(డా. డి.వి.జి.శంకర రావు)
ఈ రోజు అస్తమించిన తెలుగు కధా సూరీడు కారా మాస్టారు తో నాకున్న పరిచయం చాలా తక్కువ.అయినా ప్రభావశీలమైన మినీ కధ లాంటిదని చెప్తాను. ఎందుకంటే ఎంత చిన్న పరిచయమైనా గాఢమైన ముద్ర వేసింది కనుక.తెలుగు కధల్లో ఇష్టమైనవాటిలో యజ్ఞం కధ ఒకటి.
స్టూడెంట్ గా ఉన్నప్పుడు చదివి ముగ్ధుడినయ్యాను.ఆయన అభిమాని నయ్యాను. ఎంపీగా 15ఏళ్ల క్రితం ఒకటి,రెండు సాహిత్య సమావేశాల్లో హడావిడిగా కలుసుకోవడం అయ్యింది.
తెలుగు సాహిత్యం లో పెద్దాయన పక్కనే శ్రీకాకుళంలో ఉన్నా కలవలేక పోతున్నందుకు బాధపడి ఒకరోజు అదే పని పెట్టుకుని వెళ్ళాను.
ఆరోజు సెప్టెంబర్ ఆరు,2019.మిత్రులు చీకటి దివాకర్, ఎన్ కె బాబు,రచయితలు గంటేడ, అట్టాడ, మురళి కలిశారు. వయోభారంతో ఉన్నా పడక కుర్చీలో కూర్చుని శ్రద్ధగా ఒక పుస్తకం తిరగేస్తున్నారు.
పరిచయం చేసుకుంటే, గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. చక్కగా ,ఓపిగ్గా మాట్లాడారు. సాహిత్యం గురించి, సమాజం గురించి అలాగే వివిధ విషయాలు -ఈ రెంటి గురించే -స్పష్టంగా మాట్లాడారు.
దాదాపు ఒక గంటసేపు ఆయనతో గడిపి వుంటాం. ఆహ్లాదకరమైన సమాలోచన.సెలవు తీసుకునే ముందు ఆయనపై తీసుకు వచ్చిన ప్రత్యేక సంచిక -కాళీపట్నం నవతీతరణం-పై ఓపిగ్గా సంతకం చేసి బహుకరించారు.
తర్వాత ఆయన రూపుదిద్దిన కధానిలయం సందర్శించాను.ఎంతో శ్రమకోర్చి తెలుగులో వచ్చిన అన్ని కధలను ఒక చోట జాగ్రత్త పరచిన ఆ ఆలోచనకు,కార్యరూపమిచ్చిన అంకిత భావానికి జోహార్లు.
తెలుగు భాషకు,తెలుగు కథలకు, కధకులకు అపురూపమైన కానుక. ఆ నిలయంలో నేను రాసిన కధలు కూడా ఉంటాయి కదా అన్న ఆలోచన మురిపించింది.
ఇక శ్రీకాకుళం ఎప్పుడు వచ్చినా ఆయన్ని కలిసివెళ్లాలి అనుకున్నాను కానీ కరోనా రోజుల్లో మరి వీలుపడలేదు. ఆయన భౌతికంగా వెళ్లిపోయారు.
ఆయన తలపెట్టిన మహాయజ్ఞం కొనసాగుతుంది.సమాజానికి పనికి వచ్చే సాహిత్యం సృష్టించడమే ఆ మహాయజ్ఞం.ఆయన నుండి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రేరణ పొందిన ఎంతో మంది తెలుగు బిడ్డలు సాహితీ క్రతువులో పాలుపంచుకుంటున్నారు. ముందు ముందు కూడా వస్తారు. నివాళులతో..
(డా. డి.వి.జి.శంకర రావు , మాజీ ఎంపీ, రచయిత, పార్వతీపురం. 94408 36931)