్ఫూర్తిని నింపి ఉద్యమాన్ని నడిపినాడు.

సాధారణ ప్రజలే
తెలంగాణ సాధనకు కార్యక్షేత్రం అని నమ్మి నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం తెలంగాణ ప్రజలకు దక్కాలని ఆశించాడు. కనుకనే అంబేద్కర్ బోధించిన అధ్యయనము, సమీకరణ ,పోరాటము అనే అంశాలను తెలంగాణ ఉద్యమానికి జయశంకర్  అన్వయించి ప్రపంచ స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి విశిష్టమైన స్థానాన్ని పదిల పరిచారు.

తన పుట్టిన ఊరు గూర్చిన చిన్ననాటి జ్ఞాపకాలను తన అనుభవాలను వివిద్యాసందర్భాలలో మిత్రులకు ఉద్యమ సందర్భంలో విప్పి చెప్పిన జయశంకర్  పోరాటాన్ని తన జీవన గమనం గా చేసుకుని ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని నియంతృత్వం పనికిరాదని ప్రజల భాషలోనే నిర్వచనం చెప్పిన ప్రజాస్వామికవాదిగా
నిరంతరము తెలంగాణ ఉద్యమానికి తన పదునైన ఆలోచనతో ఊపిరిలూది జీవం పోశారు.

అనేక సంవత్సరాల తన అనుభవం కు అధ్యయనము, పరిశీలనను, అన్వయించి విద్యావంతుల లోనే కాకుండా ఊరూరా, వాడవాడలా ఉద్యమ భావజాల విత్తులు చల్లిన పోరాటయోధుడు.

తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం నినాదం కాదని దీనికి ఒక చారిత్రక నేపథ్యం, దీని వెనుక సాంస్కృతిక, సామాజిక కోణం దాగి ఉందని అన్ని వర్గాల ప్రజలు చైతన్యవంతులై తేనే, తెలంగాణ ప్రాంత ప్రజల సామూహిక డిమాండ్ గా ఉంటేనే ఇది సాధ్యం అవుతుందని భావించేవారు.

తెలంగాణ గురించి వందల ప్రశ్నలకు తానొక్కడినే సమాధానం అని చాలెంజ్ చేసేవారు. తెలంగాణకు జరిగిన అవమానాలకు తను సాక్షిగా ఉండడమే గాక బాధ్యత కూడావహించి వివాహాన్ని సైతం ప్రక్కనబెట్టారు.

తెలంగాణ సాధన గురించి వీరి ప్రత్యేక భావన

తెలంగాణ వచ్చేదాకా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాలు రాష్ట్ర సాధన కోసం కలిసి పనిచేయాలని తెలంగాణ వచ్చినంక
అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని తరచుగా జయశంకర్  చెప్పేవారని 2009 నుండి తెలంగాణ జేఏసీ కిసారథ్యం వహించిన ప్రొఫెసర్ కోదండరామ్  తన మనసులోని మాట విప్పి
చెప్పారు.

అంతేకాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఆకాంక్షలు ,అభివృద్ధి విషయంలో ప్రభుత్వంతో సక్రమమార్గంలో పని చేయించాలని ఆ బాధ్యత విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీ వంటి సంస్థల పై బలంగా ఉంటుందని ఆయన అన్నట్లు కోదండరామ్  చెప్పారు.

అంతేకాకుండా గ్రామీణ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది అని వివిధ కుల వృత్తుల వారు పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ కారణంగా ఆర్థికంగా ధ్వంసమై పేదరికం వైపు నెట్టబడ్డారు అని తెలంగాణ సాధన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాలని కూడా తరచుగా చెప్పేవారు.

జయశంకర్ ఉద్యమ కార్యాచరణ, అనుభవాలు- సంఘటనలు

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన దోపిడీపై ప్రశ్నించిన జయశంకర్  తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, ఆశయంగా 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరడానికి కారణమైన వ్యక్తి గా ఉద్యమ కార్యాచరణకు ,సిద్ధాంత అవగాహనకు తన జీవితాన్ని ధారపోసినాడ నడంలో
సందేహం లేదు. 1952 లో నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్న జయశంకర్ సార్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ నినదించారు.

తన బలం బలహీనత రెండూ కూడా తెలంగాణ అని దాని ఆవిర్భావం కోసం తన జీవితమంతా మధనపడి అనేక సంస్థలను, అనేక సభలను ఏర్పాటు చేయడం ద్వారా కీలకంగా పని చేశారు. 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టడమే కాకుండా మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ ముందు హాజరై తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయడాన్ని అభ్యంతరం చెప్పి ఆ కమిటీకి విజ్ఞాపన పత్రాన్ని అందించారు.

1952లో తన తొలి ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన జయశంకర్  2011లో చనిపోయేవరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న లోటుపాట్లను పరిశీలించి ఉద్యమానికి అందించినారు. 1969 లో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమంలో తన అనుభవాలను అనేక వేదికలపై చెప్పారు. ఆనాటి కాల్పులు జరిగిన రోజు ఆ ఉద్యమానికి తను కొంత ఆలస్యంగా చేరుకున్నానని అప్పటికే కాల్పులు జరిగి చాలా మంది మరణించారు అని ఆవేదన వ్యక్తం చేసేవారు.

మధ్య మధ్యన తెలంగాణ ఉద్యమాన్ని అప్పుడప్పుడు కదిలించిన
మర్రి చెన్నారెడ్డి ,ఇంద్రా రెడ్డి మొదలైన వారు చేసిన ఉద్యమాలకు కూడా మద్దతిచ్చిన జయశంకర్ తన ఆశయమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసము కెసిఆర్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీని బలపరిచి ఆయనకు రాజకీయ గురువుగా, తెలంగాణా సిద్ధాంతకర్త గా పనిచేసి ఆ పొగడ్తకు సార్థకత చేకూర్చాడు.

ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్  తెలంగాణ ఉద్యమ ప్రస్థానం లో జయశంకర్ తో వారి  అనుబంధాన్ని ప్రస్తావించడం నేటి ఉద్యమకారులకు నేటి ఉద్యమానికి అవసరమే.

తొలిసారిగా 1981లో వారితో పరిచయం జరిగిందని 1989లో హైదరాబాదులో తెలంగాణ ఆవశ్యకతపై జరిగిన ఒక సదస్సులో జయశంకర్  69 నాటి తన అనుభవాలను ప్రస్తావించారని అప్పటినుండి వారితో స్నేహం మరింతగా పెరిగి కార్యాచరణకు దారితీసిందని అన్నారు.

1996 నవంబర్ 1వ తేదీన వరంగల్ లో జయశంకర్  ఒక భారీ బహిరంగ
సభను ఏర్పాటు చేశారని తెలంగాణ ఆవశ్యకతపై అన్ని సంఘాలు విస్తృతంగా చర్చించి తెలంగాణను సాధించడమే ఏకైక లక్ష్యంగా ప్రకటించాయని కోదండరామ్ తన అనుభవాలను జయశంకర్ తో సాన్నిహిత్యాన్ని వివరించారు.

తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆంధ్ర ప్రాంతంలోని ప్రజలను వివిధ సంస్థలను తెలంగాణ డిమాండ్ పట్ల ఆలోచించడం కోసం పౌరహక్కుల సంఘాల వాళ్ళు ఏర్పాటుచేసిన సభలకు కోదండరామ్  కూడా జయశంకర్ తో వెళ్లి అక్కడి ప్రజలతో మమేకమై అవగాహన చేయించి వివరించినట్లు చెప్పారు. ఈ రకంగా జయశంకర్  ఆంధ్ర ప్రాంతంలో ప్రజానీకాన్ని ఒప్పించడానికి చేసిన కృషి ఉద్యమ కార్యాచరణ లోని ప్రధాన భాగమే కదా!

విద్యావంతులను ఏకం చేయడం ద్వారా వారిలో తెలంగాణ పట్ల ఒక చైతన్య భావాన్ని రగిలించి సామాజిక బాధ్యతగా వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం కోసం ఒప్పించే క్రమములో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్మాణకర్త కూడా జయశంకర్ గారే. చాలా మంది ని ఒప్పించి నచ్చజెప్పి మన బాధ్యతగా స్వీకరించాలని దానికొక రూపకల్పన చేశారు. అనంతరకాలంలో విద్యావంతుల వేదిక కూడా చైతన్యవంతమైన పాత్రను పోషించింది అనడంలో సందేహం లేదు.

వివిధ రాజకీయ పార్టీలను ఏకం చేయడం ద్వారా, ఉద్యోగ సంఘాలను కలుపుకొని సంఘాల ప్రజల సహకారంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి రాజకీయ పార్టీ ఒక్కటే చాలదని తెలంగాణ జేఏసి పేరుతో సంస్థను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది జయశంకర్ గారే. 2009లో ఏర్పడ్డ తెలంగాణ జేఏసీ సంస్థకు కోదండరామ్ వారిని ఒప్పించి తగిన నాయకత్వాన్ని అందించిన జ్ఞాని ఉద్యమ చుక్కానిజయశంకర్ . అనంతరకాలంలో తెలంగాణ జేఏసీ ద్వారా నిర్వహించిన పలు కార్యక్రమాల ప్రభంజనం మేరకు ఆంధ్ర ప్రభుత్వం దిగి రావడం కేంద్ర ప్రభుత్వం ప్రతి పక్షాలు మద్దతు ఇవ్వడం వల్లనే తెలంగాణ సాకారం అనే విషయం మనందరికీ విధితమే.
ఉద్యమ ఆకాంక్షలు నెరవేరిన యా?

జయశంకర్ కు ప్రభుత్వ పెద్దల గుర్తింపు ఏది?

మూడు తరాల అనుభవాలను ఉద్యమానికి అందించడమే కాకుండా ఉద్యమానికి వారధిగా సారథిగా పనిచేసిన జయశంకర్  కలలుగన్న ఉద్యమకాలంలో ఆశించిన ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరినయో విద్యావంతులు ,ప్రజా సంఘాలు ప్రజలు ఆలోచించ వలసిన అవసరం ఉంది. తను ఇచ్చిన సలహాల మేరకు నేటి ప్రభుత్వాన్ని అమలు చేయమని అడగడానికి వారు సజీవంగా లేరు. విద్యావంతుల వేదిక తెలంగాణ ,జేఏసీ లాంటి సంస్థలకు ప్రభుత్వాన్ని సరైన గాడిలో పెట్టడానికి ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడానికి వీలుగా ప్రభుత్వ కార్యాచరణను అమలు చేయించే బాధ్యత అప్పగించి వెళ్ళిపోయినారు. అయితే ప్రభుత్వం నీళ్లు ,నిధులు, నియామకాలు ,ఆత్మ గౌరవం విషయంలో ఏ మేరకు సఫలమైంది, హామీల అమలులో ఆటంకాలు ఏమిటి? ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏమైనా ఫలితం లభించిందా? లేకుంటే తెలంగాణ ఏర్పడి లాభమేంటి? అనే విషయాలను ఇవాళ ప్రభుత్వం కంటే ప్రజలు రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు ఎక్కువగా ఆలోచించాలి.

వివిధ వృత్తులు ప్రజలకు ఆత్మ గౌరవం కాదు కదా భావప్రకటన స్వేచ్ఛ కూడా అంతంత మాత్రమే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైన ప్రత్యేకమైన కార్యాచరణ కనిపించడం లేదు. తాత్కాలికంగా ఇచ్చే రాయితీలు పేదరికం నిరుద్యోగం వంటి సమస్యలు పరిష్కరించ లేవు. రాష్ట్రము అప్పుల ఊబిలో కూరుకుపోయినది. జయశంకర్  ని స్మరించుకుంటూ ఉన్న ఈ వేళ తను ఆశించిన ఆకాంక్షలు ఇంకా నెరవేరకపోతే ఆ బాధ్యత ఎవరిపై ఉందొ మనమంతా ఆలోచించాలి. వారి కలలను సాకారం చేయడమే వారికి అర్పించే ఘనమైన నివాలి కాగలదు.

ఇటీవలి కాలంలో ఉద్యమ నాయకులను అధికారపార్టీ క్రమంగాబయటకు పంపిస్తూ ఉద్యమంతో సంబంధం లేనివారే మంత్రివర్గంలో ఉండడాన్ని బట్టి ఆత్మగౌరవ ము ఏ మేరకు అమలవుతుందో అర్థంచేసుకోవచ్చు.
ప్రతిఏటా జయంతి వర్ధంతి నాడు నిర్వహించే సభలు సమావేశాలలో
జయశంకర్ కి తగిన గౌరవం దక్కు తున్నదా?? ప్రభుత్వ పెద్దలు పాల్గొని నిండుమనసుతో నివాళి అర్పించడం ఏ కాకుండా వారి ఆశయం నెరవేర్చడం కోసం తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మార్చడం కోసం పని చేయవలసిన అవసరం ఉంది.

అధికారికంగా ఉత్సవాలను జరపడం కాకుండా అసెంబ్లీలో వారి భారీ విగ్రహాన్ని నెలకొల్పాలి. పాలనకు సంబంధించి జయశంకర్  సూచించిన సంస్కరణలపై ప్రజలలో అవగాహన కల్పించడంతోపాటు వాటి సాధన కోసం ప్రభుత్వం కృషి చేయాలి.

తెలంగాణ ఉద్యమ కాలంలో భావప్రకటన స్వేచ్ఛ ఉద్యమ స్వేచ్ఛతో పోరాడగలి గినాము కనుకనే తెలంగాణ సాధ్యం అయ్యింది ,నాటి స్వేచ్ఛను కూడా నేడు పొందలేకపోతే రాష్ట్రానికి అర్థం ఏమిటి?

ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత,” తెలంగాణ జాతిపిత” 60 సంవత్సరాల పాటు పరోక్ష ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమంతో సంబంధమున్న ప్రొఫెసర్ జయశంకర్ రే  కాగలరు.

కానీ ఆ కీర్తిని తమ సొంతం చేసుకోవడానికి కొందరు పన్నుతున్న కుట్రలను కూడా భగ్నం చేయాల్సిన సామాజిక బాధ్యత నేటి తెలంగాణ సమాజం పై ఉన్నది. ఆ వైపుగా అటు ప్రభుత్వం లోనూ ఇటు ప్రజల్లోనూ అడుగులు పడాలని జయశంకర్ కలలను నిజం చేయాలని, వారు చూడని తెలంగాణలో మనం వినూత్న అభ్యుదయ పథంలో దూసుకు వెళ్లడం ద్వారా వారికి ప్రభుత్వము ప్రజల పక్షాన ఘనమైన నివాళి అర్పించాలి అని మనసారా కోరుకుంటున్నాం.

(వడ్డేపల్లి మల్లేశం, సామాజిక విశ్లేషకుడు,హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట
9014206412)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *