ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని, క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంటర్ పరీక్షలు బహుశా జులై మొదటివారంలో జరగొచ్చని వెల్లడించారు. జులై చివరి వారంలో టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉందని తెలిపారు. జులైలో పరీక్షలు నిర్వహించలేకపోతే ఇక అవకాశం ఉండదని భావిస్తున్నామని మంత్రి ఆదిమూలపు వ్యాఖ్యానించారు.
అయితే, తాము కచ్చితంగా జులైలోనే పరీక్షలు పెడతామని చెప్పడంలేదని, అవకాశం ఉందని మాత్రమే చెబుతున్నామని వివరించారు. ప్రస్తుతం పరీక్షల నిర్వహణపై సమీక్షించుకుంటున్నామని తెలిపారు. పరీక్షలు రద్దు చేయడం అనేది తమకు ఎంతో సులభమైన పని అని, ఒక్క నిమిషంలో చేయగలమని తెలిపారు. కానీ తర్వాత పర్యవసానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేరళ, బీహార్ రాష్ట్రాలు విద్యార్థులకు పరీక్షలు జరిపాయని, చత్తీస్ గఢ్ కూడా పరీక్షలు జరుపుతోందని వెల్లడించారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని పరీక్షలు జరుపుతామని, కరోనా తప్పిస్తే పరీక్షలకు ఇంకేం అడ్డంకి ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రశ్నించారు.