ఫ్లయింగ్ సిక్…మిల్కా సింగ్… ప్రాక్టీసు మొదలైంది సికిందరాబాద్ లోనే…

(సలీమ్ బాషా)

అదిగో పతకం గెలిచాడు అని సంబర పడేలోగా ఓడిపోయాడు. ఇదిగో చావును జయించాడు అని ఊపిరి పీల్చుకొనే లోగా, వెళ్ళిపోయాడు. ఒక్కముక్కలో ఇది మిల్కా సింగ్ జీవితం.

ఫ్లయింగ్ సిక్ గా సాక్షాత్తు పాకిస్తాన్ అధ్యక్షుడే ప్రశంసించిన పరుగుల రారాజు, జూన్ 19న తన సుదీర్ఘమైన పరుగును శాశ్వతంగా ఆపేశాడు. 91 ఏళ్ల జీవితంలో ఎన్నో పతకాలు సొంతం చేసుకున్న మిల్కా సింగ్ భారతదేశపు క్రీడాకారుల్లో ప్రత్యేకమైన జాతికి చెందినవాడు. ఆ తరం క్రీడాకారుల్లో, ఆటగాళ్లలో మిల్కా సింగ్ స్థానం ప్రత్యేకమైనది, స్ఫూర్తిని కలిగించేది.

దేశానికి గర్వకారణమైన మిల్కాసింగ్ తన క్రీడా జీవితంలో ఎన్నో పతకాలు సాధించాడు. అయినప్పటికీ 1960 రోమ్ ఒలింపిక్స్ లో తృటిలో చేజార్చుకున్న పతకమే అతనికి గుర్తింపునిచ్చింది. ఏషియన్ గేమ్స్ లో నాలుగు సార్లు బంగారు పతకం సాధించాడు.

అలాగే 1958 కామన్ వెల్త్ గేమ్స్ లో భారతదేశానికి తొలి కామన్వెల్త్ స్వర్ణం అందించాడు. దేశంలోని ఏ అథ్లెట్లకు సాధ్యం కానటువంటి వారసత్వాన్ని వదిలి వెళ్ళాడు. భారత క్రీడా చరిత్రలో 1958 కామన్ వెల్త్ గేమ్స్ లో మిల్కా సింగ్ సాధించిన బంగారు పతకం చిరస్మరణీయంగా నిలిచిపోయింది.

BBC కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆరోజు రాత్రి జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ మిల్కా ఇలా చెప్పాడు”ఒక వ్యక్తి ఫైనల్స్ కు చేరుకున్నప్పుడు కు తను చాలా ఒత్తిడికి లోనవుతాడు నిద్రపోలేడు కూడా. అది చాలా కష్టమైన రాత్రి”.కామన్వెల్త్ క్రీడల్లో మిల్కా సింగ్ గురించి ఎవరూ వినలేదు.

నిజంగా ఇది ఇది భారత దేశ చరిత్రలోనే చారిత్రాత్మక విజయం. అలా మిల్కా సింగ్ తన విజయపరంపరను కొనసాగించాడు. ఆయన జీవితం లోని ఒక అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం

రోమ్ ఒలింపిక్స్ లో మిల్కా సింగ్ యొక్క ముఖ్యమైన పరుగు. అప్పటికే మిల్కా సింగ్ నాలుగుసార్లు ఆసియా గేమ్స్ బంగారు పతక విజేత మరియు 1958 కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్, కానీ అతని గొప్ప ప్రదర్శన రోమ్ ఒలంపిక్స్ లో త్రుటిలో చేజారిన కాంస్య పతకం.

రోమ్ 1960 ఒలింపిక్ క్రీడలలో పురుషుల 400 మీ. ఈవెంట్ అసాధారణమైనది ఎందుకంటే యుఎస్ఎ యొక్క ఓటిస్ డేవిస్ మరియు జర్మనీ యొక్క కార్ల్ కౌఫ్మన్ ఫోటో-ఫినిష్ లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు.అప్పటికి నాలుగేళ్ల కిందట నెలకొల్పిన 45.2 సెకన్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి వీరిద్దరూ పట్టుదలతో ఉన్నారు.

మిల్కా సింగ్, రేసును అద్భుతమైన పద్ధతిలో ప్రారంభించాడు. అతను అప్పటికే 440 గజాలలో పోటీలో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్. సగం దూరం వరకు అద్భుతంగా పరిగెత్తిన మిల్కా చివరికి వెనుకబడ్డారు. అలా కాంస్య పతకం చేజారింది, అలాగే స్థానం కూడా.

దీని గురించి మిల్కా ఇంటర్వ్యూలో చెప్తూ ఇలా అన్నాడు. డు “అది ఫోటో ఫినిష్ అయినందువల్ల ఫలితాలు త్వరగా వెలువడలేదు. ఆ సస్పెన్స్ చాలా బాధ కలిగించింది. నిజానికి ఇది నా తప్పే. లేన్ ఐదులో అత్యంత వేగంగా పరిగెత్తిన తరువాత, 250 మీటర్ల దగ్గర ఎందుకో నెమ్మదించాను. ఆ తర్వాత వేగంగా ముందుకు వెళ్ళలేక పోయాను. అదే నేను చేసిన తప్పు. దానికి నేను భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. నా చేతి నుంచి రేస్ చేజారిపోయింది. నా తల్లిదండ్రుల మరణం తరువాత, అదే నాకు ఒక భయంకరమైన జ్ఞాపకం .నేను రోజుల తరబడి ఏడుస్తూనే ఉన్నాను”.

నిజానికి ఈ దురదృష్టం మిల్కాసింగ్ ఒక్కడిదే కాదు భారత దేశానిది కూడా!!!

భారతీయులు గౌరవించే గొప్ప, అరుదైన అథ్లెట్ మిల్కా. బహుశా అతను పడిన కష్టాలు ఎవ్వరూ పడి ఉండరు. చిన్నతనంలో దేశవిభజన సందర్భంలో జరిగిన సంఘర్షణలో అతని తల్లిదండ్రులు కోల్పోవడం, అలాగే మిలిటరిలో చేరాలనుకొని విఫలయత్నాలు చేయడం, ఇలా అతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. అయినప్పటికీ వాటన్నిటినీ అధిగమించి ఒక దిగ్గజ క్రీడాకారుడిగా పేరు ప్రఖ్యాతులు గడించాడు.

మిల్కా సింగ్ పేరు మీద ఒక కాలనీ ఉండడం, అది కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉండటం విశేషం. దీని వెనక ఒక కథ ఉంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 1952 నుంచి 1960 వరకు మిల్కా సింగ్ సికిందరాబాద్ లోనే ఉన్నాడు. ఇక్కడి నుంచే 1960 రోమ్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధం అయ్యాడు. ఇక్కడి  గ్రౌండ్స్ లో అతని ప్రాక్టీస్ నడిచేది . మిల్కా సింగ్ కాలనీలో తో పాటు ఉ చుట్టుపక్కల మైదానాల్లో, కొండల్లో, అంతగా అనువుగా లేని గుట్టల్లో ప్రాక్టీస్ చేసేవాడు.

.ఇక్కడ చేసిన కృషి వల్లనే తన క్రీడా జీవితానికి గట్టి పునాది పడిందని అంటాడు ఈ దిగ్గజ క్రీడాకారుడు. ప్రాక్టీస్ కోసం, మిల్కా సింగ్ EME సెంటర్ సమీపంలో ఉన్న “అమ్ముగుడా పహాడ్ ” (కొండ) ను ఎక్కడానికి రాళ్లతో నింపిన సంచులను, దృఢత్వం, బలం కోసం మోసుకెళ్లే వాడు. ఇది ఒక్కటే కాదు అతను అక్కడి  రైలు  వెంబడి కూడా పరిగెత్తే వాడు. బొల్లారం నుంచి అమ్ముగుడా మధ్యలో ఆ రైలు నడిచేది. ఒక రైలు డ్రైవర్ తనని బాగా ప్రోత్సహిస్తూ రైలుతో పాటు పరిగెత్తించే వాడు.   ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండు అని తనని ఉత్సాహపరిచే వాడని మిల్కా సింగ్ స్వయంగా చెప్పుకున్నాడు.

మిల్కా సింగ్ పేరుమీద కాలనీ మాత్రమే కాదు, 1952-53లో అతను శిక్షణ పొందిన EME సెంటర్ లోపల స్టేడియంను మిల్కా సింగ్ స్టేడియం అంటారు.

పరుగు నుండి విశ్రమించిన తర్వాత మిల్కా సింగ్ పంజాబ్ రాష్ట్రంలో క్రీడల అధికారి గా తన సేవలను అందించాడు. తన కూతురితో కలిసి “ ది రేస్ ఆఫ్ మై లైఫ్” అనే ఆత్మ కథను ప్రచురించాడు.

ఒక విషయమై మై ఫోన్ చేసినప్పుడు పాకిస్తాన్ క్రీడాకారుడు ఖాలిక్ కుమారుడు ” మీరు చాలా గొప్ప క్రీడాకారులు” అని చెప్పగా, ” మీ నాన్న చాలా గొప్ప అథ్లెట్. ఆయన మీద గెలవడం వల్లనే నాకు ఫ్లయింగ్ సిక్ అనే పేరు వచ్చింది. మీ నాన్న ఒక గొప్ప క్రీడాకారుడు” అని చెప్పడం మిల్కా సింగ్ హుందాతనానికి నిదర్శనం.

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ” మిల్కా సింగ్ ఆత్మకథ పుస్తకంలో లో చివరి పేజీ అత్యంత స్ఫూర్తిదాయకమైన ది” అని ట్వీట్ చేశారు. నిజమే! ఎందుకంటే ఆ పేజీలో మిల్కా సింగ్ రాసిన ఈ రెండు వాక్యాలు, అతని జీవితం మొత్తాన్ని ప్రతిబింబిస్తాయి.

“మిటాదే అప్ని హస్తికో కయీ మర్తబా చాహే
కీ దానా ఖాక్ మే మిల్కర్ గులే-గుల్జార్ బన్ తాహే”

(” మట్టిలో కలిసి పోయి మొక్కగా మొలకెత్తే విత్తనం లాగా ఉండటం నేర్చుకో” అని మనం
అర్థం చేసుకోవచ్చు)

ఇప్పుడు చాలామంది అభిమానులు, క్రీడాకారులు భావిస్తున్నట్లుగా, “భారతరత్న” ఇవ్వడం మనం మిల్కా సింగ్ లాంటి గొప్ప క్రీడాకారుడికి ఇవ్వగలిగే సరైన నివాళి!!

(సలీమ్ బాషా, లాఫ్ థెరపిస్టు, రచయిత, హోమియో వైద్యుడు,వ్యక్తిత్వ వికాస నిపుణుడు. కర్నూలు. ఫోన్ నెం.9393737937)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *