కవితా మాంత్రికుడు సి.నా.రె!

(దివికుమార్)

2017 జూన్  12న   సి .నారాయణరెడ్డి (29జూలై 1931- 12 జూన్ 2017) హైదరాబాద్‌లో కన్నుమూశారు.

86 ఏళ్ళ నిండువయసులో మరే కవికీ లేనంత 70 ఏళ్ళ సాహిత్య జీవితంతో ఒక “సెలబ్రిటీగా”, రాజలాంఛనాలతో బహుదూరపు బాటసారిలాగా సి.నా.రె.
వెళ్ళిపోయారు. ఆయన అడుగిడిన ప్రతిరంగంలోనూ అసాధారణ ప్రజ్ఞతో
రాణించారు.

కళాశాల ఉపాధ్యాయునిగా, విశ్వవిద్యాలయ ఆచార్యునిగా, వాటి
ఉపాధ్యక్షులుగా, వేలాది విద్యార్థులకు తెలుగు భాషా సాహిత్యాల పట్ల మమకారమూ, అభినివేశమూ కలిగించేలా బోధించారు. తన డాక్టరేట్‌
పట్టాకై 1962లో రచించిన ఆధునికాంధ్ర కవిత్వం- సంప్రదాయములు ప్రయోగములు నేటికీ తెలుగు సాహిత్య విద్యార్థులకు అధ్యయనం
చేయాల్సిన ఆకర పాఠ్యగ్రంథం. విశ్వవిద్యాలయాల నాలుగు గోడల నడుమేకాక అనేక గ్రామాల, పట్టణాల విశాల వేదికలపై ఉపన్యసించారు. ఆయనకు,

కవిత్వం రాయనిరోజు ఏ.సి గదిలో అయినా ఉక్కపోసినట్లుగా, హైదరాబాదు నగరంలో ఉపన్యసించని వారం ఉపవాసం ఉన్నట్లుగా ఉండేదని చెప్పవచ్చు.

విస్తారమైన ఆయన సాహిత్యకృషి (సినిమా పాటలు కాకుండా)
18 సంపుటాలకు పైగా వెలువడింది. వాటిలో గేయనాటికలు,
గేయకావ్యాలు (6), రేడియో రూపకాలు, గేయకవిత, వచన కవితా
సంపుటాలు, వచన కావ్యాలు ( విశ్వంభర ), గేయసూక్తులు (గాంధీయం),
వచన నాటిక, యాత్రా సాహిత్యం, సాహిత్య వ్యాసాలు, గజళ్ళు మొదలైన,
వైవిధ్యపూరితమైన 18 ప్రక్రియలలో ఆయన రచనా వ్యాసంగం చివరి
శ్వాసదాకా కొనసాగింది.

సినారె భావాలకు ఎల్లలు ఉన్నా భావుకతకు హద్దులు లేవు. ఏ
సందర్భాన్నయినా, ఎలాంటి సన్నివేశాలనయినా — విశ్వమంతా విస్తరించుకున్న విశాల ప్రకృతినైనా, ద్వైదీచిత్త వైచిత్ర్య మానవ ప్రవత్తినైనా — కవిత్వంగా
మలచగల అసాధారణ ప్రజ్ఞా ధురీణుడు సినారె! కవితా స్పర్శలేని పవనం, పరిమళ రహితం, కవితా దర్శనం లేని భువనం శూన్యతా హతం
అని చెప్పుకున్నాడాయన.

మతము – మానవుడు – సినారె

మతమే ప్రతివారికి జీవిత సర్వస్వమ్ము కాదు.
మత బంధమ్మింత లేని
మహామహులెందరు లేరు!
మతబోధలకే కళలంకితము సేయుటెందులకో? (నాగార్జున సాగరం-1955)

సినారెకి దేవుడు-మతం మీద కంటె మానవుని మీదే
నమ్మకమెక్కువ. నేను దానవుని సైతము నిర్జించిన మానవుడను, కాని, మానవుని జయించలేని లోని మానవుడను* (దివ్వెల మువ్వలు) అంటూ –
మనిషి నా పల్లవి మనిషి నా పతాక, మనిషి నా అవధి – మనిషి నా ఆకాశం
మనిషి నా శస్త్రం – మనిషి నా శాస్త్రం
మనిషి నా ఉచ్చ్వాసం – మనిషి నా విశ్వాసం
అని ప్రకటించిన సినారె మానవుని తత్త్వసారాన్ని యిలా
సూత్రీకరిస్తాడు:

కాలవిధేయుడు కాదు, కాలవిజేతగా నిలిచిన మానవుడే సమగ్ర మానవుడు (సమూహం వైపు)

సినారెకు జ్ఞానపీఠం అవార్డుని సాధించిపెట్టిన విశ్వంభర
కావ్యానికి నాయకుడు మానవుడే. అది తేదీలతో నిమిత్తం లేని మనిషి
కథ. ఆయన మాటల్లోనే చెప్పాలంటే- మనిషి సాధన త్రిముఖం – కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం ఈ సాధనలో అడుగడుగునా ఎదురుదెబ్బలు. క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు.

Like this story? Please share it with friends!

మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు.
అలెగ్జాండర్‌, క్రీస్తు, అశోకుడు, సోక్రటీసు, బుద్ధుడు, లింకన్‌, లెనిన్‌, మార్క్స్, గాంధీ… ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తుల్లో మనిషికి, ఆదిమ దశ నుంచి ఆధునిక దశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు మార్క్సిజాన్ని కూడా ‘విశ్వంభర’ కావ్యంలో కవిత్వభాషలో చెప్పారు సినారె.

ఏ మనిషి శిరంలోనో ఇగురులెత్తిన సామ్యవేదం, ఏ మనస్వి కలంలోనో ఎగిసి వచ్చిన క్రాంతినాదం, దిక్కుల గీట్లను విడిచి దేశాల గట్లను తుడిచి
చొరబడకుంటుందా దీప్తి మతుల నరాల్లో,
పురివిప్పకుంటుందా చిరపీడితుల స్వరాల్లో !! (పుట 74)

కారల్‌మార్క్స్ ది కావ్యసృష్టినీ, శాస్త్రదృష్టినీ విస్తరించిన మస్తకం
అని కూడా చెప్పారు. ఇంకా ‘విశ్వంభర’ చివరి వాక్యాలు చూడండి-

ఋషిత్వానికీ -పశుత్వానికీ, సంస్కృతికీ -దుష్క్రతికీ
స్వచ్ఛందతకూ -నిర్బంధతకూ, సమర్ధతకూ- రౌద్రతకూ తొలిబీజం మనసు
తులారూపం మనసు,
మనసుకు తొడుగు మనిషి ,
మనిషికి ఉడుపు జగతి
ఇదే విశ్వంభరాతత్త్వం ఇదే అనంత జీవిత సత్యం
ఇంకొంత లోతుగా తెలుసుకోవడానికి
ప్రయత్నిద్దాం.

సినారె తాత్వికత!

సందర్భం దొరికిన చోట, ముఖ్యంగా కావ్యాల్లో, భారతీయ తాత్వికతను
అనగా అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత, బౌద్ధ ధర్మాలనూ, మార్క్సిజంలోని
ఒక కీలక తాత్వికాంశమైన విరుద్ధశక్తుల నడుమ సంఘర్షణ-సర్దుబాటు అనే ద్వంద్వాలను తన కవిత్వ వ్యక్తీకరణకు వినిమయిస్తూ సాగిన
సినారెను నిరీశ్వరవాదిగా కొందరు నిర్ధారించారు. కానీ ఆయన్ను
అజ్ఞేయవాది అనటం సబబుగా వుంటుంది. అయినప్పటికీ ఆయన
తాత్త్వికంగా భౌతికవాది కాడని గుర్తించాలి. ప్రకృతిని గురించీ, మానవుని గురించీ ఆయన ఎన్ని పర్యాయాలు ప్రస్తావించుకుంటూ వెళ్ళినా, మానవ
శ్రమజీవన పరిణామ క్రమంలో రూపొందిన ఈ భౌతిక పదార్థం (మానవ దేహం) యొక్క విశిష్ట లక్షణంగా మానవ మేధస్సును ఆయన గుర్తించారా? పైన పేర్కొన్న విశ్వంభర చివరి పంక్తులలో కూడా సమష్టి మానవ శ్రమజనితంగా కళ, విజ్ఞానం, ఆధ్యాత్మిక చింతనలు అభివృద్ధి చెందినట్లుగా కాక, మనసే మూలమంటూ అనగా రూపమే సారమన్నట్లు ఆయన
వ్యక్తీకరణలుంటాయి.

ఒక కవిగా ప్రకృతి తత్త్వాలను మానవ ప్రవృత్తులకు ప్రతీకలుగా,
ఉత్ప్రేక్షలుగా, అలంకారాది రూపకాలుగా విస్తృతంగా సినారె
అన్వయించారు. అయినా అభివృద్ధి చెందిన భౌతిక విజ్ఞాన శాస్త్రదృష్టితో
వాటిని సంగ్రహించ లేకపోవటం చేత మానవశ్రమకూ – సౌందర్యానికీ
అమానుష తత్త్వాల భూమిక అయిన అసమాన మానవ సమాజానికీ,
దాని ఫలితంగా రూపొందుతున్న వికృత మానవ ప్రవృత్తులకూ
నడుమగల గతితార్కిక సంబంధాన్ని పట్టుకోలేక పోయారని, ఛాయరాజ్‌ రాసిన దర్శిని’ కావ్యాన్ని కూడా చదివితే ఎవరికైనా అర్ధమవుతుంది.

ఏది ఏమయినా ఆయన మిగిలిన అన్ని కావ్యాలలో కంటె తాత్త్విక
చింతనా గాఢత ‘విశ్వంభర’లో ఎక్కువని చెప్పక తప్పదు.
సినారె మౌలికంగా గాంధేయ సంస్కరణవాది. రాజకీయంగా కాంగ్రేసు, తెలుగుదేశం పార్టీలకు సన్నిహితుడు. గాంధీ, నెహ్రూలపైనే కాదు, కామరాజ్‌ నాడార్‌పై కూడా కవిత రాశారు. తెలుగుదేశం ఎం.ఎల్‌.ఎ.లకు శిక్షణా శిబిరాలు  నిర్వహించారు. సమాజం మారాలని కోరుకున్నప్పటికీ,
మారితీరుతుందని నమ్మినప్పటికీ, అలాంటి మార్పుని నిరోధిస్తున్న అభివృద్ధి నిరోధక , ఆర్థిక , రాజకీయశక్తులను, సమకాలీన జీవన సంఘర్షణలోని ప్రజాశక్తులను నిర్దిష్టంగా పేర్కొనలేకపోయారు. దానికి బదులుగా అమూర్త కవిత్వ భావపరంపరను ఆది నుండి అంతం దాకా కొనసాగించారు. నెహ్రూ తాత్విక చింతనాపరుడే అయినా కేవలం కళా హృదయంతో ప్రకృతినీ- మానవుడినీ-పరిణామాలనూ దర్శించి,
ఆధునిక శాస్త్రవిజ్ఞాన _ దృక్పథాన్ని _ అందుకు
సమన్వయించుకోలేకపోయారు.

జీవన పరిణామంలో, మానవీయ గుణసౌందర్య నిర్మాణంలో
ప్రకృతితో మానవులు సాగిస్తూ వస్తున్న సంఘర్షణ ఒకనాడు ఎంత
ముఖ్యమైనదో, సమాజపు వర్గ విభజన కారణంగా నాటినుండీ
నిరంతరంగా సాగుతూన్న వర్గపోరాటాల చరిత్ర కూడా అంతే
ముఖ్యమైనది. ఆధునిక చరిత్రకు వర్గపోరాటమే ప్రాముఖ్యతగల
చోదకశక్తి. దీన్ని శ్రీశ్రీ, శివసాగర్‌, ఛాయరాజ్‌లు తమ తమ విలక్షణ,
విశిష్ట శైలులతో కవిత్వీకరించారు. ఈ జీవరసాగ్నిని అంటుకోవాలన్నా,
అందుకోవాలన్నా కేవలం కవిత్వ నిబద్ధత చాలదు. పీడిత ప్రజలపక్షం
వహించే సామాజిక నిబద్ధత, వారిని అణచి ఉంచుతున్న ఆధిపత్యశక్తుల
వర్గపీడన రాజకీయాలతో రాజీపడని సంఘర్షణ తత్త్వమూ తప్పనిసరి
అవుతాయి. సినారె సాహిత్యాన్ని విశ్లేషించుకోవటంలో ఈ కోణాన్ని,
పరిగణనలోనికి తీసుకోకుంటే ఏ కాలపు సాహిత్యానికైనా మూలధాతువయిన సామాజిక వైరుధ్యాల సంఘర్షణాత్మక చరిత్రకు అపచారం జరుగుతుంది. శ్రమజీవులకు అన్యాయం జరుగుతుంది.

కమ్యూనిజం ఆకర్షణలో..

సోవియట్‌ రష్యాలో పదిరోజులు పర్యటించి అర్మీనియా,
మాస్కోలను దర్శించిన ఆ యాత్రానుభవాల్ని అక్షరబద్ధం చేశారు సినారె.
బద్దకం ఈ దేశానికి బద్ధ శత్రువు అనటమే కాక,
అక్కడ అగుపించేది నడకకాదు, అభ్యుదయానికి లయలు నేర్పే పరుగు
అక్కడ వినిపించేది పలుకు కాదు, ఆత్మ ధృతికి ధ్వనులు కూర్చే వెలుగు అని రాశారాయన.

సినారే సంతకం

అందుకేనేమో సోవియట్‌ యూనియన్‌లో శ్రామికశక్తులు పూర్తిగా ఓటమికి గురై ఆ రాజ్యం కుప్పకూలిన పరిస్థితుల్లో, దోపిడీ వర్గాల కేరింతలను ఖండిస్తూ సినారె గర్జించాడు:

ఎవడురా అన్నది…
కమ్యూనిజం చచ్చిపోయిందని
ఎవడురా కూసింది…
ఎర్రజెండా నేలకొరిగిందని…
తూర్పున సూర్యుడు పొడిచినంతకాలం…మనిషిలో రక్తమున్నంత వరకు అజేయం విప్లవం*
దానినాపటం ఎవడబ్బ తరం…
అదీ! సినారె విశ్వాసం!!

నూతన ప్రయోగాల కవిత్వం

డిగ్రీవరకు ఉర్దూభాషా మాధ్యమంలో చదువుకున్న సినారె,
దాని విలక్షణ అభివ్యక్తి సౌందర్య ప్రక్రియ అయిన గజల్‌ ను తెలుగు
చేసి మరొక కొత్త శిల్పరూపాన్ని తెలుగువారికి అందించారు.

పరువు పెరిగితే శిరసు కాస్త వంచుకోరాదా?
ప్రతిభ తరిగితే పౌరుషంతో పెంచుకోరాదా?
ఈ వాక్యాలు ఏ జీవన తలం మీద ఉన్న వారికైనా వర్తించేవే
కాని, రచయితలు దాని సారాన్ని తమకు అన్వయించుకోవాలని,
కవిహృదయం కావచ్చునేమో! తెలుగునాట ప్రజాకళాకారుల బృందాలు విస్తృంగా ఆలపించే మరో గజల్‌:

పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని?
మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని?
కవిని అజరామరం చేసే వాక్యాలివి.

భాషా తత్వము: మాంత్రిక కవిత్వము

భాషపై రాసిన కవితలో మనుషుల్ని కలిపేది భాష అని సినారె
భాషకుండే ఒకానొక మౌలిక లక్షణం చెప్పారు. రాజకీయాలు, సాంఘిక
వ్యవస్థల్లోని అసమానతలు మనుషుల్ని విడదీస్తాయి కానీ అది భాషకుండే స్వభావం కాదు.

భాషలోనొక కొంత యాస విన్పడుగాక
వేషాననొక కొంత వింత కన్పడుగాక
అయిన నేమాయొనయ్యా తెల్గులందరికి
సంస్కృతి యొకండె పూసలలోని దారమటు

మనకిప్పుడు యాసనే భాష అనుకునేవారున్నారు. మాండలిక భాష
ఉంటుందనుకునే వారున్నారు. పదాలనే భాషగా భ్రమించేవారున్నారు.
సమగ్ర వాక్యనిర్మాణ లక్షణాల పరిణామ ప్రక్రియను భాషాతత్త్వంగా వివేచించేవారు తరిగారు దానివల్లే ఆంధ్రము వేరు తెలుగు వేరు అనే
వాదనలు కొన్ని వినిపించాయి. నిజానికి భాష గొప్ప ప్రజాస్వామికమైనది.
భిన్నాభిప్రాయాలనేకాదు, వ్యక్తుల, సమూహాల ఆవేశకావేషాలను
చేరవలసినవారికి చేర్చేది కూడా భాషే! భాష ఒక సాధనమే కాని కారకం కాదు. అయితే రాష్ట్రాల విడబాటుతో భాష – జాతి విడివడినట్లు
భావించినవాడుకాదు సినారె. ఆయన-సమత నా భాష, కవిత నా శ్వాస అంటూ తిరిగి తన ఏమరపాటుగా కావచ్చు, శ్వాసలాంటిదే భాష ఒంట్లో పుడుతుంది అన్నారు.

మనిషి తల్లికడుపున ఉన్నపుడే శ్వాసించటం ఆరంభిస్తాడు. అది
సహజాతం. పుట్టిన కొన్ని నెలల తర్వాతగానీ, ప్రయత్నపూర్వకంగా నేర్పితే, నేర్చితేగానీ అలవడనిది భాష! ఈతకొట్టటం, సైకిల్‌తొక్కడం నేర్వవలసినట్టుగానే భాషను నేర్వాల్సి ఉంటుంది.

అది అప్పటికే మనిషి వెలుపల సమాజంలో తరతరాల సామూహిక కృషి ఫలితంగా, ఒక జాతి సాంస్కృతిక లక్షణంగా రూపొంది సిద్ధంగా ఉంటుంది.
భాష సమాజం నుండి వ్యక్తిలోకి ప్రవేశించేది. అనగా అది వ్యక్తి శ్వాసకాదు. ఒక జాతికి ఉచ్భ్యాస నిశ్వాస భాష. అది సమూహం నుండి వ్యక్తిలోకి ప్రవహించే అర్ధవంతమైన స్వరజనిత ఘోష. వ్యక్తి తిరిగి సమూహంతో సంభాషించగలిగే మానవ గుణప్రదాత తెలుగు సాపాతీలోకం ముఖ్యంగా కవులు సినారె భాషా పదసంపదలోని విస్తృతినీ, కవిత్వంలోని అలవోక ఆలంకారిక సొబగుల్నీ, కావ్యాల్లోని వాక్యవిన్యాస భంగిమల్నీ, సినీ గీతాలలోని పండిత, పామర జనరంజకత్వాన్నీ ఆస్వాదించి, ఆఘ్రాణించి, అమోఘమమోఘమనిశ్లాఘిస్తున్నారంటే అది కవిత్వంలోని మాంత్రిక లక్షణం వల్లనే!

సినారె కూడా శ్రీశ్రీలాగే మాటల మాంత్రికుడు. భాషా, సాహితీ
పాండిత్యం వారి మాధ్యమాలు. శ్రీశ్రీ… మానవుడే నా సంగీతం మనుష్యుడే నా సందేశం అన్నప్పటికీ శ్రీశ్రీ మానవులు, కార్మికులు – కర్షకులు, అనాధలు, అభాగ్యులు, అశాంతులు కానీ సినారె మానవుడు అమూర్త మానవుడు. అందుకే మానవునిలోని దానవాంశకు దోపిడీ పీడనల వర్గ సమాజం మూలమని కాక, మానవుని మానసిక వైక్లబ్యంగా భావించి, దానిని సంస్కరించే భావవిప్లవంతో సరిపోతుందనుకున్నారు. కనుకనే సామాజిక విప్లవ శక్తుల సంఘర్షణలకు దూరంగానే గడిపారు.
సాహిత్యం ఒక సామాజిక చైతన్యరూపంగా తిరిగి సమాజంతో అది ఎలా ప్రతిస్పందించి, గడిచిన 70 సంవత్సరాల సామాజిక సంఘర్షణలో ప్రజల పక్షం వహించిందనే మౌలిక చింతన పైనా, ఆయా కాలాల యితర
సాహిత్యకారుల ఉత్తమ రచనలతో తులనాత్మక పరిశీలనతోనూ, సినారె సాహిత్య సామాజిక, రాజకీయ కృషిని విశ్లేషించుకోవటం జరగాలి. అది ఆయనకు అందించే ఉత్తమ నివాళిగా నిలుస్తుంది.

వర్గ రాజ్యంలో కవి

చివరగా, సాహితీ విమర్శకులంతా సినారెను శ్రీనాథ మహాకవితో
పోల్చారు తప్ప బమ్మెర పోతనతో పోల్చలేదనేది గమనార్హం. పోతన….

రాజ్యంబు పాపమూలము
రాజ్యముతో నొడలెరుంగరాదు సుమతియున్‌ అని,
అనివుండటమేకాక, తన ఆంధ్ర మహాభాగవత రచనను నాటి పాలకుడైన రావు సింగభూపాలునకు అంకితమివ్వకుండా రాజ్యం ఒత్తిళ్ళకు ఆనాడే తట్టుకుని నిలబడ్డాడు. సంప్రదాయముల గురించి మాట్లాడేవారు పోతన నెలకొల్పిన రాజ్య ధిక్కార బాటను ఎందుకు స్వీకరించరు? రాజపూజితులుగానూ, రాజ్యాగ్రహానికి దూరంగానూ ఉండటానికి కాకుంటే!!
ఇవన్నీ ఎంత వాస్తవమో సినారె ఆశావహ దృక్పథాన్ని ఏ క్షణంలోనూ వీడని కవి అన్నది కూడా అంతే వాస్తవం. ఆయన కోరుకున్న మానవీయ సమాజం ఏనాటికైనా రూపొంది తీరుతుందనేకాక, అంతే గట్టిగా మనిషిని కూడా నమ్మిన కవి.

అందుకై ఎదురుచూసేవారి గురించి చెప్పిన ఆయన వాక్యాలతోనే దీన్ని
ముగించటం సబబుగా ఉంటుంది. నిరీక్షణ… నిస్సహాయత కాదు! అది సంకల్పించిన లక్ష్యసిద్ధి కోసం మనసుని అచంచలంగా నిలిపే ఏకాగ్రత!!

(జూలై 2017,ప్రజాసాహితి నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *