గాంధీ భవన్ షబ్బీర్ కుటుంబానికి ఉత్తమ్ ఆర్థిక సాయం

గాంధీ భవన్ సీనియర్ ఉద్యోగి షబ్బీర్ నిన్న కరోనో తో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. గాంధీ భవన్లోకి ఎవరు ప్రవేశించినా  మొదట చిరునవ్వుతో పలకరిస్తూ ఎదురయ్యే మనిషి షబ్బీర్.  పార్టీ అధికారంలోఉన్నా,  లేకున్నా  ఆయన గాంధీ భవనతోనే అనుబంధంతో పెంచుకున్నాడు. అధికారం ఆయనకు ఏ ప్రయోజనం చేకూర్చలేదు. ప్రయోజనం పొందే నేర్పరి కూడా కాదు. అయితే, ఆయనెపుడూ గాంధీ భవన్ వదలి మరొక బతుకుదెరువు మార్గం చూసుకోలేదు.

విలేకరుల సమావేశానికి ప్రారంభోత్సవం చేసేదాయనే.  విలేకరులంతా వచ్చారని ఒక సారి చూసుకుని వెంటనే బిస్కట్లు, చాయ్ అందించే వాడు. పత్రికల వాళ్లందరికి ఆత్మీయుడు.  ఇలాంటి వ్యక్తి గాంధీభవన్ లో ఇక కనిపించడనేది  అక్కడి రెగ్యులర్ వెళ్లే వాళ్లందరికి బాధాకరమే. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అనుబంధమే ఉన్న మరొక వ్యక్తి పంతులు. పంతులు నాటి ముఖ్యమంత్రి రోశయ్యకు క్లాస్ మేట్ కూడా. పంతులు చనిపోవడం పెద్దలోటు. ఇపుడు షబ్బీర్ పోవడమూ అంతే లోటు.

ఈ లోటును టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తించారు.  శుక్రవారం నాడు షబ్బీర్ ఇంటికి వెళ్లి ఆయన భార్య ను కుటుంబ సభ్యులను పరామర్శించారు. షబ్బీర్ నిజాయితీగా నిరంతరం పార్టీ కోసం పని చేసారని, ఆయన మరణంతో గాంధీ భవన్ చిన్న బోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాత్కాలికంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని షబ్బీర్ కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్బంగా ఉత్తమ్ వెంట టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావ్, ప్రధాన కార్యదర్శులు బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, ఫిషర్ మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *