ప్రాంతీయ రూలింగ్ పార్టీల రెబెల్స్ కి భారతీయ జనతా పార్టీయే అండ. ఎందుకంటే మరొక ప్రాంతీయ పార్టీ ఎక్కడా బలంగా లేదు. కాంగ్రెస్ రెబెల్స్ ని అక్కున చేర్చుకుని స్థావరం ఇచ్చే శక్తి కోల్పోయింది. రూలింగ్ పార్టీతో పేచీ పడినపుడు కక్ష సాధింపు ఎలా ఉంటుందో తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారంలో చూస్తున్నాం.
అసలు కోవిడ్ఎమర్జన్సీ వైద్యం కంటే ఎమర్జన్సీగా ఆయన మీద విచారణకు కమిటీలు, ఆదేశాలు వెలవడుతున్నాయి. ఫిర్యాదు పత్రాలు అలా అందుతాయి, ఇలా విచారణ ప్రారంభమవుతుంది.
విచారణ ఆలస్యమై భూ కబ్జా మీద చర్య తీసుకొనకపోతే, రాత్రికి రాత్రి ఈటెల రాజేందర్ భూమిని సూట్ కేసులో పెట్టుకుని నీరవ్ మోదీ, మెహుల్ చౌస్కీ, విజయ్ మాల్యా లాగా ఎక్కడైనా విదేశాలలో దాచిపెడతాడేమో అన్నంత వేగంగా విచారణ జరగుతూ ఉంది.పాండెమిక్ లెక్క చేయకుండా అధికారులు దర్యాప్తులు, రీసర్వేలు చేస్తున్నారు.
ఆయన్ని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతూ ఉన్నదని ఈ వ్యవహారాన్ని గమనించే వాళ్ల కెవరికైనా అట్టే తెలిసిపోతుంది.
ఇలాంటపుడు ఏ నాయకుడయినా రక్షణ కోరుకుంటాడు. ఇలాంటి వాళ్లకి ఇపుడు బిజెపియే శ్రీరామ రక్ష. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ అండ తనకు అవసరమని, రక్షణ అని భావించి ఈటెల బిజెపిలో చేరవచ్చు. అదొక స్ట్రాటజీ. ఆయన ఢిల్లీ యాత్ర అందుకే నని చెబుతున్నారు. బిజెపికి కూడా ఇపుడు ఈటెల వంటి వక్త అవసరం. బిజెపిలో ఉన్న నాయకులు కెసిఆర్ విమర్శించడం వేరు. రేపు ఈటెల మైకుపట్టడం వేరు. కాబట్టి కెసిఆర్ మీద వచ్చే ఎన్నికల్లో గాని, ఈ మధ్యన గాని దాడిచేయించేందుకు బిజెపి ఈటెల ‘ఈటె’ లాంటి వాడే. నాగార్జున ఎన్నిక తర్వా బండి సంజయ్ మాటల పదను తగ్గింది. కాబటి బిజెపికి ఒక కొత్త గొంతు కావాలి.
సొంత పార్టీ పెట్టడం వంటి విచిత్ర ప్రయోగాలు ఈ దశలో చేస్తే జైల్లోకి తోసేయడం సులభం. అదే బిజెపి పంచన ఉంటే ఒక్క ఫోన్ కాల్ తోనో, లేక ఒక్క అమిత్ షా కంటి సైగతోనో అన్ని చర్యలను వాయిదా వేయించుకోవచ్చు. అందువల్ల బిజెపిలో చేరాలనుకోవడం ఈటెల రాజేందర్ సరైన నిర్ణయం, ఇపుడున్న పరిస్థితుల్లో,
ఆంధ్రలో వైసిపి నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణరాజు చేసిందదే. ఆయనకు బలాఢ్యడయిన ముఖ్యమంత్రి జగన్ తో పేచీ వచ్చింది. అయినా సరే పార్టీ నుంచి రాజీనామా చేయలేదు. ఆయన మీద చర్య తీసుకోవాలని వైసిపి ఎంపిలు స్పీకర్ ను కలిశారు తప్ప మరేమీ చేయలేకపోయారు. పార్టీకి రాజీనామా చేయకుండా పార్టీ విమర్శిస్తున్నందుకు ఈ పాటికి రఘురామ రాజు మీద ఏవూర్లో ఉంటే ఆవూర్లో రాళ్లు పడి ఉండాలి. వైసిపి కార్యకర్తలు ఘెరావ్ చేయాలి. ఆయన కారుకు అడ్డుపడాలి. ఇంటి మీద దాడులు జరిగి ఉండాలి. ఏమీ జరగలేదు. ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేయడం లేదు. అదీ రఘురమారాజు ఇమ్యూనిటీ.
దీనికి కారణం ఏమిటి? ఇంత బలం, స్థైర్యం రఘురామకు రావడానికి కారణం ఆయన బిజెపికి దగ్గరవడమే. ఆ తర్వాత ఆయన రెచ్చిపోయాడు. జగన్ మీద యుద్ధం ప్రకటించాడు. ఈ దశలో ఆయన రాజద్రోహం కింద అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేద్దామనుకున్నారు. సుప్రీంకోర్టుకూడా ఆయనకు అండగా నిలబడింది.
మొత్తానికి రఘురామ కు అంత ఇమ్యూనిటీ రావడానికి కారణం బిజెపియే కదా.
ఇదే సూత్రం ఈటెలకు కూడా వర్తిస్తుంది. కొత్త పార్టీ పెడితే ఈటెల మీద ప్రతివూర్లో రాళ్లు పడతాయి, కారు కదలకుండా రూలింగ్ పార్టీ కార్యకర్తలు అడ్డు పడతారు. తెలంగాణ ద్రోహి అని నినాదాలు చేస్తారు. పోలీసులు అరెస్టు చేయవచ్చు. రేయింబగలు ఇంటి చుట్టూ నిఘా పెట్టి హింసించవచ్చు. లాకప్ లో కొట్టవచ్చు. కొత్త పార్టీ జెండా ఎగరేయకుండా చేయవచ్చు.
ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎం జరిగింది? ఆయన కొత్త పార్టీ ఏమయింది? తెలంగాణ ఉద్యమం నడిపిన వ్యక్తి ఆయన. నిజాయితీ పరుడు.తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో ఆయన పార్టీ పెడితే దాంట్లోకి మెధావులు తప్ప ఓటర్లు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఇల్లొదలి బయటకు వెళ్లకుండా అడ్డుకుంది. అరెస్టు చేసింది. అయితే, ఆయన మీద నేరారోపణలు లేవు కాబట్టి సతాయింపులు అంతకు మించి ముందుకు సాగలేదు.
ఈటెల సంగతి అలా ఉండదు. ఆయన మీద తప్పో వప్పో ఫిర్యాదులున్నాయి. వాటిని ఆధారం చేసుకుని ఏమైనా చేయవచ్చు. వీటినుంచి ఇమ్యూనిటీ కావాలంటే ఈటెలకు మిగిలింది ఒక్కటే మార్గం, బిజెపిలో చేరడమే.
ఇంతకు మించి వయబుల్ మార్గం మరొకటి లేదు. మంచి ముహూర్తం, చూసుకోవడం కాషాయం కప్పుకోవడం శ్రేష్టం.
మరొక సాహసం పనికికాదు. కెసిఆర్ తో ఎవరు నేరుగా యుద్ధం చేయలేరు. ఆయనకు ఏదో పురాణ కథలో చెప్పినట్లు శత్రువు బలం కెసిఆర్ శరీరంలోకి జంప్ అవుతుంది. అందుకే కెసిఆర్ తో తగదా పెట్టుకున్నవాళ్లెవరూ ఇంతవరకు తెలంగాణలో బతికి బట్టకట్టలేరు. ఈటెల లేని బలం వూహిచుకోరాదు. సొంత పార్టీ ఆలోచనకంటే ఈటెల బిజెపిలో చేరడంగొప్ప సర్వైవల్ స్ట్రాటజీ. రాజకీయాల్లో మొండి ధైర్యం కాదు కావలసింది, ఎత్తుగడలు.