IIM కు సెలెక్టయిన ఇద్దరు తెలంగాణ గురుకుల విద్యార్థులు

తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ పూర్తి చేసిన ఇద్దరు విద్యార్థుల బదావత్ సోని, రాథోడ్ నరేశ్ విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) సంస్థల్లో సీట్లు సంపాదించారు.

బదావత్ సోని(ఎంపీసిఎస్) నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి. తండ్రి ఆటో డ్రైవర్ కాగా, తల్లి దినసరి వేతన కూలి. జిల్లా పరిషత్ లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్న సోని, గిరిజన గురుకులంలో చదివి ట్రీచి ఐఐఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్2021-22కు సీటు సాధించింది.

అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన రాథోడ్ నరేష్(బికాం, హానర్స్) తల్లిదండ్రులు ఇద్దరూ దినసరి వేతన కూలీలు. సంగారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో పాఠశాల విద్య పూర్తి చేసుకున్న నరేశ్, గిరిజన గురుకులంలో చదువుకుని వైజాగ్ ఐఐఎంలో సీటు సాధించాడు.

ప్రతిష్టాత్మకమైన ఐఐఎంలలో సీట్లు సాధించిన ఈ విద్యార్థులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ వారికి అభినందనలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందన పూర్వకంగా లక్ష రూపాయల నగదు పారితోషికం, ఒక ల్యాప్ టాప్ అందిస్తోందని మంత్రి తెలిపారు. దీంతో పాటు వారికి అడ్మిషన్ సాధించిన ఐఐఎంలోని ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, మెస్ ఛార్జీలు పూర్తి ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.

గిరిజన గురుకులాల్లో విద్యార్థులకు జాతీయ,అంతర్జాతీయ స్థాయిల్లోని ఉత్తమ విశ్వవిద్యాలయాలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించడం కోసం ప్రభుత్వం క్యాట్, జీఆర్ఈ, టోఫెల్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తోందని తెలిపారు. ఫలితంగా ఇద్దరు విద్యార్థులు ఐఐటీలలో పిహెచ్ డీలలో సీటు సాధించగా, మరో 110 మంది వివిధ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందారన్నారు.

ప్రభుత్వ గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో చదివి ఉన్నత విద్య కోసం ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు అక్కడ చదివే ఆర్ధిక స్తోమత ఉండదని ముందే గుర్తించి, వారందరికీ కావల్సిన ఆర్ధికసాయం చేయాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నందున బదావత్ సోనికి, రాథోడ్ నరేష్ కు కావల్సిన ఆర్ధిక సాయం అందుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *